close
చిన్నారుల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

ఓ శిశువు మృత్యువాత..  ముగ్గురికి తీవ్ర గాయాలు
  స్వల్ప గాయాలతో  బయట పడిన మరో శిశువు
  హైదరాబాద్‌లో ఘటన

ఈనాడు, హైదరాబాద్‌: అంతా బుజ్జి బుజ్జి చిన్నారులు. చిట్టిపొట్టి చేతులు, చిన్ని చిన్ని కళ్లు, ముట్టుకుంటేనే ముడుచుకుపోయే లేలేత ప్రాయం. అమ్మఒడి తప్ప మరేమీ ఎరుగని బోసి నవ్వుల పసికందులు...ఒక్కసారిగా అల్లాడిపోయారు. చుట్టుముట్టిన మంటలు, కమ్ముకొస్తున్న పొగల మధ్య విలవిల్లాడిపోయారు. హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి 4 నెలల శిశువు అసువులుబాయగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  ముక్కుపచ్చలారని బిడ్డలను కాపాడుకునేందుకు వారిని భుజాన వేసుకుని తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు పెట్టారు.
ఎల్‌బీనగర్‌లోని షైన్‌ ఆసుపత్రి పై అంతస్తులో సోమవారం తెల్లవారుజామున  2.40 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయిదుగురు చిన్నారులు అదే అంతస్తులో ఇంక్యుబేటర్లపై చికిత్సపొందుతున్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగి చిన్నారుల ఛాతి, పొట్ట, ముఖం భాగాలు కమిలిపోయాయి. ఈ ప్రమాదంలో నాలుగు నెలల మగ శిశువు మృతిచెందాడు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో శిశువు పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ నలుగురిని అత్యవసర చికిత్స కోసం నగరంలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో మొత్తం 45 మంది చికిత్స పొందుతున్నారు.  వీరిలో కొందరు డెంగీ జ్వరంతో ప్లేట్‌లెట్లు పడిపోయి అత్యవసర చికిత్స తీసుకుంటున్నారు.(ఆసుపత్రిలో 36 నుంచి 42 మంది పిల్లలు ఉన్నట్లు పోలీసు ఫిర్యాదులో ఉండగా, 45 మంది ఉన్నారని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు).

రిఫ్రిజిరేటర్‌ పేలి..: పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. ఆసుపత్రిలోని పై అంతస్తులో ఉన్న నవజాత శిశువుల అత్యవసర చికిత్స విభాగం (ఎన్‌ఐసీయూ)లో మందుల నిల్వ కోసం ఉంచే రిఫ్రిజిరేటర్‌లో పేలుడు సంభవించింది. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. సిబ్బంది, తల్లిదండ్రులు అప్రమత్తమయ్యేలోపు క్షణాల్లో  గదంతా మంటలు అంటుకున్నాయి. యాదగిరిగుట్ట డివిజన్‌ పరిధి మోటకొండూరు ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేష్‌, మానస దంపతుల నాలుగు నెలల కుమారుడు అపస్మారకస్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన సమీపంలోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తమ కుమారుడి మృతికి షైన్‌ ఆస్పత్రి యాజమాన్యంతోపాటు డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని చిన్నారి తండ్రి నరేష్‌ ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న తమ కుమారుడిని ఆస్పత్రిలో చేర్చగా.. రెండ్రోజుల క్రితం ఇదే ఎన్‌ఐసీయూ విభాగంలో పొగలు వచ్చాయని ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యం దృష్టికి తెచ్చినా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే పెను ప్రమాదం చోటుచేసుకుందన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.