close

అంతర్యామి

గురుపూర్ణిమ

షాఢ పూర్ణిమ వ్యాసభగవానుడి జన్మదినం. ఆయన పేరుతో వ్యాసపూర్ణిమగా, గురుపూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఆదిశంకరులే మొదట వ్యాసపూర్ణిమగా వ్యవహరించినట్లు చెబుతారు. యతులు, రుషులు, తాపసులు వ్యాసుణ్ని సద్గురువుగా భావించి ఆరాధిస్తారు. అందువల్ల దీన్ని గురుపూజా దినోత్సవంగా జరుపుకొంటారు. పంచమవేదం మహాభారత రచన చేయడమే కాకుండా అష్టాదశ పురాణాల స్రష్టగా వ్యాసమహర్షి ఆరాధ్యుడు. ఈ పర్వదినాన ‘శివశయన వ్రతం’ చేయాలని వ్రతగ్రంథాలు చెబుతున్నాయి. స్మృతి కౌస్తుభం ఈ శివ శయనోత్సవాన్ని ‘శివేపవిత్రారోపణమ్‌’గా అభివర్ణించింది. ఈ రోజున ‘కోకిలావ్రతం’ కూడా ఆచరిస్తారు. ద్రుపదుడి భార్య కోకిలాదేవిని నేడు పూజిస్తారు. ఈ పూర్ణిమనాడు వైష్ణవ పురాణం దానంచేస్తే విష్ణు సాయుజ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

వ్యాస భగవానుడు సకల కళానిధి. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకుపోయినప్పుడు, అవి అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. కొంతకాలానికి శ్రీమహావిష్ణువే వ్యాసావతారం ఎత్తి ఆ వేదాలను విభజించి క్రమబద్ధం చేశాడు. చిక్కుపడిన వేదాలను విభజించిన విద్యావేత్త కావడంవల్ల వ్యాసుడు వేదవ్యాసుడైనాడు. ఆయన శస్త్రచికిత్సావేది కూడా. ఈసుతో గాంధారి దిగజార్చుకున్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి, ఆ పిండంలో నూట ఒక్క శిశువులు ఉండటం గమనించి, నేర్పుతో ఓ నేతికుండలో నిక్షిప్తంచేసి, పోషించి జీవంపోసిన వైద్యశిఖామణి, ఆత్మవిద్యానిధి. ఆషాఢ శుద్ధపూర్ణిమ రుద్రసావర్ణి మన్వంతరాది దినం. ‘రుద్రసావర్ణి’ పన్నెండో మనువు. పురాణాల్లో నిగూఢంగా నిహితం చేసిన విషయాలను, ఇతివృత్తాలను మానవజాతికి బోధించి, జాగృతం చేయడానికి తగినంత జ్ఞానం సముపార్జించాలంటే వ్యాసమహర్షి అనుగ్రహం ఆవశ్యకమంటారు. గురువులకు గురువులైన వారంతా ఆ సద్గురువు కృపాకటాక్ష ప్రసాదంకోసం తపిస్తారు.

అజ్ఞానమనే అంధకారం తొలగించి జ్ఞానజ్యోతిని ప్రసాదించే మార్గ నిర్దేశకుడు గురువు. గురువు ఉన్నచోట ముక్కోటి దేవతలూ సంచరిస్తారని, గురువాక్యం మంత్రానికి ఆద్యమని; ఆచార్యుడు, తండ్రి, అన్న, రాజు, మేనమామ, మామ, తల్లి, మాతామహుడు, పితామహుడు, కులపెద్ద, పినతండ్రి- ఈ పదకొండుమందీ గురువులేనని శాస్త్రకథనం. వ్యాస మహర్షిని ఆరాధిస్తే వీరందరినీ పూజించినట్లే. కనిపించని భగవంతుణ్ని చూపించేవాడు గురువు. సద్గురూత్తముడికన్న మించినవారు లోకంలో లేరని, దేవుడు ఆగ్రహిస్తే గురువు శిష్యుణ్ని ఆదుకుంటాడు కాని, గురువుకు ఆగ్రహంవస్తే దేవుడైనా క్షమించడని ‘విశ్వసారతంత్రం’లోని గురుగీత చెబుతోంది.

కాల చక్రగతిలో పునరావృతమయ్యే విశ్వచరిత్రను ఇతిహాసంగా మహాభారతానికి రూపకల్పన చేసి జాతిని ఉద్దీప్తపరచిన భవిష్య పురాణద్రష్ట, స్రష్ట- వ్యాసుడు. తన రచనలో తానూ పాత్ర ధరించి, ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమార్గం చూపిన మహానుభావుడు. వ్యాసుడి భార్య వటిక. కుమారుడు శుకుడు. తండ్రికి తగ్గ తనయుడిగా శుకుడు బ్రహ్మవిద్య నేర్చుకొని మోక్షం పొందాడు. బ్రహ్మసూత్రాలు రచించిన వ్యాసుడు ఉపనిషత్‌ రహస్యాలను అరచేతిలో ఉసిరికాయలా ఉంచిన ఆధ్యాత్మిక వైతాళికుడు. వాత్సల్యమూర్తి, కృపాసింధువు, మహాజ్ఞాని. వ్యాసుడి జ్ఞానబోధ వల్లనే భరతభూమి ప్రపంచదేశాలకు ఆదర్శమై అలరారుతోంది.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.