Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009437
            [news_title_telugu_html] => 

చంద్రబాబు గృహ నిర్బంధం

[news_title_telugu] => చంద్రబాబు గృహ నిర్బంధం [news_title_english] => [news_short_description] => తెదేపా ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబుని ఉండవల్లిలోని ఆయన ఇంటి నుంచి అడుగు బయట పెట్టనివ్వలేదు. ఆత్మకూరు వెళ్లేందుకు బయల్దేరిన ఆయన, ఇంటి ఆవరణ నుంచి [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,25, ) )
చంద్రబాబు గృహ నిర్బంధం - EENADU
close
చంద్రబాబు గృహ నిర్బంధం

  ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు
 ఎక్కడికక్కడ నేతల అరెస్ట్‌లు,నిర్బంధం
 ఉదయం నుంచీ తీవ్ర ఉత్కంఠ

ఈనాడు, అమరావతి: తెదేపా ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబుని ఉండవల్లిలోని ఆయన ఇంటి నుంచి అడుగు బయట పెట్టనివ్వలేదు. ఆత్మకూరు వెళ్లేందుకు బయల్దేరిన ఆయన, ఇంటి ఆవరణ నుంచి బయటకు రాకుండా పోలీసులు గేటు మూసేయడంతో అరగంటపాటు తన వాహనంలోనే ఉండిపోయారు. పోలీసులు ఎంతకూ గేటు తెరవకపోవడంతో ఆయన వాహనం దిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి నుంచే తెదేపా నేతల కదలికలపై తీవ్ర ఆంక్షలు పెట్టిన పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కృష్ణా, గుంటూరుతో పాటు ఇతర జిల్లాల్లోనూ మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల్ని గృహ నిర్బంధం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకుల్ని మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం అరెస్ట్‌ చేసి అతిథి గృహాలకు, పోలీసు స్టేషన్లకు తరలించారు. పార్టీ నాయకుల్ని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికీ వెళ్లనివ్వలేదు. నాయకులు బస చేసిన హోటళ్లను పోలీసులు తనిఖీ చేశారు. అరెస్ట్‌లు, తనిఖీల సందర్భంగా పోలీసులకూ, నాయకులకూ మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది.

ఉదయం నుంచే హైడ్రామా
చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవడంతో ఉండవల్లిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం వంటి పరిణామాలతో హైడ్రామా కొనసాగింది. చంద్రబాబు బుధవారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి గుంటూరులోని బాధితుల శిబిరానికి చేరాలని, అక్కడ బాధితుల్ని వెంట తీసుకుని ఆత్మకూరుకి వెళ్లాలని అనుకున్నారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు, మంగళవారం రాత్రి నుంచే పోలీసుల్ని భారీ సంఖ్యలో మోహరించారు. కళావెంకట్రావు, చినరాజప్ప, టీడీ జనార్దన్‌ తదితరులు మంగళవారం అర్ధరాత్రి దాటాక చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. బుధవారం ఉదయమే అమరనాథ్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, జయనాగేశ్వర్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, రామరాజు తదితరులు చంద్రబాబు ఇంటి వద్దకు రాగా, లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్యుద్ధం జరిగింది. కాసేపటికి వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లే అన్ని మార్గాలనూ పోలీసులు దిగ్బంధించారు. పాలు, నీరు తెచ్చిన వాహనాల్నీ ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో టీడీ జనార్దన్‌ వారితో వాగ్వాదానికి దిగారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేత ఇంటి పరిసరాల్లోకి ముఖ్య భద్రతాధికారి (సీఎస్‌ఓ) అనుమతి లేకుండా పోలీసులు ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మీడియా ప్రతినిధుల్నీ చంద్రబాబు ఇంటి వరకు వెళ్లనివ్వకుండా కరకట్టపైనే ఆపేశారు. ఉదయం 7 గంటల సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పార్టీ నాయకులు కొందరితో కలసి ఇంటి ఆవరణ నుంచి బయటకు వచ్చారు. వారు కరకట్టవైపు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్‌ అమల్లో లేకున్నా ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడేందుకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేశారు. కాసేపటికి ఆయన, ఇతర నాయకులు మళ్లీ ఇంట్లోకి వెళ్లిపోయారు. వారితోపాటు కొందరు మీడియా ప్రతినిధుల్నీ లోపలికి తీసుకెళ్లారు. కరకట్టపై ఉండిపోయిన మిగతా మీడియా ప్రతినిధులు తమనూ ఇంట్లోకి అనుమతించాలని గంటకుపైగా ధర్నా చేశారు. కానీ వారిని లోపలికి పంపేందుకు పోలీసులు అంగీకరించలేదు.

