close

అంతర్యామి

నిషిద్ధాక్షరి

వధాన ప్రక్రియలో నిషిద్ధాక్షరి ఒకటి. పృచ్ఛకుడు చెప్పిన అక్షరాలను వదిలేసి అవధాని ఆశువుగా పద్యాన్ని పలకాలి. అలా చెప్పగలగాలంటే అపారమైన అక్షర ఆరాధన, అనంతమైన సరస్వతీమాత అనుగ్రహం ఉండాలి. అలా ఉన్నవారంతా వాణికి ముద్దుబిడ్డలే. సాహితీ ప్రియులకు ఆదరణీయులే. జీవితం కూడా ఒక అవధానమే.

కొందరికది అష్టావధానం. మరికొందరికది శతావధానం. అవధానం ఏదైనా అది జీవన సాఫల్యానికి ఉపకరించాలి.

ప్రతి జీవితమూ ఒక కావ్యం.

ప్రతి అనుభవం ఒక పద్యం.

అయితే, కొందరి జీవితాలు మహాకావ్యాలు. అందులో ప్రతి అధ్యాయమూ రసభరితంగానే ఉంటుంది. నిస్సంశయంగా రామాయణం మహాకావ్యమే. శ్రీరాముడి అద్భుత చరితమే. సుందరకాండ అనే అధ్యాయం అత్యంత మహనీయం, రసవత్తరం, రసార్ణవం, రమణీయం.

ఆంజనేయుడి అసలు శక్తిని, భక్తిని, అమోఘ సేవానిరతిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అవగాహనా పరత్వాన్ని సుందరకాండలో చూసినంతగా మరెందులోనూ చూడలేం.

నిజానికి రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడికి రావణ కుంభకర్ణులను వధించడం కష్టమేమీ కాదు. కానీ, ఆ పని అవతార పురుషుడైన శ్రీరాముడు చేయవలసి ఉంది. కాబట్టి, ఆంజనేయుడికది నిషిద్ధాక్షరి లాంటిది.

‘నారాయణేన స్వయం’గా అవతరించిన శ్రీకృష్ణుడికి కౌరవసేనా వాహినిని సంహరించడం త్రుటిలో పని. కానీ ఆయన అందుకు తనకు తానే నిషిద్ధాక్షరి విధించుకున్నాడు. అర్జునుణ్ని ఆయుధంగా చేసుకున్నాడే తప్ప తానే ఆయుధం కాలేదు. ఘటోత్కచుడి కుమారుడు బర్బరీకుడు మహాభారత సంగ్రామాన్ని చిటికెలో ముగించగల శక్తిని కృష్ణుడి ముందు ప్రదర్శించి చూపినప్పుడు, అది దైవపథకానికి విరుద్ధం, నిషిద్ధం కనుక- అతణ్ని చక్రాయుధంతో సంహరించాడు కృష్ణుడు. అంతలోనే అతడి ప్రార్థన మన్నించి, కౌరవ మహా సంగ్రామాన్ని శిరసుతో వీక్షించే అవకాశం అనుగ్రహించాడు. ఆ బర్బరీకుడే అమోఘదృష్టితో రణరంగంలో రుద్రుడి అదృశ్యవిన్యాసాలను చూసి అబ్బురపడ్డాడు. జయాపజయాలు దైవాధీనాలు అనే పరమసత్యాన్ని బర్బరీకుడు గుర్తించాడు.

అది తెలియనంతకాలం మనిషి ఆధిక్యంతో గర్వంతో విర్రవీగుతాడు. అలా విర్రవీగినప్పుడల్లా విధి రూపంలో పరమాత్మ గర్వభంగం చేస్తూనే ఉంటాడు. అర్జునుడు, భీముడు, బలరాముడు, గరుత్మంతుడు... అలా గుణపాఠాలు నేర్చుకున్నవారే.
అహంకారం ఆధ్యాత్మిక శత్రువు. అది సాధనాఫలాలను దక్కనివ్వదు. పరమాత్మ అనుగ్రహాన్నీ పొందనివ్వదు. తల్లి తన పిల్లల తప్పులను సరిదిద్దినట్లు ఎంతో ప్రేమగా పరమాత్మ తన భక్తుల లోపాలను తొలగించి ఆత్మ పవిత్రతను కాపాడుతుంటాడు. ఆత్మ పవిత్రత లేకపోతే, కల్మష రహితం కాకపోతే- పరమాత్మ అనుగ్రహం అసాధ్యం.

ప్రతి మనిషికీ కొన్ని నిషిద్ధాక్షరాల సంపుటి ఉంటుంది. మనం ఏవి చెయ్యకూడదో చెప్పేవే ఆ నిషిద్ధాక్షరాల సంపుటులు. అవి ప్రధానంగా కూడని నడతలకు, సోమరి జీవనానికి సంబంధించి ఉంటాయి. ఆ నిషిద్ధాక్షరాల పరిధులు దాటనంతకాలం మనం సురక్షితం. మన ఆత్మ కల్మష రహితం. మన జీవనం ధన్యం.

ఆ నిషిద్ధాక్షరాలు ఏమిటో ఎవరికి వారే అన్వేషించి, అర్థం చేసుకుని పాటించాలి. అప్పుడు మనకు మనమే గురువులం, మనమే శిష్యులం కూడా!

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.