close
పసి ప్రాణాలతో ఆటలా!

 జ్వరం బిళ్లలకు బదులు షుగర్‌ మాత్రల పంపిణీ
 ఆపస్మారక స్థితికి చేరిన చిన్నారులు
 తల్లిదండ్రుల సత్వర స్పందనతో తప్పిన ముప్పు
 వైద్య, ఆశా సిబ్బంది నిర్లక్ష్యం
 ప్రకాశం జిల్లా చీరాలలో సంఘటన
పేరాల - న్యూస్‌టుడే

తల్లుల ఒడిలో అప్పటి వరకు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పసిపిల్లలు.. ఒక్కసారిగా ఉలుకూపలుకూ లేకుండా తోటకూర కాడల్లా వేలాడిపోయారు. ఏం జరిగిందో అర్థం కాక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇంతలో.. ‘‘మీ పిల్లలకు ఇచ్చిన మాత్రలు జ్వరానివి కాదు, పొరపాటున షుగర్‌  బిళ్లలు ఇచ్చాం, వాటిని వేయకండి’’ అంటూ వైద్యసిబ్బంది నుంచి ఫోన్‌.. వెంటనే తల్లిదండ్రులు   అప్రమత్తమై, సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి  చిన్నారులను తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్‌ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

విజయనగర్‌ కాలనీలోని 15 మంది చిన్నారులకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వ్యాధి నిరోధక టీకాలు వేశారు. సాధారణంగా టీకాలు వేశాక పిల్లలకు జ్వరం రాకుండా పారాసిటమాల్‌ మాత్రలు ఇస్తారు. టీకాలు వేసిన వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఆ మాత్రలకు బదులు అందరికీ షుగర్‌ మాత్రలు ఇచ్చి పంపారు. తరువాత పొరపాటును గుర్తించి, ఆ మాత్రలు వాడొద్దంటూ అందరి ఇళ్లకు సమాచారం ఇచ్చారు. అప్పటికే నలుగురు పిల్లలకు మాత్రలో నాలుగో వంతు డోసు వేశారు. వీరంతా 45 నుంచి 50 రోజుల శిశువులు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చిన్నారుల తండ్రులు డి.శేఖర్‌, టి.సోమయ్య, టి.సుమన్‌, ఆర్‌.అశోక్‌కుమార్‌ వారిని చీరాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సకాలంలో అత్యవసర వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. ‘ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వైద్య ఆరోగ్య సిబ్బందిదే. ఆశా కార్యకర్తలపై బాధ్యత వదిలేస్తూ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఓ బాధిత చిన్నారి తండ్రి సోమయ్య తెలిపారు.

నివేదిక ఆధారంగా చర్యలు...
విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ డీఎంహెచ్‌వో మాధవీలతను సంఘటన స్థలానికి పంపాం. ఆమె బాధిత పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆశా కార్యకర్తకు చదువు లేకపోవడం వల్ల పొరపాటు దొర్లినట్లు వారు చెప్పారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.

- రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.