close
జలదిగ్బంధంలో మహానంది

భారీ వర్షాలతో కర్నూలు, కడప, గుంటూరు అతలాకుతలం
నంద్యాల, కడప ప్రాంతంలో పొంగిన వాగులు
వరదల్లో ఇద్దరు బాలలు సహా నలుగురి గల్లంతు
ఈనాడు-అమరావతి, డిజిటల్‌, న్యూస్‌టుడే బృందం

ఉన్నట్టుండి కుండపోత! కర్నూలు, కడప, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలను ఒక్కసారిగా వర్షాలు ముంచెత్తాయి. కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయం నీటమునిగింది. క్షేత్రచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయం జల దిగ్బంధమైంది. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఇక్కడికి సమీపంలోనే ఉన్న ప్రథమ నందిని కుందూ చుట్టుముట్టేసింది. వరదలకు కడప జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఒకరు గల్లంతయ్యారు. వక్కిలేరు వాగులో చిక్కుకున్న కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నేలపాడు గ్రామానికి చెందిన 8మంది గొర్రెల కాపరులను జిల్లా యంత్రాంగం రక్షించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని కామనూరు-రాజానగర్‌ మధ్య వాగులో ఆటో కొట్టుకుపోయి ముగ్గురు గల్లంతయ్యారు. అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద కృష్ణా పరవళ్లు చూడడానికి వెళ్లిన ముగ్గురిలో ఒకరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం ములగలపాటివారిగూడెంలో పిడుగుపడి మేకలకాపరి వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. 15 మేకలు చనిపోయాయి. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద రాళ్లవాగు పొంగి గుంటూరు- హైదరాబాద్‌కు రాకపోకలు స్తంభించాయి. చాలాచోట్ల పంటపొలాలు కొట్టుకుపోయాయి.

* కర్నూలు జిల్లా నంద్యాలలో చామకాలువ, కుందూనది  పొంగి పొర్లుతున్నాయి. గ్యాస్‌ట్యాంకర్‌ బోల్తాపడి ఆత్మకూరు-డోర్నాల మధ్య ట్రాఫిక్‌ నిలిచింది. గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు 2 కి.మీ. దూరంలో రైల్వేట్రాక్‌ దెబ్బతింది. పలు రైళ్లను రద్దుచేశారు. సాయంత్రానికి ట్రాక్‌ మరమ్మతు చేశారు.

వాగు మధ్యలో ఆగిన విద్యార్థుల బస్సు
కర్నూలు జిల్లా సంజామల నుంచి 30 మంది విద్యార్థులతో కోవెలకుంట్లకు బయలుదేరిన బస్సు కమలపురి, ముదిగేడు మధ్యన వాగులో నిలిచింది. అప్పటికే వాగు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు బస్సు అద్దాలను పగులగొట్టి విద్యార్థులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

*కడప జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. చక్రాయపేట మండలంలో గండి-రాయచోటి మార్గంలో కొండచరియలు విరిగాయి. పెన్నా నది, కోడేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద రికార్డుస్థాయిలో 15 అడుగుల నీరు చేరింది. 1.20 లక్షల క్యూసెక్కులు సోమశిల వైపు వెళుతోంది. ప్రొద్దుటూరు-దువ్వూరు మార్గంలోని రాధానగర్‌- కామనూరు మధ్య నీటి ఉద్ధృతి పెరిగింది. ఈ మార్గంలో లారీని  అనుసరిస్తూ  వంకను దాటేందుకు ప్రయత్నించిన ఆటో నీటి ప్రవాహానికి పక్కకు ఒరిగింది. అందులోని ఒకరు రక్షించమంటూ కేకలు వేశారు. విన్న లారీ డ్రైవరు సమాచారం మేరకు ఎస్సై సునీల్‌రెడ్డి వంకలోకి దిగి ఆటో వద్దకు చేరుకునేలోగా  ఆటోడ్రైవర్‌తోపాటు  సదరు వ్యక్తి, చిన్నారి నీటిలో కొట్టుకుపోయారు. వారి వివరాలూ తెలియలేదు.అనంతపురం జిల్లాలోనూ కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

ధ్యానబుద్ధను చూడడానికి వచ్చి గల్లంతు

గుంటూరు జిల్లాలోని తాడికొండ, పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. అమరావతిలోని శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్‌ విద్యార్థి, నరుకుళ్లపాడుకు చెందిన ఎం.లక్ష్మినారాయణ మరో ఇద్దరితో కలిసి ధ్యానబుద్ధ వద్ద కృష్ణా ప్రవాహాన్ని చూడటానికి వెళ్లారు. కాళ్లు కడుక్కుందామని బాలుడు నదిలో దిగగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. గుంటూరు నందివెలుగు రోడ్డులో డ్రైనేజీ అర్ధంతరంగా నిలిపేయడంతో ఆ ప్రాంతంలో మురుగు భారీగా చేరుతోంది. ఆగ్రహించిన స్థానికులు రహదారిపై తాళ్లను కట్టి, ఆటోలను పెట్టి ఆందోళన చేశారు.

నేడూ పలుచోట్ల భారీ, అతిభారీ వర్షాలు

కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బుధవారం విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నదని వాతావరణ అధికారులు తెలిపారు. గురువారం నుంచి కోస్తా జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయన్నారు. ఈనెల 19వ తేదీ మినహా 21వ తేదీ వరకు నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయని చెబుతున్నారు. మంగళవారం సాయంత్రానికి వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఉందని.. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.