close
సీఎం నియోజకవర్గానికే నరేగా నిధులా?

గోదావరి జలాల తరలింపును వ్యతిరేకించాలి
పార్టీలో యువత, మహిళలకు ప్రాధాన్యం
నాలుగున్నర నెలల పాలనలో అంతా అస్తవ్యస్తం
మీడియాపై ఆంక్షలు అప్రజాస్వామికం
బంగారు బాతులాంటి అమరావతిని చంపేశారు
పొలిట్‌బ్యూరో సమావేశంలో తెదేపా నిర్ణయాలు, విమర్శలు

పార్టీలో యువతను ప్రోత్సహిస్తాం. వారికి 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులను కేటాయిస్తాం. మొత్తం మీద పార్టీ పదవుల్లో 50 శాతం బలహీనవర్గాలకు అప్పగిస్తాం. పదవుల కోసం వచ్చినవారు అధికారం పోగానే పోతారు. త్యాగాలు చేసిన వాళ్లే పార్టీలో ఉన్నారు. పార్టీలో పదవుల్ని ఇకపై ఎన్నికల ద్వారానే భర్తీ చేస్తాం.

- పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, పుంగనూరు నియోజకవర్గాలకే నరేగా నిధులు విడుదల చేసి, మిగతా రాష్ట్రమంతా నిలిపి వేశారని, అది ఎంతవరకు సమంజసమని తెదేపా పొలిట్‌బ్యూరో మండిపడింది. జగన్‌, కేసీఆర్‌ల స్నేహం వారి వ్యక్తిగతమని, 2 రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన నిర్ణయాల్ని ఎవరినీ సంప్రదించకుండా వారిద్దరే ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గోదావరి జలాలను తెలంగాణ భూభాగం మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించింది. పార్టీలో యువతకు, మహిళలకు ప్రాధాన్యమివ్వాలని తీర్మానించింది. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. పార్లమెంటరీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా చేసుకుని పార్టీ కమిటీలు వేయాలన్న ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు, వైకాపా ప్రభుత్వ నిర్ణయాలు, పర్యవసానాలు, తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు వంటి అంశాలపై చర్చించారు. వివరాలను సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి విలేఖరులకు వివరించారు.

వైకాపా పాలనలో అంతా తిరోగమనమే

రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, వైకాపా అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిందని తెదేపా పొలిట్‌బ్యూరో మండిపడింది. గత ప్రభుత్వంవల్లే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని వైకాపా నేతలు పేర్కొనడాన్ని తప్పుబట్టింది. తమ ప్రభుత్వ హయాంలో 11 శాతం వృద్ధి సాధించామని, వైకాపా అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే ఆదాయం    17 శాతం తగ్గిందని, నరేగా నిధులు  రూ.2,400 కోట్లను దారి మళ్లించారని ధ్వజమెత్తింది. సమావేశంలో చర్చకు వచ్చిన ఇతర ముఖ్యాంశాలివీ...
* సీఎం సొంత బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రించి, సాక్ష్యాలు తారుమారు చేయాలని చూసినవాళ్లకు, గుండెపోటుగా వార్తలు ప్రసారం చేసిన వాళ్లకు, కేసు పక్కదారి పట్టించేందుకు చూసినవాళ్లకు ఇవ్వని నోటీసులు తెదేపా నేత వర్ల రామయ్యకు ఇస్తామనడం ఏంటి?
* వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సొంత జిల్లాలోని తుమ్మలపల్లిలో యురేనియం తవ్వకాలు ప్రారంభించారు. ఆయన కుమారుడు జగన్‌ ఇప్పుడు కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు. దానిపై పోరాడుతున్నందుకు తెదేపా నేత అఖిలప్రియ భర్తపై అక్రమ కేసులు పెట్టడం దారుణం.
* మీడియాపై ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం. 2007 ఫిబ్రవరి 23న వైఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో 938ని ప్రామాణికంగా చేసుకుని జగన్‌ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఆ జీవోపై ఆందోళనలు వ్యక్తమవడంతో దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌ ప్రకటించారు. కానీ జగన్‌ మరో రూపంలో ఆ జీవోను అమలు చేయడం ద్వారా మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారు.
* అమరావతిని బంగారు బాతులా పెంచి అప్పగిస్తే, దానిని చంపేశారు. రూ.లక్ష కోట్ల సంపద సృష్టించి ఇస్తే మట్టిలో కలిపేశారు.
* పీపీఏలు, పోలవరం, అమరావతి వంటి వాటితోపాటు కేంద్రం నుంచి రావలసిన నరేగా నిధుల విషయంలోనూ కేంద్రంతో రాష్ట్రం ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోంది. అది రాష్ట్రానికి నష్టం.
* తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై చర్చ. కార్మికుల ఆత్మహత్యలపై విచారం. చనిపోయినవారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని తీర్మానం.
* హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక తెలంగాణలో పార్టీ పునరుజ్జీవానికి నాంది కావాలి. తెలంగాణలో తెదేపా ఉండటం చారిత్రక అవసరం.
* కేసీఆర్‌, జగన్‌ ఒకరు రీ ఇంజినీరింగ్‌ అంటే మరొకరు రివర్స్‌ టెండరింగ్‌ అంటున్నారు. కొనసాగుతున్న ప్రాజెక్టులు నిలిపివేయడమే వారిద్దరి అంతిమ లక్ష్యం. వాళ్లకు తప్ప ఇంకెవరికీ పేరు రాకూడదన్నదే వారి ఆలోచన.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.