
శివసేన ఇప్పుడు కొత్తగా షరతులు పెడుతోంది
బలముంటే గవర్నర్ను కలవొచ్చు
ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు
కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టీకరణ
ఈనాడు-దిల్లీ
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరిగిందని, ఈ విషయంలో గవర్నర్ ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడలేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఇప్పటికీ సమయం మించిపోలేదని, సంఖ్యాబలం ఉన్న పార్టీలు ఇప్పుడైనా గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలంటూ కోరవచ్చని చెప్పారు. ఈ విషయమై ఇతర పక్షాలు రెండు రోజుల సమయం కోరితే తాము ఆరునెలలు ఇచ్చామని, అందువల్ల సత్తా ఉన్న ఎవరైనా ముందుకు రావొచ్చని సవాల్ విసిరారు. ఫడణవీసే ముఖ్యమంత్రి అవుతారని ఎన్నికల ముందు చాలా సార్లు చెప్పామన్నారు. ఆయన బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్పష్టం చేశారు. షా ఇంకా ఏమేం చెప్పారంటే..
* రాష్ట్రపతి పాలన విధింపులో తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ దాదాపు 18 రోజులు సమయం ఇచ్చారు. ఆలోపు ఏపార్టీకైనా సంఖ్యాబలం ఉండి ఉంటే గవర్నర్ను కలిసి ఉండొచ్చు. శాసనసభ అయిదేళ్ల కాలపరిమితి 9వ తేదీతో పూర్తయింది కాబట్టి గవర్నర్ తన బాధ్యతగా అన్ని పార్టీలకు లిఖితపూర్వక ఆహ్వానాలు పంపారు. మాతో సహా ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. అలాంటప్పుడు గవర్నర్ ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఎన్సీపీ కూడా చెప్పిన తరువాతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న పార్టీలన్నీ కలిసికట్టుగా గవర్నర్ దగ్గరకు వెళ్లి లేఖలు ఇవ్వొచ్చు.
* ప్రస్తుతం అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంది. ఆరునెలల వరకు అసెంబ్లీని రద్దుచేయరా? అని అడిగితే నేనేమీ చెప్పలేను. నేను మధ్యంతర ఎన్నికలు కోరుకోవడం లేదు. ఆరు నెలల సమయం ముగిసినప్పుడు గవర్నర్ తగిన న్యాయసలహా తీసుకొని ఏం చేయాలో నిర్ణయిస్తారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారమైతే అందరికీ సమయం ఉంది.
* ప్రజలు ఇచ్చిన తీర్పును మేం అపహాస్యం చేయడంలేదు. మేం మిత్రపక్షంతో కలిసి ఎన్నికలకు వెళ్లాం. ఆ తర్వాత అది షరతులు పెట్టింది. దాన్ని మేం అంగీకరించలేదు. అందువల్ల మేం ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాం.
* శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు అంటున్నారు. మిత్రపక్షాలతో నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణల వివరాలను బహిర్గతం చేయడం మా పార్టీ సంస్కారం కాదు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టడంవల్ల భాజపాకే నష్టం జరిగింది. అక్కడ మా ఆపద్ధర్మ ప్రభుత్వం పోయింది తప్పితే ప్రతిపక్షాలకేమీ పోలేదు.
* మేం శివసేనకు విశ్వాస ఘాతుకం చేయలేదు. వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యాం. అయితే వారు లేవనెత్తిన కొన్ని అంశాలను మేం అంగీకరించే పరిస్థితి లేదు. మా కూటమి ప్రభుత్వం ఏర్పడితే దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారని బహిరంగసభల్లో నేను, ప్రధానమంత్రి, వందసార్లు చెప్పి ఉంటాం. అప్పట్లో ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు కొత్త షరతులు పెడుతున్నారు.