ఆక్సిజన్‌ ఎక్కడ దొరుకుతుంది?
close

తాజా వార్తలు

Updated : 30/04/2021 05:59 IST

ఆక్సిజన్‌ ఎక్కడ దొరుకుతుంది?

అధికారులు స్పందిస్తేనే ప్రాణాలు నిలిచేది..

ఈనాడు, అమరావతి

విజయవాడ సహా కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఎక్కువ మంది కొవిడ్‌ బాధితులు వెతుకుతున్నది.. ఆక్సిజన్‌ సిలిండర్ల గురించే. ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు ఉండడం, మంచాలు కూడా అంత తేలికగా దొరకకపోవడంతో ఇంటి దగ్గరే ఉండి వైద్యం తీసుకునే చాలా మందికి ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమవుతున్నాయి. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతుండడంతో అత్యవసరంగా ఆక్సిజన్‌ అవసరమవుతోంది. ఒక్క సిలిండర్‌ దొరికితే ఆస్పత్రికి వెళ్లకుండానే ఇంటి దగ్గరే ఉండి కోలుకునేవారు అధికంగా ఉన్నారు. వారికి అవసరమైన మందులన్నింటినీ.. తెలిసిన వైద్యులు, ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న ఓపీల ద్వారా తెచ్చుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. ఇలాంటి వారికి ఒక్క సిలిండర్‌ అందించగలిగితే ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉండే మంచాల కొరతకు కూడా పరిష్కారం చూపొచ్చని పలువురు వైద్యులే చెబుతున్నారు.

కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడంతో పాటు పరిస్థితి విషమిస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ పెట్టుకుందామని ప్రయత్నిస్తే అసలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు విక్రయిస్తారనే ప్రాథమిక సమాచారాన్ని కూడా కృష్ణా జిల్లాలో అధికారులు అందించడం లేదు. అందుకే ఇళ్ల వద్ద ఉంటూ చికిత్స పొందుతున్న వారిలోనూ లెక్కకు మించిన మరణాలు సంభవిస్తున్నాయి. శ్మశానవాటికల్లో తప్ప ప్రభుత్వ లెక్కల్లో ఇవేవీ నమోదు కావడం లేదు. ఆక్సిజన్‌ సరఫరా చేసే ఏజెన్సీలతో అధికారులు సమావేశాలు పెట్టడమే తప్ఫ. వారికి సంబంధించిన వివరాలు, ప్రజలకు కావాలంటే ఎలా పొందాలనే.. ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వడం లేదు. దీంతో విచ్చలవిడిగా బ్లాక్‌ మార్కెట్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లను అమ్ముకునే దళారులు పుట్టుకొచ్చారు. గతంలో రూ.5వేలు ఉండే సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.10వేల నుంచి రూ.15వేలకు అమ్ముకుంటున్నారు. దానికి ఆక్సిజన్‌ నింపేందుకు రోజువారీ ధరలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇవి కూడా ఎక్కువ మంది మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయి. అధికారులు కేవలం సమీక్షలకే పరిమితమవ్వడమే దీనికి ప్రధాన కారణం.

బెజవాడ జీజీహెచ్‌లో ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకు ఒకే స్ట్రెచర్‌పై

ఇద్దరు కొవిడ్‌ రోగులను కూర్చోబెట్టి తరలిస్తున్న దృశ్యం

అనేక ఉదంతాలు..

వన్‌టౌన్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ఒకరికి ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో ఆస్పత్రిలో మంచాలు దొరకలేదు. ఆక్సిజన్‌ సిలిండర్‌ ఎక్కడ దొరుకుతుందోనని గాలింపు చేపట్టారు. ఇలాగే పటమటకు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధురాలికి కూడా ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతుండడంతో సిలిండర్‌ కోసం వెతుకుతున్నారు. మరొకరికి ఆక్సిజన్‌ ఖాళీ సిలిండర్‌ ఉన్నా దానిలో మళ్లీ నింపేందుకు ఎవరిని సంప్రదించాలో తెలియదు. ప్రాణవాయువు కోసం వెతికి వెతికి చివరికి

అర్ధరాత్రి వేళ విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడ ఆక్సిజన్‌ ఉండే మంచాలకు డిమాండ్‌ భారీగా ఉండడంతో చక్రాల కుర్చీలు, స్ట్రెచర్‌లలోనే చాలా సమయం వేచి ఉండాల్సి వస్తోంది. కొంత మంది అక్కడే ప్రాణాలు వదులుతున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఏ కాలనీ, ఏ ప్రాంతం చూసినా ఆక్సిజన్‌ చుట్టూనే అనేక ఉదంతాలు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి.. ప్రాణవాయువును బాధితుల ఇంటికే అందించే మార్గం చూపిస్తే తప్ప ప్రాణాలు నిలబడే పరిస్థితి లేదు. కొంతమంది ఎంత డబ్బులైనా వెచ్చించి కొనుగోలు చేసుకుంటామని చెబుతున్నా.. అసలు ఆక్సిజన్‌ ఎవరు పంపిణీ చేస్తారు, ఎక్కడ దొరుకుతుందనేది తెలియక విలవిల్లాడుతున్నారు. జిల్లా అధికారులు ఆక్సిజన్‌ సరఫరా చేసే ఏజెన్సీలతో మాట్లాడి.. కొనుగోలు చేసుకుంటామనుకునే వారికి అందించే ప్రయత్నం ఇప్పటికైనా ఆరంభించాల్సిన అవసరం ఉంది. ఓ సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తే మరింత సౌకర్యంగా ఉంటుంది.

పడకలు ఖాళీ లేక విజయవాడ కొత్తాస్పత్రి వద్ద గురువారం ఓ మహిళకు

ఆటోలోనే ఆక్సిజన్‌ అందించారిలా...


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని