close

అంతర్యామి

గురు శిష్యులు

లోకంలో ముఖ్యమైన గురువులు ఇద్దరు. ఒకరు జగద్గురువు భగవాన్‌ శ్రీకృష్ణ పరమాత్మ; మరొకరు జగత్తును గురువుగా స్వీకరించిన శ్రీ దత్తదేవుడు. ముల్లోకాలను తన ఉదరంలో దాచుకుని జగత్‌ చక్రాన్ని నడుపుతూ దుష్ట శిక్షకుడు, శిష్ట సంరక్షకుడు అయిన దేవకీ పరమానందుడు, నందనందనుడు గురురూపుడై అలరారుతున్నాడు. అన్ని ధర్మాలను, అన్ని కర్మలను, ఆ గీతాచార్యుల పాదాల చెంత భక్తి ప్రపత్తులతో అర్జునుడి మాదిరిగా అర్పణ చేయాలి. అలాంటి శిష్యులను, భాగవతులను జ్ఞాన వైరాగ్యాలు అనుగ్రహిస్తాయి. అనన్య భక్తికి, నిరంతన నామచింతనకు మించిన దివ్యశక్తి మరొకటి కనిపించదు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు... ఈ నాలుగు రకాల భక్తులకు తగిన సమయంలో ఆ పరమాత్మ కరుణాకటాక్షం లభిస్తుంది. అందుకు అచంచలమైన విశ్వాసంతో, ఏకాగ్ర బుద్ధితో ఆయనను ఆరాధించాలి. నిజంగా, ఆ నలుగురు ఒకే వ్యక్తి పరిణామక్రమంలో పొందగల నాలుగు దశలకు ప్రతీకలు అనవచ్చు. ఏదో కావాలని భౌతికమైన వాంఛలతో వేధించి, సాధించేవాడు ఆర్తి. ఏముందో, ఏమవుతున్నదో, ఏం కాబోతున్నదో తెలుసుకోవడమే ముఖ్యం అనుకునేవాడు జిజ్ఞాసువు. ధర్మార్థ కామ మార్గంలో నడిచి మోక్ష గమ్యం ఆకాంక్షించేవాడు అర్ధార్థి. భగవత్‌ సామీప్యత తప్ప మరేదీ కోరని పూర్ణ ప్రజ్ఞుడు జ్ఞాని. అందుకే జ్ఞాని అంటే తనకు ప్రీతి అంటాడు కృష్ణుడు.

కారణ జన్ముడు, అవధూత, అనసూయాత్రి పుత్రుడు అయిన శ్రీదత్తుడు భూలోకపు ఆదర్శ గురువు. జీవిత పరమార్థం లౌకిక జీవితంతో ముడివడిఉంటుంది. ఈ చిక్కుముడిని చక్కబరచిన ఘనత కలవాడు అనఘా నాథుడు. ప్రకృతిలోని ఇరవై నాలుగు జీవులు తన గురువులని మనకు జ్ఞానబోధ చేసిన మహానుభావుడు! నీటిలోని చేప, ఆకాశంలో ఎగిరే పక్షి మనిషికి జీవిత పాఠాలు చెబుతున్నాయి. నీటిలోని తాబేలు దృష్టి  సదా గట్టుపైనే ఉంటుంది. గట్టుమీద ఉన్న గుడ్లు, వాటి రక్షణ- దాని ఏకైక లక్ష్యం. అలాగే మనమూ ఈ భౌతిక సమాజంలో జీవిస్తూ, ఆధ్యాత్మిక ప్రపంచం వైపు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి.

ఆకాశంలో ఎగిరే పక్షి ఆహారాన్ని భూమిపైన వెదుకుతుంది. భూమిపై ఉన్న మనం ఆకాశం గురించి, అక్కడకు చేరే అవకాశం గురించి ఆలోచించాలి.

నమ్మకస్తుడైన శిష్యుడు గురువును అనుసరిస్తూ ఆనందిస్తాడు. అక్కడితో ఆగకుండా గురువును అనుకరించగలవాడు మరో అడుగు ముందుకు వేస్తాడు. నమ్మకం లావాదేవీలకు, అమ్మకాలకు పరిమితమైన ఒక (మానసిక) స్థితి. పరిస్థితులను బట్టి అది తరగవచ్చు లేక వమ్ము కావచ్చు. కాని, విశ్వాసమున్న శిష్యుడు తొణకడు బెణకడు. నీచ జంతువైన కుక్కకు ఉన్న గొప్పతనం- విశ్వాసం. పిడికెడు అన్నం పెట్టిన చెయ్యిని అది జీవితాంతం వదలదు. కనిపెట్టుకుని చివరి క్షణం దాకా యజమానిని నీడలా వెన్నంటి నడుస్తుంది. విశ్వాసమే ధ్యాసగా, శ్వాసగా గల శిష్యుడు ధన్యుడు. అనుసరణ, అనుకరణ, నమ్మకం, విశ్వాసం, సాధారణ లక్షణాలు.

అంతకు మించిన బుద్ధిమంతుడు- శరణాగతుడు అయిన శిష్యపరమాణువు. తనువు, ధనం, మనసు, సర్వం నీవేనని నెరనమ్మిన (పుణ్యాత్ముడైన) శరణార్థిని భగవంతుడు వేయికళ్లతో కనిపెడుతూ ఉంటాడు. ఉయ్యాలలో చంటిపాపకు ఏడుపు నవ్వు తప్ప, మరొకటి చేతకాదు. కన్నతల్లి బిడ్డ ఆకలి దప్పుల్ని, నిద్రను భయాన్ని తెలుసుకుని పాలు నీరు, మందుమాకు అందిస్తుంది. అలాగే భక్తవత్సలుడైన ఆ భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు. నిష్కాములై, నిర్వికారులై, నిర్విరామంగా సేవలందించే భృత్యులను ఆదరిస్తాడు!

- ఉప్పు రాఘవేంద్రరావు

మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.