close
ఆలస్యం.. రుతుపవన రాగం

కేరళను జూన్‌ 6న తాకే అవకాశం
ఈ నెల 18, 19 తేదీల్లో అండమాన్‌కు వాతావరణశాఖ ప్రకటన
తెలంగాణలో కొనసాగుతున్న వడగాలులు
ఈనాడు - హైదరాబాద్‌

నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యంగా రానున్నాయని వాతావరణశాఖ బుధవారం ప్రకటించింది. జూన్‌ 6వ తేదీన కేరళ తీరాన్ని తాకవచ్చని అంచనా. ఈ తేదీకి 4 రోజులు అటూఇటూగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. అంటే జూన్‌ 2 నుంచి 10వ తేదీలోగా కేరళ తీరాన్ని తాకవచ్చని అర్థం. దాదాపు 6వ తేదీన రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కేరళ తీరాన్ని తాకిన మూడు రోజులకు ఆంధ్రప్రదేశ్‌కు, ఐదు రోజులకు తెలంగాణలో ప్రవేశిస్తాయి. ముందస్తు అంచనా ప్రకారం 6న కేరళను తాకితే 9న ఏపీకి, 11న తెలంగాణలో వర్షాలు ప్రారంభమవుతాయని అంచనా. గత 14 ఏళ్లలో వాతావరణశాఖ ప్రకటించిన తేదీలకు భిన్నంగా 2015లో మాత్రమే రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. మిగిలిన 13 ఏళ్లలో దాదాపు అదే తేదీకి కాస్త అటు ఇటుగా కేరళ తీరాన్ని తాకాయి. గతేడాది మే 29న వస్తాయని ముందు ప్రకటించగా సరిగ్గా అదేరోజు వచ్చాయి. గతేడాదికన్నా ఈసారి మరో వారం ఆలస్యం కావచ్చని అంచనా. ఈ నెల 18 లేదా 19వ తేదీన అండమాన్‌, నికోబార్‌ దీవులకు సమీపంలోని బంగాళాఖాతంలోని నైరుతి ప్రాంతంలో రుతుపవనాలు ఏర్పడటానికి అనుకూల పరిస్థితులున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి చెప్పారు.

మూడు రోజులు వడగాలులు
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున గురువారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వై.కె.రెడ్డి చెప్పారు. వాయవ్య భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా రుద్రంగిలో 45.3, మేడారం, బేల, మెండోరాల్లో 45.1, నిజామాబాద్‌ 44.4, ఆదిలాబాద్‌ 43.8, హైదరాబాద్‌లో 43.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో ఈస్థాయికి ఉష్ణోగ్రత పెరగడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. ఎండకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం పగలు 70 ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఒకమాదిరి వర్షాలు కురిశాయి. అధికవేడి ఉంటున్న ప్రాంతాల్లో క్యుములోనింబస్‌ మేఘాలేర్పడి వర్షాలు పడుతున్నాయి.


నేడు కోస్తాంధ్రలో ఈదురుగాలులు

ఈనాడు, విశాఖపట్నం: కోస్తాంధ్రలో కొన్నిచోట్ల గురువారం ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులుంటాయని, పిడుగులు కూడా పడొచ్చని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే ఉన్నాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.