close
కృష్ణాలో ప్రవాహ ఉద్ధృతి

తుంగభద్ర 28గేట్ల ఎత్తివేత
3, 4 రోజుల్లో శ్రీశైలానికి వరద

ఈనాడు- దిల్లీ, న్యూస్‌టుడే, రాయచూరు, హొసపేటె: కృష్ణా నదిపై కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపుర జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జలాశయాల నుంచి నీటి విడుదలను క్రమేణా పెంచుతున్నారు. సోమవారం ఉదయం 8.30గంటల సమయంలో నారాయణపుర ఏడు గేట్లను ఎత్తి నదికి 75,720 క్యూసెక్కులను వదిలారు. ఆలమట్టి నుంచి నారాయణపురకు 60వేల క్యూసెక్కులు చేరాయి. క్రమేణా గేట్ల సంఖ్యను పెంచుతూ మధ్యాహ్నం 1.30 సమయంలో నారాయణపుర 15గేట్ల ద్వారా 1.71లక్షల క్యూసెక్కులను విడిచిపెట్టారు. ఈ సమయంలో ఆలమట్టి నుంచి దిగువకు వదిలే నీరు 1.30లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. సోమవారం రాత్రికి నీటి విడుదల 2.50లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అంచనా. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

28గేట్ల నుంచి నదికి నీరు
తుంగభద్రకు మరోసారి వరద పోటెత్తింది. 4 రోజులుగా జలాశయానికి సుమారు 20వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, సోమవారం ఉదయం ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 35వేల క్యూసెక్కులుగా ఉన్న వరద.. సాయంత్రానికి బాగా పెరిగింది. దీంతో జలాశయంలోని 28గేట్లను ఎత్తి సుమారు 70 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

కేంద్ర జల సంఘం హెచ్చరిక

కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల మరో 3-4 రోజుల్లో శ్రీశైలానికి వరద పోటెత్తే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. ప్రస్తుతం నిండుకుండలా ఉన్న ఆ జలాశయంలో మరో 7 టీఎంసీలు మాత్రమే నీటినిల్వకు అవకాశం ఉందని, అందువల్ల ముందుజాగ్రత్తగా నీటిని కిందికి వదిలి పైనుంచి వచ్చే వరద నీటికోసం తగినస్థలం కల్పించాలని సూచించింది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌, పులిచింతల రెండింటిలోనూ కలిపి 4టీఎంసీల నిల్వకు మాత్రమే అవకాశం ఉందని గుర్తుచేసింది.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.