close
2 సెంట్ల వరకూ రూపాయి రుసుమే

అభ్యంతరం లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించండి
ఆపైన ఉంటే ఎంత వసూలు చేయాలో తేల్చండి
జనవరి వరకు దరఖాస్తులను స్వీకరించాలని సూచన
ముఖ్యమంత్రి ఆదేశం
ఈనాడు - అమరావతి

అభ్యంతరం లేని అక్రమ ఇళ్ల నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గుర్తించిన అక్రమ నిర్మాణాల్లో 2 సెంట్ల వరకు రూపాయి రుసుముతో రిజిస్ట్రేషన్‌ చేయించుకునే సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. ఆక్రమించిన స్థలం 2 సెంట్ల కంటే ఎక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎంత ఉండాలో ప్రతిపాదనలను తయారుచేసి పంపాలని పేర్కొన్నారు. ఉగాది నాటికి ఉచిత ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ‘నదీ తీరాలు, కాల్వగట్ల వెంట ఉన్న ఇళ్లవల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ప్రభుత్వం తరఫున పంపిణీ జరిగే స్థలాలు, ఇళ్ల నిర్మాణాల్లో ఈ ప్రాంతాల్లో నివశించే వారికి స్థానం కల్పించాలి. ముప్పు, అభ్యంతరాలు లేని ఇళ్లనే క్రమబద్ధీకరించాలి. మాజీ సీఎం చంద్రబాబు తన అత్తగారి సొత్తన్నట్లు పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కున్నారు. ప్రభుత్వం ఒకసారి పేదలకు ఇచ్చిన తరువాత ఎలా లాక్కుంటారు? ఇళ్ల నిర్మాణం కోసం వీలైనంత వరకు ప్రభుత్వ స్థలాలనే ఉపయోగించాలి. పట్టణ ప్రాంతాల్లో పేదలుంటున్న ఫ్లాట్లలో నిర్వహణ సక్రమంగా లేదు. పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట ఫ్లాట్ల స్థానంలో స్థలాలు ఇచ్చి పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రకటించాలి. అర్హత లేని వారిగా ప్రకటిస్తే అందుకు కారణాలను వారికి తెలియబరచాలి. జనవరి వరకు దరఖాస్తుల స్వీకరణ జరగాలి. లక్ష్యం కంటే మరో 10% అదనంగా ఇళ్ల స్థలాలను సేకరించి పెట్టుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పాల్గొన్నారు.

20.47 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక
ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 19వేల ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించేందుకు రూ.10వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20.47 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు.
* గ్రామీణ ప్రాంతాల్లో 19,389.05 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించగా 8,50,648 మంది లబ్ధిదారులున్నారు. ఇంకా 8వేల ఎకరాలను సేకరించాల్సి ఉంది.
* పట్టణ/నగర ప్రాంతాల్లో 6,99,033 మంది లబ్ధిదారులను గుర్తించగా 2,559.67 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇంకా 11వేల ఎకరాలను సేకరించాలి.
* వివిధ రకాల స్థలాల్లో నివాసం ఉంటున్నవారు మరో 4.97 లక్షల మంది ఉన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.