వాహనంలోనే చంద్రబాబు
పార్టీ ముఖ్య నేతలతో ఉదయమే టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు, ఆ తర్వాత తన ఇంటికి వచ్చిన నాయకులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉదయం 11 గంటలకు తన నివాసం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఇంటి ఆవరణలోనే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మొదట గుంటూరుకి, అక్కడి నుంచి ఆత్మకూరుకి వెళ్లేందుకు తన వాహనంలో కూర్చున్నారు. అప్పటికే ప్రధాన గేట్‌ మూసివేసిన పోలీసులు, దాన్ని ఎవరూ తెరవడానికి వీల్లేకుండా బలమైన తాడుతో కట్టేశారు. చంద్రబాబు వాహనం గేటు వద్దకు వచ్చేసరికి, పోలీసులంతా గేటుకి రెండో పక్క మోహరించారు. చిన రాజప్ప, కళావెంకట్రావు తదితర నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము బయటకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ‘చలో ఆత్మకూరు’కి అనుమతి లేదని, పైగా 144 సెక్షన్‌ అమల్లో ఉందని, అందుకే అడ్డుకుంటున్నామని బదులిచ్చారు. అక్కడ 144 సెక్షన్‌ అమల్లో ఉందంటూ మైక్‌లో ప్రకటించారు. బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చే వరకు వాహనంలోనే కూర్చుంటానని చంద్రబాబు చెప్పడం, మరోపక్క పోలీసులు మోహరించడంతో అక్కడ కాసేపు ఉత్కంఠ భరిత వాతావరణం కొనసాగింది. గుంటూరు అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ, రైల్వే ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అరెస్ట్‌లు... వాగ్యుద్ధాలు..!
చలో ఆత్మకూరుకి వెళ్లకుండా నిరోధించేందుకు మంగళవారం రాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ముఖ్య నేతల్ని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. నాయకుల్ని బైండోవర్‌ చేశారు. అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలించారు.
* విశాఖ నుంచి మంగళవారం రాత్రి విజయవాడ చేరుకున్న అయ్యన్న పాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబు, పీలాగోవింద్‌లను రైల్వే స్టేషన్‌లోనే అరెస్ట్‌ చేశారు.
* ఒంగోలులో శిద్ధా రాఘవరావు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరులో నక్కా ఆనంద్‌బాబులను గృహ నిర్బంధంలో ఉంచారు.
* కృష్ణా జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, తంగిరాల సౌమ్య, బుద్ధా వెంకన్న, అశోక్‌బాబులను గృహ నిర్బంధం చేశారు. దేవినేని ఉమా గొల్లపూడిలో నిరసనకు దిగారు. మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌లను అరెస్ట్‌ చేశారు.
* ఎంపీ కేశినేని నాని చంద్రబాబు నివాసానికి వెళుతుండగా ప్రకాశం బ్యారేజీపై ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కారు అక్కడే వదిలేసి ప్రకాశం బ్యారేజీపై కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లారు. జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ ఇంటి నుంచి బయటకు వస్తుంటే అడ్డుకున్నారు. పలువురు కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుని నూజివీడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
* విజయవాడలో మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి బస చేసిన హోటల్‌ గదుల్లో పోలీసులు సోదాలు చేశారు. అఖిలప్రియ వారితో వాగ్యుద్ధానికి దిగారు. వారిని పోలీసులు అక్కడే నిర్బంధించారు.
* తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవానీ తదితర నాయకుల్ని గృహ నిర్బంధంలో ఉంచారు.
* పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎంపీ తోటసీతారామలక్ష్మిని అరెస్టు చేశారు. పోలవరం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, చింతలపూడిలో పలువురు నాయకులను అరెస్టు చేశారు.
* బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్తున్న టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారిలను అరెస్ట్‌ చేశారు. పోలీసులకు, తెదేపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఆ సందర్భంగా పోలీసు అధికారుల పట్ల అచ్చెన్నాయుడు దురుసుగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని వైకాపా నాయకులు ఆరోపించారు.  అచ్చెన్నాయుడిని పలు పోలీసుస్టేషన్‌లకు తిప్పారు. మంగళగిరిలో ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అనితలను అరెస్ట్‌ చేశారు.
* మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, గంజి చిరంజీవి తదితరుల్ని తాడేపల్లిలో అరెస్ట్‌ చేసి దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.
* ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌ తదితరుల్ని గృహనిర్బంధం చేశారు.
* గృహనిర్బంధాన్ని నిరసిస్తూ  పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ తన అనుచరులతో కలసి ఇంట్లోనే అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. చిలకలూరిపేటలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను అరెస్టు చేశారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చిన 20 మందిని అరెస్ట్‌ చేసి మంగళగిరి స్టేషన్‌కు తరలించారు.
* తిరుపతి నుంచి వస్తున్న నాయకుల్ని నెల్లూరు జిల్లా ముసునూరు టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. కడప, కర్నూలు జిల్లాల్లోను పలువురు నాయకుల్ని అరెస్ట్‌ చేశారు.

ముందుగా నోటీసు ఇవ్వకుండా గృహనిర్బంధమా?

చంద్రబాబు నివాసం ప్రధాన గేట్‌కి కట్టిన తాళ్లను బుధవారం సాయంత్రం బాగా పొద్దు పోయాక పోలీసులు తొలగించారు. అనంతరం సెక్షన్‌ 151 కింద నోటీసులు జారీ చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుని దాదాపు 12 గంటలు గృహ నిర్బంధంలో ఉంచాక, నోటీసులు జారీ చేయడం, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుందన్న విషయాన్ని అందులో ప్రస్తావించకపోవడం పట్ల తెదేపా న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అదే అంశంపై వారు పోలీసుల్ని ప్రశ్నించగా, వారు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయినట్టు తెదేపా తెలిపింది. నోటీసులు ఇవ్వకుండా ప్రతిపక్ష నేతలను 12 గంటలు గృహ నిర్బంధంలో ఉంచడం మానవహక్కుల ఉల్లంఘనేనని ధ్వజమెత్తింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.