close
ఆలస్యమైతే నష్టమే కదా?

గడువులోగా పోలవరం పూర్తవుతుందా?
కొత్త గుత్తేదారుతో ఒప్పందమెప్పుడు?
26.9% తక్కువకు ఎలా పని చేస్తారు?
రివర్స్‌ టెండర్ల పని పరిమాణంలో తేడా ఎందుకు?
ప్రశ్నించిన పోలవరం అథారిటీ సీఈవో జైన్‌, కార్యదర్శి పాండే
సమాధానాలిచ్చిన ఏపీ అధికారులు ఆదిత్యనాథ్‌దాస్‌, సుధాకర్‌బాబు
రూ.5,034 కోట్ల విడుదలకు  రాష్ట్రం నివేదన
ఈనాడు - అమరావతి

పోలవరం తాజా పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వంపై పోలవరం అథారిటీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రాజెక్టు పనులను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? కొత్త గుత్తేదారుతో ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకుంటారు? వంటి అంశాలతోపాటు నిపుణుల కమిటీ నివేదిక.. అందులోని అంశాలపై ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు, ఆకృతుల ఆమోదం, కార్యాచరణ తదితర అంశాలపై అనేక ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్‌లో సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జైన్‌, సభ్య కార్యదర్శి పాండే ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నాగిరెడ్డి, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ మురళి తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కొత్త టెండర్ల ప్రక్రియపై ఇంతకు ముందే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు వివిధ సందేహాలు లేవనెత్తుతూ పోలవరం అథారిటీ నివేదిక సమర్పించింది. గతంలో టెండర్లు పిలిచే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికకు, తాజాగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలకు మధ్య ఉన్న తేడాలపై ప్రధానమంత్రి కార్యాలయం సూచన మేరకు అథారిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నివేదిక కోరింది. ఈ సమావేశంలో దాదాపు అదే కోణంలో మళ్లీ అధికారుల ముందు అనేక సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తినట్లు సమాచారం.

ఒప్పందం ఎప్పుడు?
పోలవరంలో వరద కారణంగా గత కొంత కాలంగా ఎలాంటి పనుల పురోగతి లేని నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ఎప్పుడు చేపట్టబోతున్నారని అథారిటీ సీఈవో జైన్‌ ప్రశ్నించారు. కొత్త గుత్తేదారుతో ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకోబోతున్నారని అడిగారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, హైకోర్టు స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయని.. తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు చెప్పారు.
తీర్పు వెలువడిన వెంటనే ఒప్పంద ప్రక్రియ పూర్తి చేస్తామని వివరణ ఇచ్చారు. 2021 అక్టోబరు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యం విధించుకున్నారని, ఆలస్యంవల్ల గడువులోపు పూర్తి చేయగలరా? అని అథారిటీ ప్రశ్నించింది. పనులు ఆలస్యమయ్యే కొద్దీ ఆర్థికంగా భారం అవుతుందన్న విషయంపైనా అడిగింది. రివర్స్‌ టెండర్ల వల్ల ప్రభుత్వానికి రూ.786 కోట్ల వరకు ఆదా అయిన విషయాన్ని అధికారులు వివరించారు. గతంలో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ 14.3 శాతం తక్కువకు టెండర్లు దాఖలు చేసిందని, దానిమీద ఇప్పుడు కొత్త గుత్తేదారు సంస్థ 12.6శాతం తక్కువకు దాఖలు చేసిందని మొత్తం మీద 26.9 శాతం తక్కువతో గుత్తేదారు ఎలా పని చేస్తారని, సాధ్యమేనా? అని అథారిటీ ప్రశ్నించింది. హైడల్‌ ప్రాజెక్టుతో కలిపి గుత్తేదారు సంస్థ పని చేస్తున్నందున ఉమ్మడిగా వచ్చే లాభనష్టాలను పరిగణనలోకి తీసుకుని ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఒప్పందం తర్వాత కొత్త ఏజెన్సీ యంత్రపరికరాలు సమకూర్చుకోవడం, పనులు ప్రారంభించడానికి మరింత ఆలస్యం కాదా? అని అథారిటీ ప్రశ్నించింది. కొత్త గుత్తేదారు సమర్థత ఉన్నవారేనని, యంత్రపరికరాలు సమకూర్చుకోగలరని, పైగా పోలవరం క్షేత్రస్థాయిలో ఉన్న మిషనరీ ట్రాన్స్‌ట్రాయ్‌ ఎప్పుడో సమకూర్చినదేనని, ఇప్పటికీ అది ప్రాజెక్టు వద్దే ఉందని అధికారులు చెప్పారు.

పని పరిమాణంలో తేడా ఎందుకు?
ప్రాజెక్టు అధికారులు ప్రగతి నివేదికలో పేర్కొన్న పనికి, రివర్స్‌ టెండర్లలో పేర్కొన్న పని పరిమాణానికి మధ్య వ్యత్యాసం ఉన్న విషయాన్ని అథారిటీ ప్రస్తావించింది. ఆమోదించిన ఆకృతుల మేరకు ఎంత పని జరిగిందని ప్రగతి నివేదికలో పేర్కొన్నారో.. తదనుగుణంగానే గుత్తేదారుతో ఒప్పందం సమయంలో అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించింది.

విచారణ కమిటీలో కేంద్ర ప్రతినిధిని చేర్చండి
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికతో పాటు విజిలెన్సుకు విచారణ బాధ్యతలు అప్పజెప్పడం, ప్రత్యేక విచారణ బృందాల ఏర్పాటుపై చర్చ జరిగింది. ప్రాజెక్టు ప్రధాన డ్యాం, ఎడమ, కుడి కాలువల అవకతవకల అంశాలు విచారణ పరిధిలో చేర్చారు. ఈ విచారణలో ఏయే ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి? వాటి వివరాలు, విచారణ పరిధి ఎంతవరకు ఉంది? తదితర అంశాలను తెలియజేయాలని అథారిటీ కోరింది. ఈ విచారణ బృందంలో కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సిఫార్సు చేసే అధికారిని నియమించాలని సూచించింది.

విభాగాల వారీగా కార్యాచరణ నివేదిక
ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయడమే ముఖ్యమని, ప్రధాన డ్యాం పనుల్లో విభాగాల వారీగా ఏ ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయనున్నారో నివేదిక ఇవ్వాలని అథారిటీ కోరింది. అవసరమైతే ఒకరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు జరిపి ఆకృతుల ఆమోదం పూర్తి చేయాలని వివరించింది. 2020 మే నాటికి కాఫర్‌ డ్యాంలో మిగిలిన పనులు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. 41.15 మీటర్ల ఎత్తుకు అవసరమైన మేర పునరావాస కార్యక్రమాలను 2020 మే నాటికి పూర్తిచేయాలని సూచించింది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన రూ.5,034 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉందని ఏపీ అధికారులు అథారిటీకి నివేదించారు. ఆ నిధులు తక్షణమే విడుదలయ్యేలా చూడాలని విన్నవించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.