close
ఉన్నతవిద్యలో అప్రెంటిస్‌ విధానం

 మౌలానా ఆజాద్‌ సంస్కరణలు గొప్పవి
 సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వెల్లడి

ఈనాడు, అమరావతి: దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా చేసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ నాడు చేపట్టిన సంస్కరణలు ఎంతో గొప్పవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొనియాడారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతవిద్య వరకూ అన్నీ ఆయనే ఆరంభించారని గుర్తుచేశారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, విద్యాశాఖలు సంయుక్తంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు, ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం విద్యా పురస్కార అవార్డుల ప్రదానోత్సవాలను విజయవాడలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సోమవారం నిర్వహించాయి. ఈ కార్యక్రమాల్లో సీఎం జగన్‌ పాల్గొని మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33% నిరక్షరాస్యులు ఉన్నారని, దేశ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని అన్నారు. తొలుత పాఠశాల స్థాయిలో, తర్వాత ఉన్నతవిద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. ఉన్నతవిద్యలో అప్రెంటిస్‌ విధానం తీసుకొస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఉన్నతవిద్యకు బోధన రుసుం ఎంతైనా ప్రభుత్వమే మొత్తం చెల్లిస్తుందన్నారు. విద్యార్థులకు ప్రయాణ, వసతిగృహ ఖర్చులకు రూ.20వేల చొప్పున అదనంగా అందిస్తామన్నారు. మదర్సా బోర్డును ఏర్పాటుచేసి అక్కడ చదివే పిల్లలకు సంప్రదాయ విద్యతో పాటు, ఆంగ్ల మాధ్యమంలో ఆధునిక విద్యను అందించే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మార్చి తర్వాత వైఎస్‌ఆర్‌ పెళ్లికానుక కింద రూ.లక్ష సాయం అందిస్తామన్నారు. మౌజిమ్‌, మౌలానాలు, మసీదులకు ఆర్థికసాయం అందిస్తామని, తనకు కొంచెం సమయం ఇవ్వాలని జగన్‌ కోరారు.

మైనార్టీలకు అండగా..
మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా అన్నారు.  సర్కారు బడి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం విద్యా పురస్కార అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేశ్‌ పేర్కొన్నారు.

జాతీయ, జీవిత సాఫల్య పురస్కారాలు
మౌలానా ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని విద్యారంగంలో విశేషకృషి చేస్తున్నవారికి ప్రభుత్వం పురస్కారాలను ప్రదానం చేసింది. కడప జిల్లాకు చెందిన ఉర్దూ కవి సి.ఎస్‌.అబ్దుస్‌ సలామ్‌ షామీరికి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జాతీయ అవార్డు ప్రదానం చేశారు. జీవిత సాఫల్య పురస్కారాలను డాక్టర్‌ ఎండీ నిస్సార్‌ అహ్మద్‌ (చిత్తూరు), డాక్టర్‌ సయ్యద్‌ మునీర్‌ మొహిద్దీన్‌ (కడప), డాక్టర్‌ జీనత్‌ ఉన్నీసా (కర్నూలు), సయ్యద్‌ హిదాయతుల్లా (కడప), సి.ఎస్‌.అబ్దుల్‌ సలామ్‌ షామీరి (కడప), మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఫౌజ్‌ (కడప)కు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి పనులపై నిగ్గు తేల్చాలి 
సీఎంతో సోము వీర్రాజు 

అమరావతిలో గత తెదేపా ప్రభుత్వం ఖర్చు చేశామని చెబుతున్న రూ.7వేల కోట్ల పనులపై నిగ్గు తేల్చాలని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని నిపుణుల కమిటీకి సూచించానని, ఆ వివరాలను ముఖ్యమంత్రికి కూడా వివరించానని చెప్పారు. సోమవారం సీఎం జగన్‌ను కలిసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. పోలవరం కన్నా విద్య, వైద్యంలో ఎక్కువ అవినీతి జరిగిందని, వాటిపై విచారణ జరిపించాలని కోరానన్నారు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం సబబేఅన్నారు. ఒక రోగికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరు విషయమై కలిశానని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని అన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.