close
ఊరికో ఇసుకాసురుడు

మద్యం గొలుసు దుకాణాల్లా  వైకాపా కార్యకర్తల ఇళ్లు
జగన్‌ పాలనలో గతితప్పిన అభివృద్ధి
పెళ్లిళ్లకు హాజరవుతారు

 కోర్టుకెళ్లాలంటే ఖర్చంటారు
శ్రీకాకుళంలో చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు - శ్రీకాకుళం

‘‘గత ఐదేళ్ల పాలనలో ఒక్క నిమిషం కరెంటు కోత లేకుండా చేశా. ఇప్పుడు రాష్ట్రంలో కోతలతో విద్యుత్తు సరఫరా తీరు అధ్వానంగా మారింది. ఇంట్లో ఉంటే ఉక్కబోత.. బయట ఉంటే దోమలతో రోగాలమోత. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి’’  సామాజిక మాధ్యమాల్లో పోస్టులు  పెడుతున్నారనో, మరొకటనో తెదేపా   శ్రేణులపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు.  ఈ సమావేశంలో సీఎం డౌన్‌డౌన్‌ అంటాం. కేసులు పెడతారా? ప్రజాస్వామ్యం అనేది లేదా?

- చంద్రబాబు

జగన్‌ పాలనలో ఊరికొక ఇసుకాసురుడు తయారయ్యాడని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ‘మన రాష్ట్రంలోని నదుల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలకు కావాల్సినంత ఇసుక తరలిపోతోంది. విశాఖకు తీసుకెళ్లి లారీ ఇసుక రూ.లక్షకు అమ్ముకుని వైకాపా నేతలు వ్యాపారాలు చేస్తున్నారు. మనకు మాత్రం ఇసుక దొరకదు. మా ప్రభుత్వంలో ఏ అవినీతి జరిగిందో జగన్‌ తవ్వాలంటున్నారు. పదోన్నతులు ఇస్తానని సన్మానాలు చేస్తానని చెప్పారు. ఎంత వెతికినా అవినీతి దొరకలేదు. రూ.43వేల కోట్లు దోచి వాళ్ల మాదిరిగా నేను జైలుకు వెళ్లలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో పెళ్లిళ్లకు వెళ్లొచ్చుగానీ.. కోర్టుకు వెళ్తే మాత్రం రూ.60 లక్షల ప్రభుత్వ ధనం ఖర్చవుతుందంటారు’ అని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలవల్ల అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం శ్రీకాకుళానికి వచ్చిన ఆయన పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ప్రసంగించారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పుకునే జగన్‌ వాయిదాల ముఖ్యమంత్రిగా మారారని చంద్రబాబు ఆరోపించారు. ‘మా హయాంలో పింఛను రూ.200ల నుంచి రూ.2 వేలకు పెంచాం. రూ.3 వేలిస్తానన్న జగన్‌ రూ.2,250ను వాయిదాల్లో ఇస్తున్నారు. మద్య నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చి ప్రభుత్వ అధికారులతో మద్యం అమ్మిస్తున్నారు. టీకొట్లు, కిరాణా దుకాణాలతో పాటు వైకాపా కార్యకర్తల ఇళ్లూ మద్యం గొలుసు దుకాణాల్లా మారాయి. రైతులకు ఇవ్వాల్సిన నాలుగైదు విడతల వడ్డీ మాఫీని విస్మరించారు. ఇది గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అని చెబుతున్న జగన్‌ అప్పటి ప్రభుత్వంలోని పన్ను బకాయిలను వసూలు చేయకుండా ఉంటారా’ అని చంద్రబాబు ప్రశ్నించారు. రివర్స్‌ టెండర్ల పేరుతో రిజర్వుడ్‌ టెండరింగు చేస్తున్నారని, ఏ ఊరిలోనూ తట్టెడు మట్టి ఎత్తిన పాపాన పోలేదని విమర్శించారు.

జగన్‌ వ్యాఖ్యలు కనిపించలేదా?
‘ప్రభుత్వ అధికారిని నిలదీశారని మాజీ ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌పై కేసు పెట్టారు. సామాజిక భవనాన్ని సచివాలయంగా మార్పు చేస్తూ వైకాపా రంగులేస్తున్నారని గ్రామస్తులతో వెళ్లి అడిగితే ‘సీఎం డౌన్‌డౌన్‌..’ అన్నారని మాజీ ఎమ్మెల్యే  కలమట వెంకట రమణపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై ఇక్కడా, అమరావతిలో కేసులు పెట్టారు. జగన్‌ నన్ను నడిరోడ్లో ఉరి వేస్తానన్నప్పుడు పోలీసులు ఇలానే కేసులు పెట్టారా? తుపాకులతో కాల్చేయాలన్నారు. చెప్పులతో కొట్టమన్నారు. మీకు అవన్నీ కనిపించలేదా?’ అని చంద్రబాబు పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎవరి సొమ్మని దోచిపెడతారు?
‘చదువుకున్న యువతను పక్కన పెట్టి 1.50 లక్షల సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాలను, 4 లక్షల మంది వాలంటీర్‌ పోస్టులను సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. ఎవరి సొమ్మని ఏటా రూ.8,400 కోట్లు దోచిపెడతారు. ఎవరైనా పెట్టబడులు పెడితే ఈయనకు జె-టాక్సు కట్టాల్సి వస్తుందని వెనక్కిమళ్లుతున్నారు’ అని చంద్రబాబు ఆరోపించారు. ఓబుళాపురం మైనింగు కేసులో ఉన్నవారిని సలహాదారులుగా పెట్టుకున్నారని విమర్శించారు.

అమరవీరులకు ఘననివాళి
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి త్యాగనిరతి, కర్తవ్యదీక్షల గురించి చంద్రబాబు కొనియాడారు. ‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పోలీసుశాఖకు అండగా ఉంటాం. పోలీసు వ్యవస్థకు సంఘీభావాన్ని తెలియచేద్దాం. విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులు అర్పిద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు నిముషాలు మౌనం పాటించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.