close
సమస్యల పరిష్కారానికి ఉద్యమం

 22న నల్లబ్యాడ్జీలతో విధులకు
 ‘ఈనాడు’తో ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐకాస ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. పదకొండో పీఆర్‌సీ అమలు, బకాయిపడిన మూడు విడతల కరవుభత్యం విడుదల కోరారు. సీపీఎస్‌ విధానం రద్దు చేయాలన్నారు. ఈ నెల 22న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, మధ్యాహ్న భోజన సమయంలో ధర్నాలు, 29న పాత తాలూకాకేంద్రాల్లో, డిసెంబరు 10న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించని పక్షంలో డిసెంబరు 20న విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాకు దిగుతామని చెప్పారు. ఇటీవల జరిగిన 105సంఘాల ఐకాస సర్వసభ్య సమావేశంలో ఉద్యమ కార్యాచరణ నిర్ణయించినట్లు ఆయన సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీలు వెంటనే నివేదిక విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థల్లో 1 నుంచి 6వ తరగతి వరకూ ఆంగ్లం తప్పనిసరి చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం ఆంగ్లమాధ్యమ పాఠశాలలకు సమాంతరంగా తెలుగు మాధ్యమ పాఠశాలలను కొనసాగించాలని చెప్పారు.

55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి

* 11వ వేతన సవరణ కమిషన్‌ గడువు గతంలోనే ముగిసినా నవంబరు 30వరకూ పొడిగించారు. మరోసారి పొడిగించకుండా ప్రభుత్వం పీఆర్‌సీ నివేదిక తెప్పించుకోవాలి. 1 జులై 2018 నుంచి 55శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలి.
* కొన్ని విభాగాల్లోని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు 8నెలలుగా వేతనాలు అందడంలేదు. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు జమయ్యేలా చర్యలు తీసుకోవాలి.
* ఉద్యోగి పదవీవిరమణ పొందిన రోజునే అన్ని ప్రయోజనాలు దక్కేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలి.
* ప్రభుత్వ రంగ సంస్థ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇతర శాఖల ఉద్యోగుల తరహాలో వేతన సవరణ ద్వారా పీఆర్‌సీ అమలుచేయాలి...’’ అని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.