close
విశాఖ ఉత్తరం నుంచి గంటా విజయం

విశాఖపట్నం, ఈనాడు - తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విజయం సాధించినట్లు శుక్రవారం మధ్యాహ్నం ఎన్నికల అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ఓట్ల లెక్కింపులో ఆఖరి రౌండ్‌లో కొన్ని ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం దీనిపై ఎన్నికల సంఘం అధికారులతో చర్చించి, వారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మధ్యాహ్నం గంటా శ్రీనివాసరావు 1,944 మెజారిటీతో తన సమీప వైకాపా అభ్యర్థి కె.కె.రాజుపై విజయం సాధించారని ఇక్కడి అధికారులు వెల్లడించారు.ఈ మేరకు ఆర్‌.ఓ. ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. ప్రభుత్వం ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసినప్పటికీ ఫలితం రాలేదు. విశాఖపట్నంలో మాత్రం నాలుగు స్థానాల్లో గెలుపొందాం. ఇక్కడ ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల కారణంగానే నగర ప్రజలు తెదేపాకు పట్టం కట్టారు...’ అని పేర్కొన్నారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ..
తీవ్ర వ్యతిరేక పవనాలు వీచినా గంటా శ్రీనివాసరావు వరుసగా ఐదోసారి విజయం సాధించడం గమనార్హం. 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం ఎమ్మెల్యేగా, 2009లో అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతి ఎన్నికలోనూ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడం ఆయన ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో గంటాకు 38.09 శాతం ఓట్లు రాగా కేకే రాజుకు 36.99 శాతం ఓట్లు పడ్డాయి.

వాస్తవమని తేలితే అధికారులపై చర్యలు: ద్వివేది
ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం కనిపించడం లేదని ఫిర్యాదుఅందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది విలేకరులకు చెప్పారు. దీనిపై విచారణ చేపట్టి వాస్తవమని తేలితే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

5 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలి: బొత్స

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖపట్నం ఉత్తర నియోజవర్గంలోని 5 పోలింగ్‌ బూత్‌లలో అక్రమాలు జరిగాయని, అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని వైకాపా నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక ఈవీఎంలోని ఓట్ల సంఖ్యకు వీవీప్యాట్‌లోని ఓట్లకు తేడాను గుర్తించాం. ఈవీఎంలో 371 ఓట్లు పోలైనట్లు ఉంటే వీవీప్యాట్‌లో 120 చీటీలు మాత్రమే ఉన్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే పోలింగ్‌ రోజు వీవీప్యాట్‌ మొరాయిస్తే మరొకటి వాడామని అధికారులు సమాధానమిచ్చారు. మరీ అది తెచ్చి లెక్కించడని కోరితే కనిపించట్లేదని అన్నారు. దీంతో పాటు మరో నాలుగు పోలింగ్‌ బూత్‌ల్లోనూ అవకతవకలు జరిగాయి. వీటిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు రీపోలింగ్‌ నిర్వహించాలి’ అని బొత్స డిమాండ్‌ చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.