close
ఈ నగరాలకు నీరేదీ? 

4 నగరాల్లో వచ్చే నెలాఖరు వరకే నీటి నిల్వలు 
మరో నాలుగు చోట్ల సెప్టెంబరుతో సరి 
తరుముకొస్తున్న తాగునీటి ముప్పు

వెంటాడుతున్న వర్షాభావం.. నగరాలను దాహార్తితో అల్లాడేలా చేస్తోంది. తగినంత వర్షపాతం నమోదు కాకపోతే రెండు నెలల తరువాత ఏకంగా 8నగరాలు తాగునీటికి కటకటలాడేలా ఉన్నాయి. నాలుగు చోట్ల ఇప్పుడున్న నీటినిల్వలు వచ్చే నెలాఖరు వరకే సరిపోనున్నాయి. మరో నాలుగు నగరాల్లో సెప్టెంబరు వరకే అక్కరకు రానున్నాయి. గత ఏడాది తగినంత వర్షపాతం నమోదుకాకపోవడంతో విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు నగరాల్లోని జలాశయాలు అడుగంటిపోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఇప్పటికీ తగినంత వర్షం పడలేదు. అత్యధిక నగరాల్లో మూడు నుంచి నాలుగు రోజులకోసారి తాగునీరు ఇస్తున్నారు. వర్షాభావం ఇలాగే కొనసాగితే.. కొన్నాళ్లకు వీటిలో అనేకం చెన్నైలాంటి దుస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినా ఆశ్చర్యంలేదని అధికారులే చెప్తుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈనాడు-అమరావతి

ఇబ్బంది ఉన్న నగరాలు ఇవే.. 
కడప 
నెల్లూరు 
విజయనగరం 
కర్నూలు, 
ఒంగోలు 
చిత్తూరు 
విశాఖపట్నం 
తిరుపతి 

వీటిలో 4 నగరాలకు వర్షాలు రాకపోతే నెలలోపే ఉన్న నీటి వనరులు ఆవిరయ్యే ప్రమాదం ఉంది.

నగరం:  తిరుపతి 


రోజూఅవసరమైన నీరు: 60 మిలియన్‌ లీటర్లు (మి.లీ.) 
ప్రస్తుతం సరఫరా చేస్తున్నది: 38 మి.లీ. 
ఎన్ని రోజులకోసారి: 3-4 రోజులకోసారి 
ఉన్న నిల్వలు ఎప్పటి వరకు: 
సెప్టెంబరు నెలాఖరు

ఎందుకీ పరిస్థితి 
వర్షాభావం కల్యాణి డ్యాంపై తీవ్ర ప్రభావం చూపడంతో నగరంలో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. తిరుపతిలో సగం ప్రాంతాలకు కల్యాణి డ్యాం నుంచి మిగతా ప్రాంతాలకు తెలుగుగంగ నీటిని సరఫరా చేసేవారు. ఇప్పుడు పూర్తిగా తెలుగుగంగపై ఆధారపడే పరిస్థితి. నగర శివారు ప్రాంతాల్లో పది రోజులకోసారి నీరిస్తున్న పరిస్థితి.

నగరం:  కడప 
రోజూ అవసరమైన నీరు: 50 మిలియన్‌ లీటర్లు 
ప్రస్తుతం సరఫరా చేస్తున్నది: 25 మి.లీ. 
ఎన్ని రోజులకోసారి: మూడు 
ఉన్న నిల్వలు ఎప్పటి వరకు: ఆగస్టు 15

ఎందుకీ పరిస్థితి 
పెన్నా నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో గండిలోని ఇన్‌ఫిల్ట్రేషన్‌ బావుల నుంచి పంపింగ్‌కి అంతరాయం ఏర్పడుతోంది. మరో 20 రోజుల తరువాత సమస్య తీవ్రమయ్యే అవకాశాలున్నాయి

నగరం:  నెల్లూరు 
రోజూ అవసరమైన నీరు: 85 మిలియన్‌ లీటర్లు 
ప్రస్తుతం సరఫరా చేస్తున్నది: 40 మి.లీ. 
ఎన్ని రోజులకోసారి: కొన్ని ప్రాంతాల్లో రోజూ, ఇంకొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు-  ఉన్న నిల్వలు ఎప్పటి వరకు: ఆగస్టు 15

ఎందుకీ  పరిస్థితి 
పెన్నా నదిలోకి నీటి ప్రవాహం క్రమంగా తగ్గడంతో పంపింగ్‌కి అవరోధం కలుగుతోంది. సోమశిల నుంచి నేటి వరకు అరకొరగానైనా నీరు పెన్నాలోకి రావడంతో కొంతమేర పంపింగ్‌ చేయగలుగుతున్నారు. సోమశిలలో ఇప్పుడున్న నీరు ఆగస్టు 20 వరకు సరిపోతుంది. తరువాత పంపింగ్‌కి తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.

