close
ఆంధ్రులకు ఆవేదనే 

ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు 
ఈ బడ్జెట్‌లోనూ మొండిచెయ్యే చూపిన కేంద్రం 
ఒక్క విభజన హామీ ప్రస్తావనా లేని ఆర్థికపద్దు

ఈనాడు, అమరావతి: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంధ్రప్రదేశ్‌కు చేసిన దగా సంపూర్ణమైంది. విభజన హామీలు, చట్టంలోని అంశాలు అమలు చేయకుండా గత ఐదు బడ్జెట్‌లలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనూ మొండి చెయ్యి చూపింది. ఎన్నికల సంవత్సరం కాబట్టి... ఓట్ల కోసమైనా రాష్ట్రానికి కేంద్రం ఏమైనా విదిలిస్తుందేమోనని ఏ కొద్ది మందిలోనో మిణుకుమిణుకుమన్న ఆశలూ అడుగంటాయి. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌. ఇక ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చేదేమీ లేదు. మోదీ ప్రభుత్వం ఏ విభజన హామీనీ తాజా బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. రెవెన్యూ లోటు ఊసేలేదు... రైల్వే జోన్‌ ప్రస్తావనా లేదు...   ప్రత్యేక హోదా లేదు... దుగరాజపట్నం పోర్టూ లేదు... విభజన హామీల్ని అమలు చేయాలన్న బాధ్యతను మోదీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.

రాష్ట్ర ప్రజలు చేస్తున్న పోరాటాన్ని, ఆవేదనను కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్రానికి ఇంకా రూ.1.16 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా రాసిన లేఖనూ పరిగణనలోకి తీసుకోలేదు. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టుల కేటగిరీలో... విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టుల వంటికి మాత్రం కంటితుడుపు కేటాయింపులతో సరిపెట్టింది. విభజన హామీలపై కేంద్రం కనీస దృష్టి సారించకపోవడం ఐదు కోట్ల ఆంధ్రులకు అంతులేని ఆవేదన మిగిల్చింది.

సగం ఇచ్చినా బాగుండేది..! 
విభజన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్‌లు, రాయితీల రూపంలో రూ.16,447 కోట్ల మేర రాష్ట్రానికి లబ్ధి చేకూరేదని అంచనా. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై మాట మార్చింది. హోదాతో సమానమైన ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. ఆపై దాన్ని అటకెక్కించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు దేశీయ ఆర్థిక సంస్థల నుంచి నేరుగా నిధులు సమకూర్చినా, రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన మొత్తంలో కనీసం సగం ఇచ్చినా కొంత వెసులుబాటు లభించి ఉండేది. కానీ కేంద్రం మొండి వైఖరిని వీడలేదు. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లోనూ కేటాయింపులు జరపలేదు. మొత్తంగా 2017-18, 2018-19 సంవత్సరాలకు ఏపీకి ఇవ్వాల్సిన రూ.700 కోట్లు వెంటనే విడుదల చేయాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదు.

రాజధాని నిర్మాణానికి ఇచ్చిన హామీ ఏమైంది? 
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు రూ.62,623 కోట్లతో కేంద్రానికి రాష్ట్రం సమగ్ర ప్రాజెక్టు సమర్పించింది. కానీ ఇంతవరకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1500 కోట్లు. మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పినా... ఇంతవరకు అమలు కాలేదు.

రెవెన్యూ లోటు పట్టించుకోరా? 
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లుగా కాగ్‌ ధ్రువీకరించింది. లోటును పూర్తిగా చెల్లిస్తామన్న హామీని విస్మరించి కేంద్రం మాత్రం రూ.3,979.50 కోట్లు మాత్రమే చెల్లిస్తామని చెప్పింది. మిగతా రూ.12,099.26 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా...కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్రానికి ఐదేళ్లపాటు జీఎస్టీ (కేంద్రం వాటా) రీయంబర్స్‌మెంట్‌, మొదటి ఐదేళ్లు ఆదాయపన్నులో కేంద్రం వాటా రీయంబర్స్‌మెంట్‌ వంటి రాయితీలు కోరినా...కేంద్రం ఇవ్వలేదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఒక మేజర్‌ పోర్టును అభివృద్ధి చేయాలి.

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌పైనా నిర్లక్ష్యం 
విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా (వీసీఐసీ) అభివృద్ధి ప్రాజెక్టును జాతీయ పారిశ్రామిక నడవాల అభివృద్ధి, అమలు ట్రస్ట్‌ (ఎన్‌ఐసీడీఐటీ) పరిధిలోకి తీసుకురావాలని, డీఎంఐసీ తరహాలో వీసీఐసీకి కూడా నూరుశాతం నిధుల్ని గ్రాంట్‌ రూపంలో ఎన్‌ఐసీడీఐటీ నుంచి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 2017 జూన్‌లో కోరింది. ఇంత వరకు స్పందన లేదు. ఈ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో కేంద్రం రూ.675 కోట్లు మాత్రమే కేటాయించింది. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైల్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్న హామీనీ కేంద్రం విస్మరించింది.

జాతీయ ప్రాజెక్టు పోలవరానికి కేంద్రమే పూర్తిగా నిధులు కేటాయించాల్సి ఉండగా నాబార్డు ద్వారా వాటిని అందిస్తామని మోదీప్రభుత్వం చెప్పింది. అయితే పూర్తయిన పనుల బిల్లులు ఆమోదించకపోవడంతో ఆ నిధులు విడుదల కావడం లేదు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన రూ.3500 కోట్ల నిధులనూ కేంద్రం విడుదల చేయడంలేదు. తాజా బడ్జెట్‌లో ఈ ప్రస్తావనలేవీ లేవు.

కేసులకు భయపడే..

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కేసులకు భయపడి  జగన్‌ ప్రధాని మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం తెదేపా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. విభజన హామీలను నెరవేర్చకుండా తప్పు చేశామని ప్రధాని మోదీ ఒప్పుకుని రాష్ట్రంలో అడుగుపెట్టాలి. ఈ నెల 10న మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో.. అదే రోజు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలతో కలిసి నల్లరిబ్బన్లతో నిరసన తెలపబోతున్నాం.  - మీడియా పాయింట్‌లో మంత్రి జవహర్‌, ఎమ్మెల్యేలు బొండా ఉమా, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

బడ్జెట్‌ నిరాశాజనకం

చివరి బడ్జెట్‌లో అయినా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం న్యాయం చేస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది. నాడు పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నా పట్టించుకోకుండా వ్యవహరించింది.

- ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి…, శ్రీనివాసులరెడ్డి

హోదా రాకుండా చేసింది బాబే

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేసింది చంద్రబాబే. శాసనసభ, శాసనమండలిలో విభజన హామీలపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ముఖ్యమంత్రి భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును ఉద్దేశించి మాట్లాడిన తీరుపై తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలవరానికి సీఎంకు ఏం సంబంధం ఉంది.ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంటే నేనే చేయిస్తున్నానని సీఎం ఎలా చెబుతారు.

- సోము వీర్రాజు, మాధవ్‌

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.