close
ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు

రాష్ట్రాభివృద్ధికి ప్రోత్సాహకాలు, రాయితీలు అవసరం
  పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు
  అమలు కాక ప్రజలు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు
  సహృదయంతో సహకరిస్తారని విశ్వసిస్తున్నా: సీఎం జగన్‌

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి హోదా ఇవ్వొద్దని ఎక్కడా సిఫార్సు చేయలేదంటూ 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్‌ రాసిన లేఖను ఈ సమావేశం ముందు ఉంచుతున్నా. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు ప్రక్రియ వేగవంతం చేయాలని 2014 మార్చి 2న ప్రణాళిక సంఘానికి కేంద్ర మంత్రివర్గ సమావేశం సూచించింది. నీతి ఆయోగ్‌ ఏర్పడక ముందు ప్రణాళిక సంఘం 2014 డిసెంబరు 31 వరకు మనుగడలోనే ఉన్నా నాటి రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లే ప్రత్యేక హోదా అమలు ప్రక్రియ ముందుకు సాగలేదని స్పష్టమవుతోంది. నాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తూ కేంద్ర మంత్రివర్గం అనుమతించిన లేఖను కూడా సమావేశం ముందుంచుతున్నా.

- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాయే ప్రాణవాయువని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడినపడాలన్నా అదే తారక మంత్రమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన అనంతరం గత ప్రభుత్వం లోపభూయిష్టమైన పాలనవల్ల ప్రమాణాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తగిన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని పరిస్థితులు వివరిస్తూ సుమారు 98 పేజీల నివేదికను నీతిఆయోగ్‌కు అందజేశారు. శనివారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన జాతీయ స్థాయిలోని ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న కొన్ని సూచనలు, ప్రతిపాదనలు చేస్తున్నా. రాష్ట్రానికి సంబంధించిన ఎజెండాను నివేదిక రూపంలో సమావేశానికి అందజేశా. ఎక్కువ మంది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, అన్యాయంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని, నిరుద్యోగం పెరుగుతుందని కనీసం ఆలోచించలేదు. జనాభా, రుణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు వారసత్వంగా సుమారు 59 శాతం లభిస్తే.. ఆదాయం మాత్రం 47 శాతం మాత్రమే దక్కింది.

భారీగా ఆదాయ లోటు
2015 నుంచి 2020 వరకు ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు.. విభజన అనంతర ఆదాయ లోటు (పోస్ట్‌ డివల్యూషన్‌ రెవెన్యూ డెఫిషిట్‌) రూ.22,113 కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. అదే కాలానికి తెలంగాణకు.. విభజన అనంతర ఆదాయ మిగులు (పోస్ట్‌ డివల్యూషన్‌ రెవెన్యూ సర్‌ప్లస్‌) రూ.1,18,678 కోట్లుగా తేల్చారు. కానీ వాస్తవంగా చూస్తే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఆదాయ లోటు రూ.66,362 కోట్లు. దశాబ్దాలుగా హైదరాబాద్‌ నగరం ఎంతో అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందే. 2013-14 కాలంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.57 వేల కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు ఎగుమతి అయితే అందులో రూ.56,500 కోట్లు హైదరాబాద్‌ నుంచి ఎగుమతి అయినవే. 2015-16 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,411గా ఉంటే ఏపీలో తలసరి ఆదాయం రూ.8,397 మాత్రమే.

నెరవేరని హామీలు
ఆంధ్రప్రదేశ్‌ దుస్థితిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు నాడు పార్లమెంటు హామీ ఇచ్చింది. విభజన సమయంలో పార్లమెంటులోని అధికార, విపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక ఇబ్బందులు తలెత్తేలా చేసింది. విభజన నాటికి రాష్ట్రానికి రూ.97 వేల కోట్ల అప్పులుంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2,58,928 కోట్లకు చేరింది. వీటిపై ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఉపాధి లేక రాష్ట్రంలోని యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి గాడిన పడాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే తారకమంత్రం అని నొక్కి చెబుతున్నా.

పెచ్చరిల్లిన అవినీతి
రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా లోపభూయిష్టమైన పరిపాలన, వ్యవస్థాపరమైన అవినీతి పెచ్చరిల్లిపోవడంతో పెట్టుబడులు రాలేదు.  నిరుద్యోగం విపరీతంగా పెరిగింది.. పరిశ్రమలు, విద్య, ఆరోగ్య ప్రమాణాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే ప్రాణవాయువుగా మారింది. హోదా ఇవ్వరని జరుగుతున్న ప్రచారంతో రాష్ట్ర ప్రజలు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం చెప్పినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రానికి హోదా ఇవ్వొద్దని ఎక్కడా సిఫార్సు చేయలేదంటూ 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్‌ రాసిన లేఖను ఈ సమావేశం ముందు ఉంచుతున్నా. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు ప్రక్రియ వేగవంతం చేయాలని 2014 మార్చి 2న ప్రణాళిక సంఘానికి కేంద్ర మంత్రివర్గ సమావేశం సూచించిన విషయాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంది. నీతి ఆయోగ్‌
ఏర్పడక ముందు ప్రణాళిక సంఘం 2014 డిసెంబరు 31 వరకు మనుగడలోనే ఉన్నా నాటి రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు ప్రక్రియ ముందుకు సాగలేదని స్పష్టంగా అర్థమైంది. నాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తూ కేంద్ర మంత్రివర్గం అనుమతించిన లేఖను ఈ సమావేశం ముందుంచుతున్నా.

ప్రధాని కూడా హామీ ఇచ్చారు
ప్రత్యేక హోదా కావాలంటూ మరికొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలచుకున్నా. దేశ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రాన్ని కూడా హోదా ఇస్తామని చెప్పి విభజించలేదు. అంతేకాదు అన్ని రాష్ట్రాలకు చెందిన అధికార, విపక్ష పార్టీల సభ్యులు నాడు పార్లమెంటులో ఉన్నారు. విభజన వల్ల అధిక ఆదాయం వచ్చే రాజధానిని కోల్పోయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనను కోరుకోలేదు. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. 2014 ఎన్నికల భాజపా మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన విషయాన్ని మరచిపోవద్దని గుర్తు చేస్తున్నా. ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రధాని ప్రకటించారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసం మా ప్రతిపాదనలు తెలియజెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర సమస్యలన్నీ సహృదయంతో పరిష్కరిస్తారని విశ్వసిస్తూ ప్రసంగం ముగిస్తున్నా’’ అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.


హోదా తప్పనిసరి

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి అధికంగా నిధులు, సహాయ సహకారాలు అందుతాయి. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు సాధారణ రాష్ట్రాల కన్నా ఎక్కువగా గ్రాంట్లు లభిస్తాయి. ఈ రకంగా చూస్తే.. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు తలసరి గ్రాంటు రూ.5,573 ఉండగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,428 మాత్రమే దక్కుతోంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఆదాయపు పన్ను, జీఎస్టీ మినహాయింపు, ఇతర రాయితీలు, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందుతాయి. ఈ తరహా ప్రోత్సాహకాలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరం. దీని వల్ల యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పారిశ్రామికీకరణ కూడా వేగవంతమవుతుంది. రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందడానికి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఐదు నక్షత్రాల హోటళ్లు, తయారీ పరిశ్రమలు, ఐటీ తదితర సేవా పరిశ్రమలు, ఉన్నత విద్య, పరిశోధన వంటి సంస్థలు ఎంతో అవసరం. ఇది సాధ్యం కావాలంటే ప్రత్యేక హోదానే పరమావధి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.