close

ఆంధ్రులను శిక్షిస్తే సహించం

దొడ్డిదారిన వైకాపాకు మద్దతిస్తే ఒప్పుకోం
హోదా హామీ ఎందుకు నెరవేర్చలేదో మోదీ చెప్పాలి
భాజపాతో బంధంపై వైకాపా స్పష్టత ఇవ్వాలి
చంద్రబాబు మాట మార్చారు
జనసేవ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌

ఈ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌, పవన్‌కల్యాణ్‌ మీ ముందున్నారు. పదేళ్ల భవిష్యత్తు తన చేతిలోగానీ, తన కొడుకు చేతిలోగానీ పెట్టమని చంద్రబాబు అడుగుతున్నారు. జగన్‌ తన భవిష్యత్తును ప్రజలే చూసుకోవాలంటున్నారు. నేను మాత్రం.. ప్రజల కోసం నా భవిష్యత్తును వదిలేస్తున్నా.. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా కడశ్వాస వరకు నేలతల్లికి సేవ చేస్తా. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే అవినీతిని ఇంటికి పంపించేస్తా.
 - పవన్‌కల్యాణ్‌

ఈనాడు, కాకినాడ-రాజమహేంద్రవరం డిజిటల్‌: ‘మోదీ దేశానికి ప్రధాని అయితే మంచి రోజులు వస్తాయని కలలుగన్నాం. అండగా ఉంటారని ప్రేమతో ఎన్నుకున్నాం.. భయపెట్టి పాలిస్తామంటే మేం భయపడం.. ఆంధ్రులు దేశ పౌరులు కాదా? మా పోలవరం ప్రాజెక్టును ఎందుకు కట్టరు? మా రైతులకు ఎందుకు అండగా నిలవరు? చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయనపై చూపించుకోండి.. ఆంధ్ర ప్రజలను శిక్షిస్తామంటే ఎలా?’’ అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ, వైకాపా అధ్యక్షుడు జగన్‌లపై ధ్వజమెత్తారు. చంద్రబాబు పదే పదే మాట తప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన పార్టీ ఏ పరిస్థితుల్లో ఆవిర్భవించిందో చెప్పుకొచ్చారు. తెలుగుజాతి సుస్థిరత కోసం 2014లో  జనసేన వచ్చింది. ఈసారి సమతుల్యత కోసం ఎన్నికల్లో పోటీచేస్తోంది. 2019 ఎన్నికలతో యువత కోరుకునే మార్పు రావాలని, అవినీతి వ్యవస్థ పోయే, ఓట్లను డబ్బులతో కొనలేని సమాజం రావాలని, ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగే మార్పు రావాలని, చదువుకునే విద్యార్థి ఏ ఉద్యోగం చెయ్యాలని సతమతం అయ్యే మార్పు రావాలంటూ ఆ దిశగా జనసేన అడుగులు వేస్తోందని చెప్పారు.

జగన్‌కు బీసీలపై ప్రేమ ఉంటే కడప, పులివెందుల సీట్లు కేటాయించాలి
‘‘ఆ రోజు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి శిక్షించింది. మాకు అన్యాయం జరుగుతోందని ఏ ఒక్క ఎంపీ అడగలేదు.  అడిగిన వారిని కుక్కలకంటే హీనంగా చూశారు. చిన్న రాష్ట్రాలకు మేం అనుకూలం అంటూ 1996లో కాకినాడలో ఒక తీర్మానం చేసి దానికి అనుగుణంగా  రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చటానికి అంగీకరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి మాట తప్పారు. పల్లకీ ఎక్కించి భాజపాను భుజాన మోస్తే  దొడ్డిదారిన వైకాపాకు అండగా ఉంటానంటే ఏం చేస్తాం.
భాజపాతో కలిసి ఉన్నారా ? లేదా..? అన్నదానిపై జగన్‌ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోతే పాస్‌పోర్టుతో అక్కడికి వెళ్లాల్సి వస్తుందని 2009 గుంటూరు సభలో దివంగత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇలాగేనా మీ నాన్న అడుగుజాడల్లో నడిచేది? సభలు, సమావేశాలు పెడితే బీసీల అభివృద్ధి జరగదు.. బీసీలపై ప్రేముంటే కడప, పులివెందుల సీట్లు వారికి కేటాయించండి. మీ కుటుంబాన్ని కాదని మిగిలిన వారికి సీట్లివ్వగలరా?