నగరం:  ఒంగోలు 
నిత్యం అవసరమైన నీరు: 45 మిలియన్‌ లీటర్లు 
ప్రస్తుత సరఫరా: 22 మిలియన్‌ లీటర్లు 
ఎన్ని రోజులకోసారి సరఫరా: నాలుగు 
ఇప్పుడున్న నిల్వలు సరిపోయేది: ఆగస్టు 15 వరకూ

ఎందుకీ పరిస్థితి 
వర్షాభావం తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలల క్రితం సాగర్‌ నుంచి నీరు విడుదల చేయడంతో రెండు ప్రధాన చెరువులను 75శాతం వరకు నింపారు. జాగ్రత్తగా నాలుగు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు పనిచేయటంలేదు.

నగరం:  విజయనగరం 

రోజూ అవసరమైన నీరు: 25 మిలియన్‌ లీటర్లు 
ప్రస్తుతం సరఫరా చేస్తున్నది: 15 మి.లీ. 
ఎన్ని రోజులకోసారి: రెండు రోజులు 
ఇప్పుడున్న నిల్వలు ఎప్పటివరకు: సెప్టెంబరు నెలాఖరు

ఎందుకీ పరిస్థితి 
వర్షాభావంతో నెల్లిమర్ల, రామతీర్థం, ముషిడిపల్లిలో నీటి పంపింగ్‌కు అంతరాయం ఏర్పడింది. నదుల్లో ప్రవాహం నిలిచిపోవడంతో తోటపల్లి జలాశయం నుంచి నీళ్లు తెచ్చి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

నగరం:  కర్నూలు 
రోజూ అవసరమైన నీరు: 85 మిలియన్‌ లీటర్లు 
ప్రస్తుతం సరఫరా చేస్తున్నది: 43 మి.లీ. 
ఎన్ని రోజులకోసారి: రోజు విడిచి రోజు 
ఇప్పుడున్న నిల్వలు ఎప్పటివరకు: ఆగస్టు 15

ఎందుకీ పరిస్థితి 
తుంగభద్రలో ప్రవాహం నిలిచిపోవడంతో సరఫరాకు ఆటంకం ఏర్పడింది. గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేశుల డ్యాం నుంచి నీళ్లు తెచ్చి సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకులో నిల్వ చేసి వాడుతున్నారు. ఇవి మరో 25 రోజులకు మించి రావు. తుంగభద్రలోకి టీఎంసీ నీటిని విడుదల చేయాలని కలెక్టర్‌ జలవనరులశాఖకు లేఖ రాశారు.

నగరం:  చిత్తూరు 

రోజూ అవసరమైన నీరు: 27 మిలియన్‌ లీటర్లు 
ప్రస్తుతం సరఫరా చేస్తున్నది: 16 మి.లీ. 
ఎన్ని రోజులకోసారి: రోజు విడిచి రోజు 
ఇప్పుడున్న నిల్వలు ఎప్పటివరకు: ట్యాంకర్లే ఆధారం

ఎందుకీ పరిస్థితి 
వర్షాభావంతో ఎన్టీఆర్‌ జలాశయంలో నీరు పూర్తిగా అడుగంటిపోవడంతో ఏప్రిల్‌ నుంచే పైపుల్లో సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయం లేక ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో నీరు తెచ్చి ప్రజలకు సరఫరా చేస్తున్నారు.

నగరం:  విశాఖపట్నం 

రోజూ అవసరమైన నీరు: 305 మిలియన్‌ లీటర్లు 
ప్రస్తుతం సరఫరా చేస్తున్నది: 220 మి.లీ.-  ఎన్ని రోజులకోసారి: రోజూ 
ఇప్పుడున్న నిల్వలు ఎప్పటివరకు: సెప్టెంబరు 10

ఎందుకీ పరిస్థితి 
ముడసర్లోవ, గంభీరం జలాశయాల్లో నీళ్లు లేవు. తాటిపూడి, రైవాడ నుంచి సరఫరా నామమాత్రమే. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి గోదావరి నీటిని ఏలేశ్వరం జలాశయంలోకి వదలాలని నగరపాలిక అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు.

సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ 

ప్రధాన నగరాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాం. వర్షాభావంతో ఈ ఏడాది పలుచోట్ల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు నీరందిస్తున్నాం. వర్షాలు కురవకపోతే కొన్ని నగరాల్లో ఒకటి, రెండు నెలల్లో సమస్య తీవ్రమయ్యే పరిస్థితి ఉందన్న సమాచారంపై సోమవారం అధికారులతో సమావేశమవుతున్నాం.  సమగ్రంగా చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటాం.

- బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.