close
‘ఆకర్షణీయం’ ఎక్కడ?

లక్ష్యానికి దూరంగా స్మార్ట్‌ సిటీలు
కానరాని నూతన ఆవిష్కరణల జాడ
సాధారణ పనులకే ప్రాధాన్యత
ప్రజలకు దక్కని మెరుగైన సేవల భాగ్యం
విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల్లో ఇదే పరిస్థితి
శిరికి సూర్యనారాయణ
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ఉదాత్తమైన లక్ష్యంతో చేపట్టిన ఆకర్షణీయ నగరాల(స్మార్ట్‌ సిటీలు) ప్రాజెక్టులు మన రాష్ట్రంలో పడుతూ లేస్తూ సాగుతున్నాయి. ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త ఆవిష్కరణలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశం నెరవేరడం లేదు. ఒకటీ అరా ఆవిష్కరణలతో సరిపెట్టుకొని సాధారణ పనులకే ప్రాధాన్యమిస్తూ లక్ష్యానికి ఆమడ దూరంలో సాగుతున్నాయి. వీటిలోనూ మళ్లీ ఎడతెగని జాప్యంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 2015-16లో ఆకర్షణీయ నగరాలుగా ఎంపికైన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో ప్రాజెక్టు గడువు 2019-20తో ముగియనుంది. విశాఖపట్నం, కాకినాడలో రూ.600 కోట్లు చొప్పున ఖర్చు చేసినా ఇప్పటికీ అభివృద్ది అంతంత మాత్రంగానే ఉంది. రెండో జాబితాలో ఎంపికైన తిరుపతిలో రూ.400 కోట్లు ఖర్చు చేసినా పలు కారణాలతో ఇక్కడ చాలా పనుల్లో పురోగతి అంతంత మాత్రంగా ఉంది. మూడు నగరాల అభివృద్ధికి ఇప్పటి వరకు చేసిన పనులేవీ?  వీటితో ప్రభుత్వాలు ఆశించిన లక్ష్యం నెరవేరిందా? ప్రజలకు కలిగిన ప్రయోజనాలేమిటి?

రాష్ట్రంలో ఆకర్షణీయ నగరాలుగా ఎంపికైన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో ప్రాజెక్టుల అమలుకు ప్రారంభంలో కనిపించిన ఉత్సాహం, నూతన ఆవిష్కరణలు ప్రస్తుతం కానరావడంలేదు. దీంతో ఆయా నగరాల్లో ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో ప్రజలకు ఉపయోగపడటంలేదు.

మూడు నగరాల్లో రూ.300 కోట్లకుపైగా వెచ్చించి కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినా వీటి పనితీరుపై ఇప్పటికీ ప్రజలకు సరైన అవగాహన లేదు. వీటిని నగరంలో వాహన రాకపోకలు, ట్రాఫిక్‌పై నిరంతర పర్యవేక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు.
మూడు నగరాల్లో గల 120 నగరపాలక పాఠశాలల్లో డిజిటల్‌, వర్చ్యువల్‌ తరగతి గదులు అభివృద్ధి చేసినా నిర్వహణ లోపం కనిపిస్తోంది. ఇప్పటికీ సరైన పాఠ్య ప్రణాళిక ఖరారు చేయకపోవడం, బోధన సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంది.
తిరుపతిలో 27 కిలోమీటర్లు, విశాఖపట్నంలో 334 కిలోమీటర్లు పొడవునా భూగర్భ విద్యుత్తు కేబుల్‌ వ్యవస్థ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు.

కాకినాడలో రోడ్డు మీద రోడ్డు

జాతీయ రహదారిలో సర్పవరం కూడలి నుంచి జగన్నాథపురంలో బాలయోగి విగ్రహం వరకు స్మార్ట్‌ రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాల కంటే నిధులు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే లక్షణంగా ఉన్న రహదారులపై మళ్లీ రహదారులు వేస్తున్నారు. మరోపక్క రూ.7 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన బోటు బిల్డింగ్‌ యార్డు పనులను నిధుల కొరత వెంటాడుతోంది.

తిరుపతిలో నత్తనడకన పనులు

తిరుపతిలో ప్రారంభించిన ముఖ్యమైన పనులు నిధుల కొరత, సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో మందకొడిగా సాగుతున్నాయి. గరుడవారధిలో ఆరు కిలో మీటర్ల పొడవున రూ.684 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పైవంతెన పనులు 32 శాతం పూర్తయ్యాక నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లాలో హస్తకళలకు 3డీ టెక్నాలజీని అనుసంధానించి మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న ‘ఆర్ట్‌ డిస్ట్రిక్ట్‌ సెంటర్‌’ పనులు నిధుల లేమితో నీరసంగా సాగుతున్నాయి.

కొత్త ఆవిష్కరణల్లో పుణే ముందంజ

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా కొత్త ఆవిష్కరణల అమలులో దేశంలో పుణే నగరం ముందంజలో ఉంది. ప్రత్యేకించి టెలీకమ్యూనికేషన్‌, విద్య, వైద్యం తదితర రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ-బైక్‌, స్మార్ట్‌ ఎల్‌ఈడీ, బహుళ అంతస్తుల వాహన పార్కింగ్‌ వ్యవస్థ, స్మార్ట్‌ క్లినిక్‌లు, ఎలక్ట్రిక్‌ బస్సులు, ముఖ్యమైన కూడళ్లలో ప్రజలకు అందుబాటులో ఉచిత వైఫై సదుపాయం, ఖాళీ స్థలాల అభివృద్ధి వంటివి పుణే నగరానికి మంచి పేరు తీసుకొచ్చాయి.

ఆకర్షణీయ నగరాల్లో ఏం చేయాలి?

రహదారులను అభివృద్ధి చేసి..వాటిలో బస్సులు, ఆటోలు, సైక్లిస్ట్‌లు, పాదచారులు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలి.
ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి వీలుగా బహుళ అంతస్తుల పార్కింగ్‌ ప్రవేశ  పెట్టాలి.
ఖాళీ స్థలాలను అన్ని రకాల సదుపాయాలతో ఉద్యానవనాలు, క్రీడా మైదానాలుగా అభివృద్ధి చేయాలి.
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చే అవసరం లేకుండా పౌర సేవల్లో ఆన్‌లైన్‌ విధానం తప్పనిసరి చేయాలి.
అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యమైన సమయాల్లో ప్రజలను చిటికెలో అప్రమత్తం చేసే సమాచార వ్యవస్థను ప్రవేశపెట్టాలి. వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించే కొత్త ఆవిష్కరణలు అవసరం.

విశాఖలో ఆచరణే కరవు

విశాఖలో కొన్ని ప్రాజెక్టుల్లో కొత్త ఆవిష్కరణలకు చోటు కల్పించినా ఆచరణ అంతంత మాత్రంగా ఉంది. కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌కు అనుబంధంగా నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన అత్యవసర కాల్‌ బాక్సుల సేవలు నామమాత్రంగా ఉన్నాయి. ప్రజలకు అవగాహన లేక వీటిని ఉపయోగించడం లేదు. పౌరులకు సత్వర సమాచారాన్ని చేరవేసే పబ్లిక్‌ అడ్రసింగ్‌ వ్యవస్థ పరిమితంగా సేవలు అందిస్తోంది. ఆకర్షణీయ వీధి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.