మానవుడే మహనీయుడు

అంతర్యామి

మానవుడే మహనీయుడు

గవంతుడి సృష్టిలో అనేక అద్భుతాలున్నాయి. వాటిలో మానవుడు ఒక అద్భుతం. మానవ శరీర నిర్మాణం పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు అవగతమవుతాయి. రక్తమాంసాలు, మలమూత్రాదులతో కూడిన మానవ దేహం అతి జుగుప్సాకరమైనది అంటారు, అనుకుంటారు నిరాశావాదులు. కానీ ‘ఇదే శరీరం పరబ్రహ్మ పదానికి మార్గదర్శి కూడా. బయటకు కనిపిస్తున్న దేహంలో  నమ్మశక్యం కాని ఎన్నో అద్భుతాలను అమర్చాడు సృష్టికర్త’ అన్నది వేదాంతులు చెప్పేమాట.      

పంచభూతాత్మకమైన ఈ శరీరంలో జ్ఞానం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి అయిదు అంతరేంద్రియాలు.  ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేవి పంచ ప్రాణాలు. చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అనేవి అయిదు జ్ఞానేంద్రియాలు. అయిదు కర్మేంద్రియాలు; శబ్దం, స్పర్శ, రూపం, రస, గంధం అనే అయిదు(పంచ) తన్మాత్రలు- వీటన్నింటి స్థూల కలయికే మానవ దేహం.

ఇవి కాక షట్చక్రాలు, పంచకోశాలు- మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాలు- మూడు గుణాలు, మూడు అవస్థలు, మూడు తాపాలు (తాపత్రయాలు)... వీటన్నింటినీ మానవ శరీరంలో నిక్షిప్తం చేశాడు సృష్టికర్త.

ఈ దేహంలో నేను అనే జ్ఞానమే జీవాత్మ. దాన్నే ప్రాణం అనీ అంటారు. ఈ దేహం కంటే విలక్షణమై జ్యోతి రూపంలో వెలుగుతున్న ఆత్మే పరంజ్యోతి. ఆ ఆత్మజ్యోతి మార్గదర్శనంలో జీవితాన్ని సక్రమంగా మలచుకోగలిగిన  మానవుడు ముక్తిని పొందుతాడు.

మానవ దేహంలో ఉన్న ఆరు చక్రాలకు ఆరుగురు అధిదేవతలున్నారు. మూలాధార చక్రానికి విఘ్నేశ్వరుడు, స్వాధిష్ఠాన చక్రానికి బ్రహ్మ, మణిపూరక చక్రానికి మహావిష్ణువు, అనాహత చక్రానికి రుద్రుడు, విశుద్ధి చక్రానికి చంద్రుడు, ఆజ్ఞేయ చక్రానికి ఈశ్వరుడు అధిదేవతలుగా కొలువై ఉన్నారు. ఈ చక్రాలకు పైన సహస్రారం ఉంది. దీనిలో తేజోమయమైన రూపంలో సహస్రదళ కమలం ‘ఓం’ అనే ప్రణవం వర్ణ రంజితమై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధిని నియమిత చక్రాల్లో సంచరించేలా చేసే వాయువే ప్రాణం.  

ఆత్మను ఆవరించి అయిదు కోణాలున్నాయి. మన దేహం అన్నమయమైనది. అంటే ఆహారం ఉంటేనే శరీరం జీవిస్తుంది. దీన్ని అన్నమయకోశం అంటారు. శరీరమంతా వ్యాపించి కళ్లు ఇతర ఇంద్రియాలకు శక్తిని, కదలికను ఇస్తున్న వాయువును ప్రాణమయ కోశం అంటారు. అయిదు  జ్ఞానేంద్రియాలు, మనసును కలిపి మనోమయకోశం అంటారు. చేసే పనుల్లోని మంచి చెడులను విశ్లేషించి, వ్యక్తిని మంచి మార్గం వైపు మరల్చే జ్ఞానాన్ని కలిగించేది విజ్ఞాన మయకోశం. ఆత్మలోని పరమానందానికి ప్రతిబింబమైన ఆనందమయ కోశం చివరిది. ఎవరికైనా ఇష్టమైన వస్తువు లభించినప్పుడు సంతోషించేది ఆనందమయకోశం. పుణ్యకార్యాల ఫలితంగా ఇది అనుభవానికి వస్తుంది. ఇదే అంతరాత్మ. ఈ అయిదు కోశాలను అధిగమించినప్పుడు పరమోత్కృష్ట స్థితిలో ఉన్న సాక్షీభూతమైన పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఆ స్థితికి చేరిన జీవాత్మ సమాధి స్థితి నుంచి పొందే అనుభూతిని అపరోక్షానుభూతి అని అంటారు.

‘ఇంద్రియాలు, తమంత తామే స్వయంగా పని చేస్తున్నాయని మానవులు అనుకుంటారు. కానీ అంతర్గతంగా మరొకరున్నారు. తనలోని తత్వమే దివ్య చైతన్యమని మానవుడికి తెలియదు’ అన్నారు రామకృష్ణ పరమహంస. ప్రతీ ఆత్మ దివ్యత్వ హర్షితమై ఉన్నదని, లోపల ఉన్న అమృతత్వాన్ని వ్యక్తీకరింపజేయడమే మన లక్ష్యమని వివేకానందస్వామి ప్రకటించారు.

- వి.ఎస్‌.ఆర్‌.మౌళి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న