close
చిన్న రాష్ట్రం.. పోరు చిత్రం!

 సిక్కింలో ఆసక్తికరంగా ఉప ఎన్నికలు
 అధికార ‘ప్రతిపక్ష’ పార్టీల మధ్య పొత్తు!
 ఎన్నికల బరిలో ముఖ్యమంత్రి గోలే

చిన్న రాష్ట్రమే అయినా సిక్కింలో ఉప ఎన్నికల ‘పోరు’ కొంత విచిత్రంగా.. ఆసక్తికరంగా సాగుతోంది. ఇక్కడ 3 స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరుగుతుండగా ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ (గోలే) ఓ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికలంటే ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీ పోరాడటం సహజం. ఇక్కడ మాత్రం రెండూ ‘పొత్తు’తో బరిలోకి దిగి స్నేహ గీతాలు ఆలపిస్తుండటం విశేషం. దేశ రాజకీయాల్లోనే ఇదో సరికొత్త పోకడగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈనాడు, దిల్లీ: దాదాపు 6.10 లక్షల జనాభా.. 4.34 లక్షల మంది ఓటర్లు.. 32 శాసనసభ స్థానాలున్న సిక్కింలో ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలూ జరిగాయి. అప్పట్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం) 17 చోట్ల,  సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) 15 స్థానాల్లో విజయం సాధించాయి. ఎమ్మెల్యే కానప్పటికీ ఎస్‌కేఎం అధ్యక్షుడు గోలే ముఖ్యమంత్రి అయ్యారు. ఎస్‌డీఎఫ్‌ అధినేత పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌, ఆ పార్టీ నేత దోర్జీ త్సెరింగ్‌ లెప్చా, ఎస్‌కేఎంకు చెందిన కుంగా నిమా లెప్చా రెండేసి స్థానాల్లో విజయం సాధించడంతో వీరు ముగ్గురూ ఒక్కో స్థానానికి రాజీనామా చేశారు. ఆ స్థానాలకే (పోక్‌లాక్‌-కమ్రాంగ్‌, మార్టమ్‌-రుమ్‌టెక్‌, గ్యాంగ్‌టక్‌) తాజాగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

భాజపా అలా ప్రతిపక్షమైంది..

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. ఆ పార్టీకి 1.62 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కానీ ఇప్పుడు భాజపా సిక్కింలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అదెలాగంటే.. ఎస్‌డీఎఫ్‌ గెలిచిన 15 స్థానాలకు గాను.. ఇద్దరు ఒక్కోచోట రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 13కి పరిమితమైంది. వారిలో కూడా ఇద్దరు అధికార ఎస్‌కేఎంలో చేరగా, 10 మందిని భాజపా.. పార్టీలోకి చేర్చుకుంది. చివరకు ఎస్‌డీఎఫ్‌కు ఆ పార్టీ అధినేత పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ ఒక్కరే మిగిలారు. అలా ప్రధాన ప్రతిపక్షంగా భాజపా అవతరించింది.

పొత్తు వి‘చిత్రం’

అవినీతి ఆరోపణల కేసులో దోషిగా తేలిన గోలేపై ఎన్నికల సంఘం (ఈసీ) గతేడాది ఆగస్టులో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఉప ఎన్నికలకు ముందు ఈసీ ఆయనపై నిషేధాన్ని ఏడాదికి తగ్గించడంతో ముఖ్యమంత్రి గోలే పోక్‌లాక్‌-కమ్రాంగ్‌ నుంచి పోటీకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార ఎస్‌కేఎం, ఎన్డీఏ అనుబంధమైన ఈశాన్య రాష్ట్రాల కూటమిలో చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ పొత్తుకు ఆ పార్టీని భాజపా ఒప్పించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీగా ఉన్న ఎస్‌కేఎం ఒక స్థానంలో, ప్రధాన ‘ప్రతిపక్షం’ భాజపా రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇలా రెండూ ‘పొత్తు’తో బరిలోకి దిగడం విశేషం.

పోరు బరిలో ఎస్‌డీఎఫ్‌

సిక్కింలో దాదాపు 25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్‌డీఎఫ్‌కు ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు ఎక్కువగా పోలైనా సీట్లు తగ్గాయి. అనంతర పరిణామాల్లో చామ్లింగ్‌ ఒక్కరే ఆ పార్టీలో మిగిలినా.. ఉప ఎన్నికల్లో 3 స్థానాలనూ గెలిచి సత్తా చాటాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈమేరకు చామ్లింగ్‌ ప్రచారం చేస్తూ.. అధికార ఎస్‌కేఎం, భాజపా ఎజెండానే అమలు చేస్తోందని విమర్శిస్తున్నారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల భవితవ్యం ఈ ఉప ఎన్నికలతో ముడిపడి ఉందంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. సిక్కింకే పరిమితమైన చట్టాల పరిరక్షణ ఎస్‌డీఎఫ్‌తోనే సాధ్యమని చెబుతున్నారు. మరోవైపు ఎస్‌డీఎఫ్‌కి మిగిలింది గత చరిత్రేనని ముఖ్యమంత్రి గోలే విమర్శలు గుప్పిస్తున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.