close
మీరూ భాగస్వాములు కండి

 ఇసుక కొరతతో నష్టపోయిన వృత్తిదారులు, వ్యాపారులకు పిలుపు
 ఈ నెల 14న వారికి మద్దతుగా 12 గంటల నిరసన దీక్ష
 రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇసుక కొరతతో రాష్ట్రంలో నిర్మాణరంగం కుదేలై.. 125 రకాల వృత్తులు, వ్యాపారాలకు చెందిన 30 లక్షల మంది రోడ్డున పడ్డారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి కరవై.. భార్యాబిడ్డలకు తిండి పెట్టలేక 40మంది భవననిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. వీరిలో మనోధైర్యం కలిగించేందుకు, ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి అమలుచేయాలని డిమాండు చేస్తూ ఈనెల 14న విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద తాను ‘12 గంటల నిరసన దీక్ష’ చేపట్టనున్నట్లు వివరించారు. ఇసుక కొరత వల్ల నష్టపోతున్న 125 వృత్తుల, వ్యాపారాల ప్రతినిధులు దీనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘అందరికీ ఇసుక అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెదేపా హయాంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశాం. జగన్‌ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చి కృత్రిమ కొరత సృష్టించింది. దీంతో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన కార్మికులను అపహాస్యం చేసేలా మంత్రులు మాట్లాడుతున్నారు. నా దీక్షకు ఇప్పటికే పలు పార్టీలు మద్దతిచ్చాయి’’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

రూ.25 లక్షల పరిహారం..
నిరసన దీక్ష ఏర్పాట్లపై గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘‘కావాలి ఉచిత ఇసుక-పోవాలి ఇసుక మాఫియా అనేది అందరి నినాదం కావాలి. ఇంత పెద్ద ఎత్తున కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం దేశచరిత్రలోనే ఎక్కడా జరగలేదు. ఈ దుస్థితిని చక్కదిద్దాలంటే ఆయా కుటుంబాల్లో భరోసా కల్పించాలి. పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందించాలి. ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలి’’ అని డిమాండ్‌ చేశారు.

పెద్దిరెడ్డిది మైనింగ్‌ దందా
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల మైనింగ్‌ దందా పేట్రేగిపోయిందని చంద్రబాబు విమర్శించారు. కంకర సహా అన్ని రకాల మైనింగ్‌లో వారు 50% వాటా డిమాండు చేస్తున్నారని ఆరోపించారు. దశలవారీగా మద్య నిషేధం ముసుగులో మద్యం తయారీదారుల నుంచి జే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

దీక్షకు తరలిరండి

భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇచ్చేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 14న విజయవాడలో తలపెట్టిన నిరాహార దీక్షకు తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడలోని కేశినేని భవన్‌లో ఇసుక సమస్యపై తెదేపా చేపట్టిన నిరాహార దీక్ష సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేవినేని మాట్లాడారు. చంద్రబాబు చేసే దీక్షకు వేలాదిగా తరలిరావాలని కోరారు. తెలుగు మాధ్యమం ఉండాల్సిందేనని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత జేబు, వైకాపా నాయకుల జేబులు నింపేందుకే అమరావతి, పోలవరం నిర్మాణాలను ఆపేశారని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ ఆరోపించారు.

అన్న క్యాంటీన్‌లనైనా తెరవండి

ఆకలి సైతం తీర్చుకోలేని దయనీయ స్థితికి ప్రజల్ని దిగజార్చినందుకు వైకాపా పాలకులు సిగ్గుపడాలని తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్‌లో మండిపడ్డారు. సాకులు చెప్పకుండా వెంటనే అన్న క్యాంటీన్‌లను తెరిచి పేదలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘‘కష్టించి సంపాదించే దారుల్ని ప్రభుత్వం మూసేస్తే పని లేక ఆకలి చల్లార్చుకునేందుకు కొందరు కూలీలు ఆలయాల్లో అన్న ప్రసాదాల మీద ఆదారపడుతున్నారంటే బాధేస్తోంది. 5 నెలల్లో ఇదేనా ప్రభుత్వం చేసిన ఘనకార్యం? కనీసం అన్న క్యాంటీన్‌లు ఉన్నా ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకునేవి’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.