close
యువోత్సాహం

తెదేపాలో వారసుల రంగప్రవేశం
మొత్తం 83 మంది సిట్టింగ్‌లకు అవకాశం
మహిళలు 15 మంది
వివాదాలు, విభేదాలున్నచోట్ల వాయిదా
126 మందితో తెదేపా అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు
ఈనాడు - అమరావతి

తెదేపా అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో యువోత్సాహం కనిపించింది. చాలామంది సీనియరు నేతల వారసులకు టికెట్లు దక్కాయి. వారసులనూ కలిపి చూస్తే 83 మంది సిట్టింగులు టికెట్లు దక్కించుకున్నారు. 15 మంది మహిళలకు చోటు లభించింది. గురువారం అర్ధరాత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన జాబితాలో 126 మంది పేర్లున్నాయి. కొంతమంది సిట్టింగుల నియోజక వర్గాలు మారాయి. విజయవాడ పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలు మైనారిటీలకు దక్కాయి. పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల, ఒక పట్టాన ఏకాభిప్రాయం సాధించలేకపోయిన నియోజకవర్గాలు, లోక్‌సభ స్థానాల ఎంపికతో ముడిపడిన నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన వాయిదా పడింది. అత్యధికంగా 126 నియోజకవర్గాలకు తొలి విడతలోనే అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఇక 49 నియోజకవర్గాలే మిగిలినట్లైంది. జాబితా విడుదలకు ముందు పొలిట్‌ బ్యూరో సమావేశంలోనూ, జిల్లా పార్టీ అధ్యక్షులతోనూ ముఖ్యమంత్రి చర్చించారు. మొత్తంమీద అభ్యర్థుల ఎంపిక పార్టీ శ్రేణులకు సంతృప్తినిచ్చింది.

వారసులకు అవకాశం...
సీనియర్‌ నేతల కోరిక మేరకు వారి వారసులకు ఈసారి భారీ సంఖ్యలో చంద్రబాబు అవకాశమిచ్చారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ) స్థానంలో ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు, మంత్రి పరిటాల సునీత (రాప్తాడు) స్థానంలో ఆమె కుమారుడు శ్రీరాం, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి) స్థానంలో ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి, గౌతు శ్యాంసుందర శివాజీ (పలాస) స్థానంలో ఆయన కుమార్తె శిరీషకు అవకాశమిచ్చారు. జలీల్‌ఖాన్‌ (విజయవాడ పశ్చిమ) స్థానంలో ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌, ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు (అరకు) స్థానంలో ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు అభ్యర్థిత్వాలు దక్కాయి. దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడి వారసుడు భానుప్రకాష్‌కు నగరి స్థానం లభించింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి మృణాళిని (చీపురుపల్లి) స్థానంలో ఆమె కుమారుడు నాగార్జునకు అవకాశమిచ్చారు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌కు గుడివాడ అభ్యర్థిత్వం దక్కింది. దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమార్తె భవానికి రాజమహేంద్రవరం నగరం స్థానం లభించింది.
* ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చుకునే మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆయన భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా... తాజాగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి మారారు. గత ఎన్నికల్లో దీనిని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించగా... అక్కడి నుంచి విష్ణుకుమార్‌రాజు గెలుపొందారు. భాజపా ఎమ్మెల్యేలున్న కైకలూరులో మాజీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణకు, తాడేపల్లి గూడెంలో మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి అవకాశం లభించింది. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమార్తె భవానిని ఎంపిక చేశారు.
* స్థానికంగా పార్టీ యంత్రాంగం నుంచి వ్యతిరేకత వచ్చిన కారణంగా మంత్రి జవహర్‌ను కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకు మార్చారు.

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న వంగలపూడి అనితకు కొవ్వూరు కేటాయించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ శాసన సభ్యుడు శ్రావణ్‌ కుమార్‌ను మార్చి ఆయన స్థానంలో బాపట్ల లోక్‌సభ సభ్యుడు శ్రీరాం మాల్యాద్రికి అవకాశమిచ్చారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌ బాబు జనసేనలో చేరగా... ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు ఇచ్చారు.
* టీవలే పార్టీలో చేరిన వారిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి పాణ్యం, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు స్థానాలు లభించాయి.
* కిందటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసిన మద్దాల గిరికి ఈసారి గుంటూరు పశ్చిమ దక్కింది. కొత్తగా వైకాపా నుంచి తెదేపాలోకొచ్చిన మహ్మద్‌ నసీర్‌కు అనూహ్యంగా గుంటూరు తూర్పు లభించింది.
* సిట్టింగ్‌ శాసనసభ్యుల్లో 83మందికి తిరిగిపోటీ చేసే అవకాశమొచ్చింది. (ప్రస్తుత సిట్టింగుల్లో వారి వారసులకు లభించిన స్థానాల్ని కూడా కలిపితే..)
* వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేల్లో 14 మందికి తిరిగి పోటీ చేసే అవకాశం లభించింది. ముగ్గురు... జయరాములు (బద్వేలు), డేవిడ్‌ రాజు (ఎర్రగొండపాలెం), వరుపుల సుబ్బారావులకు (ప్రత్తిపాడు) టిక్కెట్లు దక్కలేదు. వరుపుల సుబ్బారావు స్థానంలో ఆయన సన్నిహిత బంధువుకే అభ్యర్థిత్వం లభించింది.
* పెండింగ్‌లో ఉన్న స్థానాల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 9 ఉన్నాయి. శ్రీకాకుళంలో అత్యల్పంగా కేవలం ఒక్క స్థానమే పెండింగ్‌లో ఉంది.
* ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు లోకేశ్‌, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (సోమిరెడ్డి రాజీనామా చేశారు) ఈసారి శాసనసభ ఎన్నికల బరిలో నిలిచారు.
* దర్శి ఎమ్మెల్యే, మంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలపాలని భావించడంతో... ఆయన వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో దర్శి స్థానం పెండింగ్‌లో ఉంది.
* దివంగత వంగవీటి రంగా కుమారుడు రాధా తాజాగా తెదేపాలో చేరగా... ఎక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవాలన్నది పార్టీ ఆయన నిర్ణయానికే వదిలేసింది. ఆయన మచిలీపట్నం, అనకాపల్లి లోక్‌సభ స్థానాల్లో ఒక దానిని ఎంచుకునే అవకాశముందని పార్టీవర్గాల కథనం. దీంతో మచిలీపట్నం లోక్‌సభ స్థానంతో ముడిపడిన పెడన శాసనసభ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు.
* లోక్‌సభ అభ్యర్థిత్వాల ఎంపిక కొలిక్కి రాకపోవటంతో రెండో విడతలో ఒకేసారి మొత్తం స్థానాల్ని ప్రకటించనున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.