close

అంతర్యామి

త్రికరణాలు

నలో చాలామంది, ఆధ్యాత్మిక సాధన చేయాలని తపిస్తారే తప్ప- అందుకు కావలసిన, ఉండవలసిన సులువులు, మెలకువలు పట్టించుకోరు. చాలావరకు...  తెలియదు కూడా. ప్రాథమికంగానే, పునాది దశలోనే తెలుసుకోవలసిన, అనుసరించవలసిన సూత్రాలను విస్మరిస్తూ ఉంటారు. అవి సాధారణంగానే కనిపిస్తున్నా మన ఆధ్యాత్మిక ప్రగతికి అసాధారణంగా దోహదపడతాయి. కొన్నిసార్లు పురోగతికి అవే ప్రథమ ప్రాధాన్యమూ కావచ్చు. అలాంటివాటిలో త్రికరణాలను ఏకీకరణం చేయడం ఒకటి.

ఇది సాధారణమైన సాధన కాదు. అత్యంత ప్రముఖమైన, అత్యవసరమైన సాధన. సాధనలో మనకు ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రత అంటే మనసును పరిపరి విధాల పోనివ్వని, ధ్యేయంవైపు మాత్రమే నడిపించే అత్యంత జాగరూకత. అన్ని కరణాలను ఏకోన్ముఖం, ఏకీకృతం చేసే కీలక వ్యవహారం. సూర్య కిరణాలను ఏక కోణంలోకి మళ్లిస్తే ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. అదే విధంగా మనలోని సర్వ కర్మేంద్రియాల వ్యవహారాన్ని నిలుపుదల చేసి, సర్వ జ్ఞానేంద్రియాల వ్యాపారాన్ని ఆపేసి, మనోదృష్టిని మాత్రం ధ్యేయపరం చేసి, నిశ్చలమైన బాహ్యాంతఃకరణాలను కాలాతీత క్రియలో నిలిపిఉంచడమే- ఏకాగ్రత ధ్యానం, ధ్యేయం.

త్రికరణాలు అంటే- మనో వాక్కాయకర్మలు. మనసు, వాక్కు, చేసే కర్మ. ఒక బండికి ఎన్ని ఎద్దులు కట్టినా, ఎన్ని పగ్గాలు బిగించినా అన్నీ ఒకవైపు, ఒకే వైపు లాగితే బండి బరువుకు అతీతంగా ఆ వైపే పయనిస్తుంది. మూడు పగ్గాలతో మూడు వైపులా లాగితే బండి ఒక్క అంగుళం కదలకపోగా, విచ్ఛిన్నమయ్యే ప్రమాదమూ ఉంది. మనం ఒక విషయాన్ని గురించి మనసులో ఒకరకంగా ఆలోచించి, వాక్కుతో మరోరకంగా చెప్పి లేదా మాట్లాడి, శరీరంతో మరోరకంగా చేస్తే ఆ విషయంమీద మనకు పట్టు ఉండదు. అంటే సత్యాన్ని మనం మూడు రకాలుగా విభజించామన్న మాట. అలాంటప్పుడు ఆ విషయంమీద మనకు, మనసుకు అధికారం ఉండదు. తగిన విధంగా మలచుకునే అవకాశం ఉండదు. ఏకీకృతం కాని త్రికరణాలను (మనసు, శరీరం, వాక్కు) సమన్వయం చేయడం ఎంతో శ్రమ అయిపోతుంది. ఏకాగ్రం చేయవలసిన మనసును మనంగా మూడు రకాలుగా చీల్చవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఎందుకంటే వాక్కునైనా, దేహాన్నయినా అదుపు చేయవలసింది, ఆడించవలసింది మళ్ళీ మనసే. ఈ చాంచల్యం, ఈ పని విభజన మనసును చిరాకుపరుస్తాయి. మన ధ్యేయం మనసును ప్రశాంతంగా ఉంచడం. మరోదారి లేకుండా చేసి ఏకోన్ముఖం చేయడం మనసులోని అంశాన్నే కాయం చేస్తే దాని గురించే వాక్కు మాట్లాడితే (వెల్లడిస్తే) మనసుకు విచలితం అయ్యే బాధ తప్పుతుంది. దానికి ఈ చిందులు వేసే బాధలనుంచి, రంగులు మార్చే బాధ్యతల నుంచి విముక్తి కలిగిస్తే ప్రశాంతంగా స్థిమితపడి ధ్యానంవైపు మళ్లుతుంది. శ్వాసను అనుసరించమని ఆ వైపు మళ్లిస్తే బుద్ధిగా మళ్లుతుంది.

సహజంగానే ఎంతో చంచలమైన మనసుకు మళ్ళీ మనమే మూడు దారులు చూపి మూడురకాల కుప్పిగంతులు వేయించడం తగదు. అత్యంత బలీయమైన మనసును మనమే ఇలా బలహీనపరచడం మన ధ్యేయానికే గొడ్డలిపెట్టు. నిజానికి ప్రారంభ సాధకులకు చాలామందికి ఈ సులువు సూత్రం తెలియదు. సాధనకు అత్యంత కీలకమైన ఈ అంశాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా సాధనలో ముందుకు వెళ్తాం. ఈ సూత్రం ఆధ్యాత్మిక సాధనకో, ఏకాగ్రతకో మాత్రమే కాదు- సాధారణ జీవన వ్యాపారంలోనూ త్రికరణాల ఏకీకరణను ఒక ఉన్నతస్థాయి సంస్కారంగా పరిగణిస్తారు. ఏ కార్యసాధనకైనా అది ఉత్తమ ఉపకరణంగా ఉపయోగపడుతుంది.

- చక్కిలం విజయలక్ష్మి

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.