close
కోడెల మృతిపై సీబీఐ విచారణ చేయించాలి

ఏపీ ప్రభుత్వం టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరం
పోలీసులు, ఐఏఎస్‌ అధికారులు లొంగిపోయారు
మాజీ స్పీకర్‌పై 2 నెలల్లో 19 కేసులు పెట్టారు
సుప్రీం తీర్పునూ ఉల్లంఘించారు
ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
సీఎం జగన్‌ ప్రజలకు వివరణ ఇవ్వాలి
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు

ఈనాడు, హైదరాబాద్‌, గుంటూరు: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణంపై సీబీఐతో విచారణ చేయించాలని తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టెర్రరిస్టు ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. కోడెల ఆత్మహత్యను చూస్తే ఇంతకన్నా ఏమని స్పందించాలో తెలియడం లేదన్నారు.మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌    భవన్‌లో, రాత్రి గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘ఒక వ్యక్తిని చంపేటప్పుడు టెర్రరిస్టులకైనా ఒక లాజిక్‌ ఉంటుంది. ఈ కేసును చూస్తుంటే.. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించి వేధించి దిక్కు తెలియకుండా ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారు’ అని ఆయన నిప్పులు చెరిగారు.

ఫర్నీచర్‌ తీసుకెళ్లాలని కోరినా కేసులు
తెలుగు జాతికి, భారతదేశానికి ఈ కేసు గురించి తెలియాలి. ఒక చిల్లర (పెట్టీ) కేసును ఆధారంగా చేసుకుని మానసికంగా దెబ్బతీశారు. తన ఇంట్లోని ఫర్నీచర్‌ తీసుకెళ్లాలని కోడెల లేఖలు రాశారు. అసెంబ్లీ కార్యదర్శి స్పందించలేదు. 7.8.2019న కార్యదర్శికి, 20.8.2019న ప్రస్తుత సభాపతికి లేఖలు రాశారు. ఫర్నీచర్‌ విలువ అంచనా వేసి ఇస్తే తాను చెల్లిస్తానని తెలిపారు. దీనికి భిన్నంగా 22.8.2019న వైకాపా ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి ఫర్నీచర్‌ దుర్వినియోగం అయిందని ఫిర్యాదు చేస్తే 23.8.2019న పరిశీలించి 24.8.2019వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఫర్నీచర్‌ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువ ఉంటే పదేళ్ల కారాగార శిక్ష పడే 409 సెక్షన్‌ రాస్తారా. మరి రూ.43వేల కోట్ల అవినీతి ఉందని సీబీఐ వేసిన 13 ఛార్జిషీట్లలో ముద్దాయి అయిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రతి శుక్రవారం కోర్టుకు రాలేనని చెప్పడాన్ని ఏమనాలి?

కేసుల మీద కేసులు
కోడెలపై 2 నెలల్లో నరసరావుపేట ఒకటో పట్టణ, రెండో పట్టణ, సత్తెనపల్లి పట్టణం, గ్రామీణం, తుళ్లూరు పోలీస్‌స్టేషన్లలో 19 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. విచారణ తర్వాతే కేసులు నమోదు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పునూ ఉల్లంఘించారు. పైగా 2016, 2017, 2018లలో నమోదైన కేసులను తెరిచారు. మీరు కేసులు పెట్టండి మేం చూసుకుంటామని విజయసాయిరెడ్డి ట్విటర్‌, పేపర్లలో చెప్పడం చూశాం. క్రిమినల్‌ కేసులు ఉన్న బుడుమూరు నాగరాజుతో, భూమి తగాదాలో బుచ్చి వెంకాయమ్మతో నాన్‌బెయిలబుల్‌ కేసు, కులం పేరుతో దూషించారని రవితో కేసులు పెట్టించారు.