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి రోజు నుంచి అండగా ఉండుంటే ఈ సరికే ప్రత్యేక హోదా తెచ్చేవాడిని. పదేపదే మాట మార్చిన విధానం బాధ కలిగించింది. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నాకు శత్రువుల్లేరు. చంద్రబాబు, జగన్‌తో వ్యక్తిగత విభేదాల్లేవు. ప్రజలకు సంపూర్ణ న్యాయం జరగనప్పుడు వీరు మారాలని కోరుకుంటున్నా.

బీసీలకు అండగా..
32 మందితో కూడిన తొలి జాబితాలో జనసేన బీసీలకు అండగా నిలిచింది. పార్టీ పెట్టినప్పుడు నేను ఒక్కడినే. నా వెనుక ఎవరూ లేరు.. ముఖ్యమంత్రి కుమారుడివి కాదు. రూ.వేల కోట్లు లేవు. టీవీ ఛానళ్లు, పేపర్లు లేవు ఎలా గెలుస్తావని అన్నారు. ఇప్పుడు మార్పు రావాలని బలంగా కోరుకున్న ఆడపడుచులు, అన్నదమ్ములు నా వెంట ఉన్నారు. గెలుపు ఓటములు తెలియవు, యుద్ధం చేయటం ఒక్కటే తెలుసు. రాష్ట్రం విడిపోతున్న సమయంలో అందరూ భయపడుతున్నప్పుడు నా గుండె ధైర్యమే జనసేన పార్టీని పెట్టేలా చేసింది. అందుకే ఎప్పుడూ.. అన్యాయంపై పోరాటం చేసే శక్తినివ్వు.. బలంగా గొంతు విప్పగలిగే ధైర్యం ఇవ్వు.. అని కొన్ని లక్షల సార్లు దేవుడిని కోరుకుంటున్నా. జనసేన బలం ఒక్క గోదావరి జిల్లాలే కాదు. రాష్ట్రమంతా ఉంది. ఏపీలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారో, అక్కడి ఆడపడుచులు కూడా మార్పు కోరుకున్న రోజున తెలంగాణలోనూ జనసేన అండగా ఉంటుందని మాట ఇస్తున్నా. సొంతవాళ్లు వదిలేసినా విజయం వస్తే గుండెల్లో పెట్టుకుని, ఓటమి వస్తే భుజాన కాసింది అభిమానులే.

హామీలను నెరవేర్చి తీరతా
జనసేన పార్టీ మ్యానిఫెస్టో సారాంశాన్ని రెండు రోజుల్లో ప్రజల ముందుంచుతా. ఆవిర్భావ సభలో కొన్ని అంశాలనే ప్రస్తావించా. ఒట్టేసి చెబుతున్నా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతా. ఆవిర్భావ సభ వేదికపై ఓట్ల కోసం నోట్లు పంచని రాజకీయ వ్యవస్థ రావాలని.. డబ్బులతో రాజకీయం చేసే వ్యవస్థకు చరమగీతం పాడాలని తీర్మానించాం. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లి ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్తు కోసం వచ్చినవాడినని నమ్మితే గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలి.’’ అని పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.
ఆవిర్భావ సభలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌, పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రరెడ్డి, ఆకుల సత్యనారాయణ, కందుల దుర్గేష్‌, డీఎంఆర్‌ శేఖర్‌, మాదాసు గంగాధర్‌, రావెల కిషోర్‌బాబు, పసుపులేటి బాలరాజు, సినీ నటుడు నాగేంద్రబాబు, జీవీ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌కు విన్నవిస్తున్నా.. ఇక్కడికొచ్చి ఇబ్బంది పెట్టొద్దు

టీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌లతో నాకు, నా కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయానికొచ్చినప్పుడు వారితో తాను కలిసిలేను. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ స్వరూపం. అందుకే గౌరవం ఇచ్చాం. ఎంతసేపు విషపూరితంగా మాట్లాడితే ఎలా? ఆంధ్రులను వదిలేయండి.. మనందరిది ఒకటే దేశం. మీరు పాకిస్థానీ కాదు. మేం భారతీయులం కాం.. వ్యక్తిగత కక్షలతో ప్రజల మధ్య విరోధం పెంచుతామంటే ఎలా?  ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతీసిన, ఛీకొట్టిన కేసీఆర్‌, మోదీలతో జగన్‌ జతకట్టడం సరికాదు. జగన్‌, కేసీఆర్‌, చంద్రబాబు మధ్య గొడవలుంటే రాష్ట్రాన్ని బలిచేయడం తగదు. దొడ్డిదారిన ఇక్కడకొచ్చి ఇబ్బంది పెట్టొద్దని రెండు చేతులు జోడించి కేసీఆర్‌కు విన్నవిస్తున్నా.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.