close
ఎట్టకేలకు గట్టుకు

ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత ఒడ్డుకు చేరిన రాయల్‌ వశిష్ఠ బోటు
తెల్లవారుజాము నుంచి కొనసాగిన ఆపరేషన్‌
పంఖా షాఫ్ట్‌కు బిగించిన ఇనుపతాడే కీలకం
పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షణ
వెలికితీతలో 10 మంది డైవర్లు, ధర్మాడి సత్యం బృందం
బోటులో బయటపడిన 8 మృతదేహాలు

దేవీపట్నం, న్యూస్‌టుడే: పాపికొండల విహారయాత్రకు వెళ్తూ.. గతనెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ఠ బోటు ఎట్టకేలకు.. మంగళవారం ఒడ్డుకు చేరింది. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటు బయటపడింది. కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ నేతృత్వంలో విశాఖపట్నానికి చెందిన 10 మంది డైవర్లు, కాకినాడకు చెందిన మత్స్యకార నిపుణుడు ధర్మాడి సత్యం బృందం చేసిన ఆపరేషన్‌ ఫలితాన్నిచ్చింది. బోటులో చిక్కుకుని కుళ్లిన స్థితిలో ఉన్న 8 మృతదేహాలను బయటకు తీశారు.

బోటు బయటకొచ్చిందిలా..
సోమవారం రాత్రే రెండు విడతలుగా నలుగురు డైవర్లు బోటు మునిగిన చోటుకు వెళ్లి బోటు చుట్టూ రెండు, పంఖా షాఫ్ట్‌ వద్ద ఒకటి ఇనుపతాళ్లను కట్టారు. మంగళవారం ఉదయం 6 గంటలకే ఆపరేషన్‌ మొదలైంది. బోటు మునిగిన ప్రాంతానికి నాలుగు ఇంజిన్‌ పడవల్లో కెప్టెన్‌ ఆదినారాయణ, డైవర్లు, ధర్మాడి బృందం వెళ్లారు. ఒడ్డున పొక్లెయిన్‌ ఉంచి, అక్కడున్న రెండు చెట్లకు కప్పీలు కట్టి ఇనుపతాళ్లతో బోటును బయటకు లాగే ప్రయత్నం చేశారు. కానీ బోటుకు కట్టిన రెండు ఇనుపతాళ్లు వదిలేశాయి. దాంతో పని ఆపేయాలని ఆదినారాయణ ఆదేశించారు. ఇద్దరు డైవర్లను లోపలకు పంపి పరిశీలించగా.. షాఫ్ట్‌కు కట్టిన ఇనుపతాడు బాగానే ఉంది. దాని సాయంతో లాగగా, సరిగ్గా మధ్యాహ్నం 1.43 గంటలకు బోటు పైకి లేచింది. 2.45 గంటలకు తీరానికి చేరింది.

బయటపడే ప్రయత్నం చేసినా..
మంగళవారం బోటు వెలికితీసిన తర్వాత అందులో 8 మృతదేహాలు బయటపడ్డాయి. బోటు గ్రిల్స్‌ను దాటుకుని బయటకు వచ్చేందుకు వాళ్లు ప్రయత్నం చేస్తూ మరణించినట్లుగా మృతదేహాలున్న పరిస్థితిని బట్టి తెలుస్తోంది. బోటులో ఒక పుర్రె కూడా కనిపించింది. మొత్తం మాంసాన్ని చేపలు తినేయడంతో పుర్రె మిగిలి ఉంటుందని స్థానికులు అన్నారు.

ఆపరేషన్‌లో ఎవరెవరు..
ప్రమాద సమయంలో ప్రవాహ ఉద్ధృతి, సుడిగుండాలు ఎక్కువగా ఉండటంతో నౌకాదళం కూడా ఏమీ చేయలేమంటూ తేల్చిచెప్పింది. ఆ సమయంలో కాకినాడకు చెందిన సంప్రదాయ మత్స్యకారుడు ధర్మాడి సత్యం బృందం ముందుకొచ్చి అధికారుల అనుమతితో సెప్టెంబరు 30 నుంచి పనులు మొదలుపెట్టింది. మధ్యలో ప్రవాహం పెరగడంతో పనులు ఆపేసి, ఈనెల 16 నుంచి మళ్లీ మొదలుపెట్టారు. 17వ తేదీ నుంచి కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి. ఈనెల 20న విశాఖపట్నం నుంచి వచ్చిన 10మంది డైవర్లు రంగంలోకి దిగారు. రోజూ 12 గంటల పాటు ప్రయత్నించారు. సోమ, మంగళవారాల్లో చేసిన ప్రయత్నాలు ఫలించి.. బోటు ఒడ్డుకు చేరింది.

ఉపయోగించిన పరికరాలు ఇవీ..
బోటును బయటకు తీసేందుకు పలు రకాల పరికరాలను ఉపయోగించారు. ప్రధానంగా 30 మిల్లీమీటర్ల మందం గల ఇనుపతాళ్లు 4,500 అడుగుల పొడవున్నవి వాడారు. ఇవి 70-80 టన్నుల బరువును తట్టుకోగలవు. వాటితో పాటు మరో 2వేల అడుగుల నైలాన్‌ తాడు కూడా ఉపయోగించారు. ఒక పొక్లెయిన్‌, నాలుగు కప్పీలతో బోటును లాగారు.

ముఖ్యమంత్రి చిత్తశుద్ధి రుజువైంది: మంత్రి కన్నబాబు
ఈనాడు, అమరావతి: వశిష్ట బోటు వెలికితీతతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధి రుజువైందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోటు బయటకు తీసిన ధర్మాడి సత్యం బృందాన్ని, అధికారులను అభినందిస్తున్నామని మంత్రి అన్నారు. బోటు ప్రమాదంపై దిగజారి రాజకీయాలు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

మరో నలుగురు ఏమయ్యారో..

77 మందితో పాపికొండలకు వెళ్తూ సుడిగుండాల్లో చిక్కుకుని బోటు మునిగిపోయింది. ఆ సమయంలో కచ్చులూరు గిరిజనులు 26 మందిని రక్షించారు. 51 మంది గల్లంతయ్యారు. ఈ నెల 15 నాటికి 38 మృతదేహాలు, ఆ తరువాత మరో మృతదేహం లభ్యమైంది. మంగళవారం 8 మృతదేహాలు బోటులో బయటపడ్డాయి. మిగిలిన నాలుగు ఏమయ్యాయో తెలియలేదు.

ఎప్పటికీ మరువలేం

‘‘గోదావరిలో ఇంత పెద్ద ఆపరేషన్‌ చేయడం మరువలేం. నది అడుగుభాగంలోకి చేరిన బోటుకు తాళ్లు వేయడం రోజురోజుకూ కష్టంగా మారింది.. బోటు చుట్టూ ఇసుక, మట్టి పేరుకుపోయి, అద్దాలన్నీ మూసుకుపోయాయి. డైవర్లకు మరో బోటు చూపించి అవగాహన కల్పించాకే కిందకు దించేవాళ్లం. అందువల్లే మంగళవారం బోటును బయటకు తీయగలిగాం. సముద్రంలో చేసిన ఆపరేషన్ల కంటే గోదావరిలో బోటును వెలికితీయడం ఆనందంగా ఉంది.’’

- కెప్టెన్‌ ఆదినారాయణ, కాకినాడ పోర్టు అధికారి

బోటు కదిలిన తర్వాతే షాఫ్ట్‌కు తాళ్లను కట్టగలిగాం

‘‘మూడురోజుల పాటు చేసిన ప్రయత్నాలే బోటు బయటకురావడానికి చాలా ఉపయోగపడ్డాయి. ఇసుకలో కూరుకుపోయిన బోటును ముందుకు లాగడంతో పంఖా బయటపడింది. వరద పెరుగుతున్నా, డైవర్ల సాయంతో పంఖా వద్ద ఉన్న షాఫ్ట్‌కు ఇనుపతాళ్లుకట్టి బోటును తీయగలిగాం. మా బృందంలోని 25 మంది 12 రోజుల పాటు  వెలికితీత పనుల్లో పాల్గొన్నారు.’’

- ధర్మాడి సత్యం, మత్స్యకార నిపుణుడు, కాకినాడ

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.