close
ఆచూకీ తెలియక ఆందోళన

మృతదేహం ఏ మూల తేలుతుందో తెలియదు..
ఎన్ని రోజులు నిరీక్షించాలి?
బాధితుల ఆవేదన

‘మృతదేహాలేమైనా తేలుతున్నాయా? ఈ రోజు ఏమైనా బయటపడ్డాయా? తెల్ల చొక్కా వేసుకున్న యువకుడెవరైనా కనిపించారా?’.. అంటూ పాపికొండల్లో పడవ ప్రమాదంలో చిక్కుకుని ఇప్పటికీ ఆచూకీ తెలియని వారి బంధువులు కలిసిన ప్రతి ఒక్కరినీ అడగటం కంటతడి పెట్టిస్తోంది. తమవారి ఆచూకీ కోసం వారు పడుతున్న ఆరాటం ఆవేదన కలిగిస్తోంది. ఏ మృతదేహం వచ్చినా అది తమవారిదేమోనని వారు భయపడటం కన్నీరు పెట్టిస్తోంది. ఏ మూలో తమవాళ్లు బతికే ఉండకపోతారా? అనే ఆశ మిణుకు మిణుకుమంటున్నా ప్రమాదం జరిగి 48 గంటలు దాటడంతో వారిలో ఆశలు అడుగుంటుతున్నాయి. ‘నలుగురు స్నేహితులం వచ్చాం. ప్రమాద సమయంలో నేను సరంగు పక్కన ఉన్నా. అతడు గోదావరిలో దూకేయడంతో నేనూ దూకేశా. కొట్టుకుపోతుంటే వేరే పడవలో వచ్చినవారు రక్షించారు. మిగిలిన స్నేహితుల ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఒక యువకుడు చెప్పారు. ‘పడవ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఇక్కడికి ఎంత దూరం? అక్కడికి వెళ్లగలమా? వెళ్తే ఏమైనా తెలుస్తుందా?’ అని తన కుమారుడిని పోగొట్టుకున్న ఒక తండ్రి దీనంగా ప్రశ్నించడం కంటతడి పెట్టిస్తోంది.

- దేవీపట్నం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

  ఎక్కడెక్కడి నుంచో..

చాలామంది బాధితులు హైదరాబాద్‌, విశాఖపట్నం, కృష్ణా, వరంగల్‌ తదితర జిల్లాల నుంచి వస్తున్నారు. వీరిలో చాలామందికి ప్రమాద ప్రాంతం ఎక్కడుంటుందో కూడా తెలియదు. కొందరు రాజమహేంద్రవరం వచ్చి ఎదురు చూస్తున్నారు. ఆదివారం ప్రమాదం జరిగితే మంగళవారం ఉదయానికీ ఏమీ తెలియకపోవడంతో మరికొందరు దేవీపట్నం వచ్చారు. రాజమహేంద్రవరం నుంచి దేవీపట్నానికి 75 కిలోమీటర్లు. ఇక్కడకు వచ్చిన తర్వాత గోదావరిలో దిగువన కొన్ని మృతదేహాలు తేలాయని, వాటిని రాజమహేంద్రవరం తీసుకెళ్లారని చెబుతున్నారు. దేవీపట్నం పోలీసుస్టేషన్‌ వద్దకు చేరిన మృతదేహాలను రాజమహేంద్రవరం పంపుతున్నారు. మృతదేహాల ఫొటోలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకుని వచ్చిన వారికి చూపిస్తున్నారు. ఆలస్యమయ్యేకొద్దీ బంధువుల్లో ఆందోళన, ఆరాటం పెరుగుతున్నాయి.

నా కుమారుడు ఎక్కడున్నాడయ్యా?

రంపచోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: బోటు ప్రమాదంలో గల్లంతైన ఆలీబ్‌ కోసం ఆయన తండ్రి మహ్మద్‌ అలీముద్దీన్‌ రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో వాకబు చేసిన తీరు కంటతడి పెట్టించింది. ‘నా కుమారుడు ఎక్కడ ఉన్నాడయ్యా?’ అని వచ్చీరాని తెలుగులో ఆయన అడగటం మనసుల్ని కలచివేసింది. హైదరాబాద్‌ టోలీచౌకికి చెందిన ఆలీబ్‌ వ్యాయామ శిక్షకుడిగా పని చేస్తున్నారు. పాపికొండల అందాలను తిలకించేందుకు తన స్నేహితులతో కలిసి ఆదివారం పోశమ్మగండి నుంచి బోటులో విహారయాత్రకు వెళ్లి ప్రమాదంలో గల్లంతయ్యారు.

కారు చూసి.. గల్లంతైనట్లు నిర్ధారించి!

దానవాయిపేట, ధవళేశ్వరం, కంబాలచెరువు, దేవీపట్నం, గాజువాక, న్యూస్‌టుడే: పాపికొండల యాత్రకు బోట్లు బయల్దేరే గండిపోశమ్మ గుడి ఆవరణలో 3 రోజులుగా నిలిపి ఉంచిన కారు.. మరో నలుగురు పర్యాటకుల వివరాలు తెలిసేందుకు కారణమైంది. కారు నంబరు ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించగా అది కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రామకృష్ణారెడ్డిదని తేలింది. విశాఖలో ఉంటున్న తన కుమారుడు మహేశ్వర్‌రెడ్డి ఆ కారును వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. అతనికి ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ రావడంతో బంధువులతో కలిసి దేవీపట్నం వెళ్లిన రామకృష్ణారెడ్డి.. కారును చూసి అది తమదేనని చెప్పారు. కారులో వచ్చిన మహేశ్వర్‌రెడ్డి (38), భార్య స్వాతిరెడ్డి (33), పిల్లలు విఖ్యాత్‌రెడ్డి (6), హాసికారెడ్డి (4) విహారయాత్రకు వెళ్లినట్లు తేలింది. మృతదేహాల్లో స్వాతిరెడ్డి, హాసికారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వాటిని చూసిన రామకృష్ణారెడ్డి బోరున విలపించారు. కుమారుడు, మనవడి ఆచూకీ తెలియక ఆవేదనకు గురయ్యారు.

నాన్నేడంటే ఏం చెప్పనురా...

దానవాయిపేట, ధవళేశ్వరం, కంబాలచెరువు, న్యూస్‌టుడే: ‘మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు... నీ కుమారుడు ఇప్పుడిప్పుడే అమ్మ.. నాన్న.. అంటున్నాడు. ఊహ తెలిసిన తరువాత నాన్నేడని అడిగితే ఏం చెప్పను రా...’ అంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రేపాకుల సూరయ్య బోరున విలపించారు. సూరయ్య ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు విష్ణుకుమార్‌ (32) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వివాహం కాగా.. 5 నెలల బాబు ఉన్నాడు. ఇటీవలే బారసాల చేశారు. ఆ సంబరాల ఫొటోలను ఎప్పుడూ చూసుకుంటూ విష్ణు ఆనంద పడేవాడని చెబుతూ సూరయ్య బోరుమన్నారు.

ఈవో భార్యకు కారుణ్య ఉద్యోగం

బోటు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అమరేశ్వర ఆలయ గ్రేడ్‌-2 ఈవోగా పనిచేస్తున్న రఘురాం మృతిపై దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సంతాపం తెలిపారు. రఘురాం భార్య నాగ జ్యోతిని ఫోనులో పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని, కారుణ్య నియామకం కింద ఆమెకు దేవాదాయశాఖలో ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు.
-ఈనాడు, అమరావతి

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.