close
కేజీ నుంచి పీజీ వరకు..  తెలుగు మాధ్యమ బోధన

జనసేన విధానం ఇది
కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా వైకాపా సర్కార్‌
పవన్‌కల్యాణ్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలో చదువుకునే వెసులుబాటు ఇవ్వడమే జనసేన విధానమని ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించడం పద్ధతి కాదని, దాన్ని కొనసాగిస్తూ అందులో చదువుకునే వారికి ప్రోత్సాహం ఇచ్చేలా తదుపరి ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. బుధవారం విజయవాడలో తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్‌ సామల రమేష్‌బాబు పవన్‌కల్యాణ్‌ని కలిసి మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే దిశగా వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో మాతృభాషను కాపాడే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై వారిరువురు చర్చించారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. జనసేన ప్రభుత్వం వచ్చాక కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలో చదివే వారికి రుసుముల్ని ప్రభుత్వమే చెల్లించే విధానం తీసుకువస్తామని చెప్పారు. 2019 జాతీయ విద్యావిధానానికి సంబంధించిన ముసాయిదాను కస్తూరి రంగన్‌ నేతృత్వంలోని కమిటీ తయారు చేసిందని, అందులో ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన సాగాలని సూచించిందని అన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేసే లోపే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆంగ్లంలో బోధన చేయాలని నిర్ణయించిందని వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సామల రమేష్‌బాబు మాట్లాడుతూ తెలుగు భాషోద్యమ సమాఖ్య తరఫున పవన్‌కు అవసరమైన సహకారం అందిస్తామన్నారు.

భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలోకే..
గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే సీఎం జగన్‌రెడ్డితోపాటు మిగతా 150 మంది వైకాపా ఎమ్మెల్యేలు మట్టిలో కలిసిపోతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఏ ప్రాంతానికి వెళ్లినా వారు తమ భాషను సంరక్షించుకుంటారని, భాషను చంపేసుకోవటం అంటే మన ఉనికిని చంపేసుకున్నట్లే అని పేర్కొన్నారు. మేధావులు దీనిపై గొంతు కలిపి బయటకు రాకపోతే తెలుగుభాషకు ద్రోహం చేసిన వారవుతామన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విజయవాడలోని విశాలాంధ్ర బుక్‌హౌస్‌, ఎమెస్కో బుక్‌ హౌస్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ ఊరికి ఒక్క విద్యార్థి ఉన్నా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాల్సిందేనని చెప్పారు.  హిందీని ప్రవేశపెట్టాలని మోదీ, అమిత్‌షాలు ప్రయత్నించినపుడు తమిళనాడులో ఉవ్వెత్తున నిరసన వచ్చిందని, దేశాన్ని శాసించే వ్యక్తులే వెనక్కి తగ్గారని వివరించారు. మొట్టమొదటి తెలుగు శిలాఫలకాలు దొరికిన ప్రాంతమైన రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ తెలుగు భాష విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు.  300 రకాల పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.