close

అంతర్యామి

ఎక్కడుంటాడు దేవుడు?

‘భగం’ అనే మాటకు ఐశ్వర్యం, జ్ఞానం, కీర్తి, సౌందర్యం, బలం, వీర్యం, ప్రేమ, కాంతి, తపస్సు, వైరాగ్యం... వంటి ఎన్నో అర్థాలు చెబుతాయి నిఘంటువులు. ఇవన్నీ ఎవరియందుంటాయో- ఆయనే భగవంతుడు. ఏ ప్రతిమలోనో లేదా ఒక వ్యక్తిలోనో ఆ లక్షణాలను భావన చేసేవాడు- భక్తుడు. భక్తుడి విశ్వాసం ఎంత బలమైనదో భగవంతుడు అంతటి బలవంతుడు. భావన ఎంత నిజమైనదో దేవుడు అంత నిజం.

మనల్ని ఎవరైనా ‘మీరు దేవుణ్ని చూశారా’ అని ప్రశ్నిస్తే కంగారుపడతాం. లేదని చెప్పేస్తాం. ఏడుకొండలూ ఎక్కి మనం దర్శించింది ఆ దేవాదిదేవుణ్నే అనే భావం మనలో స్థిరపడలేదని దాని అర్థం. అదే ఏ నిజమైన భక్తురాలో అయితే తన బిడ్డను పైకెత్తి భగవంతుణ్ని చూపిస్తూ ‘జేజికి దణ్నం పెట్టుకో నాయనా’ అంటుంది. ఆ శ్రీమూర్తిలో ఆమె భగవంతుణ్ని భావన చేసింది కనుక ఆ మాట అనగలుగుతుంది.

‘భగవంతుడు దేనియందున్నాడు?’ అన్న ప్రశ్నకు వేదం మహిమలో అని బదులిచ్చింది. ఆ జవాబులో ఎన్నో అర్థాలున్నాయి. లోకంలో చాలాసార్లు నిజమయ్యే విషయమది. ‘విరివిగా నీ మహిమలు చూపిస్తూఉండు. తద్వారా నీ ఉనికిని కాపాడుకుంటూ ఉండు’ అని కాసుల పురుషోత్తమ కవి నేరుగా భగవంతుణ్నే హెచ్చరించాడు. విశ్వాసం కలవారందరికీ మహిమలు నిజం. లేనివారికి అవి కట్టుకథలు. కాబట్టే ‘భగవంతుడనేది ఒక భావన’ అని చాలామంది అభిప్రాయం.

దేవుడొక్కడే అని పురాణాలు చెప్పాయి. ‘ఒక్కడా, ఇద్దరా కాదు... ఉన్నదల్లా దేవుడే’ అని సిద్ధ పురుషులు ప్రకటించారు. ఏ దేవుడి ఆరాధనతో అద్భుతమైన సంతృప్తి కలుగుతుందో, ఆ దేవుడే ఆ భక్తుడికి సత్యం. ఒక్కో భక్తుడికి ఒక్కో దేవుడి మీద గురి ఏర్పడుతోంది కాబట్టే హిందూ మతంలో దేవుళ్ల సంఖ్య అధికంగా ఉంటుంది.

వాల్మీకి రామాయణంలో హనుమంతుడు భక్తుడే తప్ప భగవంతుడు కాడు. ఆ మాటకొస్తే శ్రీరామచంద్రుణ్నే భగవంతుడిగా చెప్పలేదు మహర్షి. ‘పురుషోత్తముడు’ అనేసి ఊరుకున్నాడు. అయితే, భగం అనే మాటకు నిఘంటువు చూపిస్తున్న లక్షణాలన్నింటినీ వాల్మీకి మహర్షి శ్రీరాముడిలో నిరూపించాడు. ఆయా సందర్భాల్లో రాముడి ప్రవర్తనలోంచి వాటినన్నింటినీ ప్రదర్శింపజేశాడు. ఆ లక్షణాలు ఉన్నందువల్ల రాముడు మనకు దేవుడయ్యాడు. వాటిని రాముడిలో భావన చేసే వారందరూ రామభక్తులయ్యారు. వాల్మీకి రామాయణంలో వానరుడిగా జన్మించి, భక్తుడిగా పరిచయమై విశ్వసించినవారి గుండెల్లో దైవంగా ఎదిగినవాడు హనుమంతుడు. లోకంలో రాముడి కన్నా ఎక్కువ సంఖ్యలో హనుమకు దేవాలయాలు ఏర్పడటం విశేషం.

విగ్రహంలో దేవుణ్ని భావన చేస్తూ భక్తితో కొలవడాన్ని ‘ప్రతిమారాధనం’ అంటారు. ఒక కాలంలో ప్రతిమారాధనం అపహాస్యానికి గురైంది. ఒక రాజాస్థానంలో వివేకానంద స్వామికి ఈ చేదు అనుభవం ఎదురైంది. రాతిబొమ్మలకు హిందువులు పూజలు చేస్తారని స్వామి ఎదుట ఎవరో హేళన చేశారు. వెంటనే వివేకానందుడు ఆ రాజుగారి చిత్రపటాన్ని తెప్పించి ఆయన ముందుంచాడు. దానిమీద కాండ్రించి ఉమ్ము వేయమన్నారు. విమర్శకుడు వెనక్కు తగ్గాడు. ‘అది రాజుగారిది’ అన్నాడు. ‘ఇది బొమ్మకాదని మీరెలా అనుకుంటున్నారో, అలాగే అవి రాతిబొమ్మలు కావని, దైవ స్వరూపాలని మేం భావించి పూజిస్తాం’ అని వివేకానందుడు బదులిచ్చి విమర్శకుడి నోరు మూయించాడు.

మనిషి భావనామయ జగత్తే భగవంతుడి రాజధాని. మనిషి హృదయమే భగవంతుడి భవ్యమందిరం. గర్భగుడిలో మూలవిరాట్టును కనుగొనడం కోసం చేసే ప్రయాణమే ఆధ్మాత్మిక సాధన!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.