Crime News: కలచి వేసిన గతం! కలిసుండలేక.. మృత్యు పయనం  

తాజా వార్తలు

Updated : 24/09/2021 12:14 IST

Crime News: కలచి వేసిన గతం! కలిసుండలేక.. మృత్యు పయనం  

ఇసప్పాలెంలో విషాదఛాయలు

నరసరావుపేట లీగల్‌, న్యూస్‌టుడే: వారిద్దరిది ఒకే గ్రామం.. యుక్తవయసులో ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు... కానీ పెద్దలు అంగీకరించక పోవడంతో ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా గతం తాలూకూ జ్ఞాపకాలు మదిలో మెదిలేవి. మనసులు దగ్గరగా ఉన్నా.. మనుషులు వేరుగా బతకాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చివరకు అనూహ్య నిర్ణయం తీసుకుని చావులోనూ కలసి పయనించి.. ఈ లోకాన్ని వీడారు. శ్రీశైలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు చేసుకున్న ఇద్దరి జీవితాలు ఇలా ముగిశాయి. బత్తుల వెంకట కాళేశ్వరరావు (45), బత్తుల నాగలక్ష్మీ (40) ఇద్దరిదీ నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామం. వీరిద్దరు 15 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నా ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో కాళేశ్వరరావుకు గుంటూరుకు చెందిన లక్ష్మీతో వివాహమైంది. నాగలక్ష్మీకి నరసరావుపేట పట్టణానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కాళేశ్వరరావు గ్రామంలోనే ఉంటూ తాపి మేస్త్రీగా పని చేసేవాడు. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. బత్తుల నాగలక్ష్మీ నరసరావుపేట పట్టణంలోని పెద్దచెరువులో నివాసముండేది. భర్త టైలర్‌. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కరోనా కారణంగా కుటుంబం గడవటం కష్టంగా ఉండటంతో ఏడాది క్రితం నాగలక్ష్మీ భర్తను తీసుకొని స్వగ్రామమైన ఇస్సపాలెం వచ్చింది. ఇక్కడే ఉంటూ పలువురికి టైలరింగ్‌లో శిక్షణ ఇస్తూ జీవనం సాగించేది. ఏం జరిగిందో తెలియదు కానీ కాళేశ్వరరావు, నాగలక్ష్మీ శ్రీశైలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా నాగలక్ష్మీ కనిపించడం లేదని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆమె అక్క శివరాత్రి వెంకటరమణ ఫిర్యాదు చేసింది. మహిళ అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

నా గురించి ఎదురు చూడొద్దు 

నా గురించి ఎదురు చూడవద్ధు. నాపై ఆశలు పెట్టుకోవద్దు అని బత్తుల కాళేశ్వరరావు తన భార్య లక్ష్మీకి గురువారం ఉదయం 6 గంటలకు కాల్‌ చేసి చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. అనుమానం వచ్చిన లక్ష్మి తిరిగి భర్తకు భర్తకు కాల్‌ చేయగా స్పందించలేదు. రెండు గంటల అనంతరం కాళేశ్వరరావు భార్యకు శ్రీశైలం పోలీసులు ఫోన్‌ చేసి మీ భర్త మృతి చెందాడని తెలియజేయడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. 


శ్రీశైలంలో ఘటన.. 

శ్రీశైలం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని ఓ ప్రైవేట్‌ సత్రంలో గురువారం పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలేనికి చెందిన బత్తుల వెంకటకాళేశ్వరరావు, ఇదే గ్రామానికి చెందిన బత్తుల నాగలక్ష్మి మృతి చెందారు. శ్రీశైలం ఎస్సై సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సత్రంలో గదిని అద్దెకు తీసుకున్నారు. గురువారం ఉదయం శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగినట్లు తెలిపారు. పురుగుల మందు తాగిన వెంకటకాళేశ్వరరావు గది బయట కడుపులో తిప్పుతోందని కేకలు వేయడంతో సత్రం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో 108 వాహనంలో సున్నిపెంట వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శవపంచనామా అనంతరం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని