close
కుటుంబాన్ని మింగేసిన కంటైనర్‌

చిత్తూరు జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం
10 మంది దుర్మరణం
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అంతిమ లోకాలకు...
ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృత్యువాత

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, బంగారుపాళ్యం, గంగవరం, పలమనేరు, బైరెడ్డిపల్లె: బ్రేకులు ఫెయిలైన కంటైనర్‌ పది నిండు ప్రాణాలను బలిగొంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది. అదుపు చేసే ప్రయత్నంలో డివైడర్‌ ఎక్కిన మృత్యుశకటం ఏకంగా రాంగ్‌రూట్‌లోకి దూసుకెళ్లింది. తొలుత ఓ ద్విచక్రవాహనదారుడి ప్రాణం తీసింది. అప్పటికీ వేగం అదుపులోకి రాక ఎదురుగా వస్తున్న  వాహనంపై మృత్యుశకటం విరుచుకుపడింది. ఈ విషాదం శుక్రవారం సాయంత్రం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌రోడ్డు వద్ద చోటు చేసుకుంది.

దగ్గరి బంధువు అంతిమయాత్రలో పాల్గొని ఓమ్నిలో నెమ్మదిగానే వస్తున్న కుటుంబమంతా ఒక్కసారిగా తలోవైపు ఎగిరిపడ్డారు. రక్తసిక్తమై ప్రాణాలు విడిచారు. వాహనంలో చిక్కుకున్న వారిని కంటైనర్‌ నుజ్జునుజ్జు చేసేసింది. దీంతో రహదారి రక్తసిక్తమైంది. ఈ మార్గమంతా రోదనలు, వేదనలతో దద్దరిల్లింది. వివరాలివి. బెంగళూరు నుంచి విజయవాడకు కిన్లే నీటి సీసాలతో వెళుతున్న కంటైనర్‌ మొగిలి ఘాట్‌రోడ్డుకు వచ్చేసరికి బ్రేకులు ఫెయిలయ్యాయి. గుర్తించిన డ్రైవర్‌ అప్రమత్తం చేయడంతో క్లీనర్‌ కిందికి దూకేశాడు. వాహనాన్ని అలాగే నడిపితే పల్లపు ప్రాంతంలో ప్రమాదమేనని డ్రైవర్‌ భావించి డివైడర్‌ను దాటించాలని భావించాడు. పూర్తిగా యూటర్న్‌ తిప్పాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ద్విచక్రవాహనాన్ని కంటైనర్‌ మొదట ఢీకొంది. ద్విచక్రవాహనదారుడు ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ఆయన్ని బంగారుపాళ్యం మండలం బలిజపల్లె వాసి నరేంద్రగా పోలీసులు గుర్తించారు. అప్పటికీ ఆగకుండా మృత్యుశకటం తొమ్మిది మంది ప్రయాణిస్తున్న  వ్యాన్‌ను ఢీకొంది. గంగవరం మండలం గండ్రాజులపల్లె పంచాయతీ మర్రిమాకులపల్లెకు చెందిన వారు చిత్తూరు సమీపంలోని తెట్టుగుండ్లపల్లిలో చనిపోయిన బంధువు అంత్యక్రియలకు వెళ్లి స్వగ్రామానికి వెళుతున్నారు.

వ్యాన్‌ను కంటైనర్‌ 20 అడుగుల దూరం లాక్కెళ్లడంతో అది నుజ్జునుజ్జయింది. అందులోని తొమ్మిది మంది శరీరాలు గుర్తించలేనంతగా ఛిద్రమయ్యాయి. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ యజమాని, డ్రైవర్‌ అక్షయ్‌ ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆయన మృతి చెందాడా? లేదా పరారయ్యాడా? అనేది పోలీసులు నిర్ధారించలేదు. ద్విచక్రవాహనంపై ఎంతమంది ప్రయాణిస్తున్నారన్న వివరాలూ తెలియలేదు.

వెనక్కి తిరిగి వచ్చిన బంధువులు
ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. ఓమ్ని వ్యాను కన్నా ముందు మరో వాహనంలో పలమనేరుకు వెళ్లిన మృతుల బంధువులు ఎంతసేపటికి తమవారు రాకపోవడంతో తిరిగి వెనక్కి ప్రయాణమయ్యారు. ప్రమాదాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదంలో తన భార్య, మరదలు, సమీప బంధువులను కోల్పోయానని నాయకుడు రెడ్డి శేఖర్‌ విలపించారు.

వేరైన మొండెం
కంటైనర్‌ ఓమ్నిపై వాలడంతో అందులోని వారి శరీరాలు ఛిద్రమయ్యాయి. వ్యాన్‌ కాలి బూడిదైంది. ఒకరి శరీరం నుంచి మొండెం వేరైంది. కొందరి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. సంఘటన స్థలం మృతదేహాలతో హృదయవిదారకంగా కనిపించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌ బాబు, జిల్లా పాలనాధికారి భరత్‌గుప్తా, పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. మృతదేహాలను బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు. మృతుల స్వగ్రామం మర్రిమాకులపల్లెలో విషాదం ఆవరించింది. ఉదయం బయలుదేరిన వారు రక్తపుముద్దలుగా కనిపించడంతో ఇల్లిల్లూ రోదిస్తోంది.

ప్రమాదం హృదయవిదారకం: పవన్‌కల్యాణ్‌
చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరారు.

మృతుల వివరాలు..
మృతులను రామచంద్ర (50), రాము (38), సావిత్రమ్మ (40), ప్రమీల (37), వెంకటమ్మ (50), సుబ్రహ్మణ్యం (49), చంద్రశేఖర్‌ (45), పాపన్న (49), రాణమ్మ(38)లుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. నరేంద్ర (బలిజపల్లె) చనిపోయారు. మృతుల్లో పురుషులు ఆరుగురు, మహిళలు నలుగురు ఉన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.