రాష్ట్రం ఎవరి జాగీరూ కాదు
ఏపీలో అభివృద్ధి పనులన్నీ రద్దు చేశారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నాకు రక్షణ తగ్గించారు. చంద్రమోహన్‌రెడ్డి, నన్నపనేని రాజకుమారి, అచ్చెన్నాయుడుపైనా ఏ తప్పు చేయకున్నా కేసులు నమోదు చేశారు. ఈ ప్రభుత్వం మానసిక స్థితి ఏంటి? గురజాలకు భాజపా నాయకులు వెళితే అరెస్టు చేశారు. ఇప్పుడు కోడెల ఆత్మహత్యను గుండెపోటుగా చిత్రీకరిస్తున్నారు. కెన్యాలో ఉన్న కుమారుడు చంపాడని మంత్రులు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉంటే అదేవిధంగా కేసులు నమోదు చేసేవారే. జగన్‌ బాబాయి వివేకా చనిపోతే రక్తపు మరకలు కడిగింది, బ్యాండేజీ కట్టింది మీ వారే. అప్పుడు సీబీఐ విచారణ చేయించాలని కోరారు. ఇప్పుడేమో కేసు ముందుకు వెళ్లడం లేదు. ఏపీలో పోలీసులు.. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులు సరెండర్‌ అయ్యారు. ఇది వ్యవస్థకు నష్టం. రాష్ట్రం ఎవరి జాగీరూ కాదని... ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

ప్రతి కేసుపై సమాధానం చెప్పాల్సిందే...!
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మౌనంగా ఉండటం కాదు. ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాం. వైకాపా ప్రభుత్వం నేరగాళ్ల రాజ్యంలా ఉంది. ఏ1 జగన్‌, ఏ2 విజయసాయిరెడ్డిలు అందరి గురించి మాట్లాడతారు... ట్వీట్లు చేస్తారు. గతంలో నా మీద 26కేసులు వేశారు. ఏం చేశారు? ఏ పార్టీ నాయకులు తప్పు చేసినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే తప్పుడు కేసులు పెట్టారో అక్కడికే వస్తాను. సంబంధిత ఎస్‌ఐ, సీఐ సమాధానం చెప్పాలి. కేసుల విషయమై డీఎస్పీ వద్దకు వెళితే అసభ్యంగా మాట్లాడారు. ఎస్పీ వద్దకు వెళితే మాజీ స్పీకర్‌కు కనీస మర్యాద ఇవ్వలేదు. డీజీపీ వద్దకు వెళ్లినా నిస్సహాయస్థితి. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు. సీఎం సైకోలా ప్రవర్తిస్తున్నారు. జగన్‌ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు. ఆ రోజు మీకోసం పోలీసులను పంపించలేదా? ఇదే పోలీసులు భద్రత ఇవ్వలేదా? 5ఏళ్ల పాలనలో ఎప్పుడైనా చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించామా? ప్రభుత్వ అరాచకాలపై పోరాడటానికి ఎవరు వచ్చినా కలుపుకొంటాం. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారని వందల మందిపై కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. ఎవరో పెట్టిన పోస్టుకు లోకేష్‌ మీద కేసుపెడతారా?  చలో ఆత్మకూరుకు వెళ్దామనుకుంటే దాన్ని భగ్నం చేసి కోడెల శివప్రసాదరావు పార్థివదేహాన్ని తీసుకెళ్లే పరిస్థితి కల్పించారు. వైకాపా నేత కంచేటి సాయి.... కోడెల మృతికి కుమారుడే కారణమని కేసు పెడతారా? ఎంత దుర్మార్గం. కోడెలకు నరసరావుపేట సీటు కాదని సత్తెనపల్లి ఇచ్చానని వైకాపా వారు ఆరోపణలు చేస్తున్నారు. కోడెల కోరితేనే సత్తెనపల్లి సీటు ఇచ్చాం. అయినా నేను కేసులు గురించి మాట్లాడుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. చలో ఆత్మకూరు పర్యటనకు పిలుపు ఇస్తే నాకు నోటీసు ఇవ్వకుండా గృహనిర్బంధం చేస్తారా? నోటీసు సాయంత్రం ఇస్తారా? గేటుకు తాళ్లు కడతారా? దీనికి సమాధానం చెప్పాలి...’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఇటీవల కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో ఉంటే పరామర్శించేందుకు వెళ్లలేదని వైకాపా వారు విమర్శిస్తున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా, తమ పార్టీ నేతలు వెళ్లి పరామర్శించారని గుర్తు చేశారు. ఆయన పార్టీ కార్యాలయానికి ఎన్నోసార్లు వచ్చారని సమాధానం ఇచ్చారు.

కోడెలను కడసారి చూసుకోవడానికి వీల్లేకుండా ఆంక్షలా?
కోడెల శివప్రసాదరావును కడసారి చూసుకోవడానికి వీల్లేకుండా ఆంక్షలు పెట్టి అభిమానులను ఇబ్బంది పెడతారా? అంతేకాక పోలీసు చట్టం-30 కూడా అమలు చేస్తారా? అని చంద్రబాబు మంగళవారం రాత్రి ట్విటర్‌ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.