
33% పదవులు వారికే
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు డిజిటల్ - అమరావతి
పార్టీలో 33% పదవులు 35ఏళ్లలోపు వారికే ఇవ్వనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. సీనియర్ల అనుభవం, యువతరం ఉత్సాహం రెండూ పార్టీ పురోగతికి మరింతగా దోహదపడాలని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ యువనేతలతో ఆయన భేటీ అయ్యారు. ‘రాబోయే మూడేళ్లలో 18-35 ఏళ్ల నాయకత్వం తయారవ్వాలి. సామాజిక మాధ్యమ వేదికపై చురుగ్గా ఉండాలి. ప్రజాసమస్యలపై అధ్యయనం చేసి వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ఇన్ని కష్టాల్లో కూడా పార్టీపై కార్యకర్తల్లో విశ్వాసం ఉంది. వారి కష్టాల్లో యువ నాయకత్వం వెన్నంటి ఉండాలి. గ్రామ కమిటీలను పటిష్టం చేసి సంస్థాగతంగా పార్టీని తిరుగులేనిదిగా తయారు చేయాలి...’ అని పేర్కొన్నారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతల దాడులు, దౌర్జన్యాలపై కోర్టులో న్యాయపోరాటం చేస్తూనే క్షేత్రస్థాయిలో రాజకీయ పోరాటం సాగించాలని చంద్రబాబు సూచించారు. నవరత్నాల పేరుతో వైకాపా ప్రభుత్వం 9 రకాల మోసాలకు పాల్పడుతోందన్నారు. ‘పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగువేస్తే... మేం పన్నులు ఎందుకుకట్టాలని జనం తిరగబడే పరిస్థితి వచ్చింది. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి...’ అని సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావు, ప్రధానకార్యదర్శి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘‘బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల చిరునవ్వులను, బంగారు భవితను తిరిగి తెచ్చేందుకు ఎంతవరకైనా వెళ్తా. ఎవరితోనైనా పోరాడతానని హామీ ఇస్తున్నా. ప్రతి చిన్నారి దేశం గర్వించే పౌరులుగా ఎదిగినప్పుడే నెహ్రూకు నిజమైన నివాళి...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇసుకకొరత కారణంగా తండ్రిని కోల్పోయి కొందరు పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్న బాధతోనే నిరసన దీక్ష చేస్తున్నానని వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయం క్షమార్హం కాదు: ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ క్షమార్హం కానిది. ఈ ఏకపక్ష నిర్ణయం ఒక విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న భారతదేశ ప్రతిష్ఠను ఎంత దిగజారుస్తుందో అంచనా వేయడం కష్టం...’’ అని సింగపూర్‌లోని లీ కువాన్ యూ స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జేమ్స్ క్రాబ్ట్రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. క్రాబ్ట్రీ రోహిణీ మోహన్ అనే స్వతంత్ర పాత్రికేయురాలు రాసిన కథనాన్ని కూడా రీట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నారు
నియంతపాలనకు గుణపాఠం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చేతులు కలపాల్సిన సమయం వచ్చిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంసం చేయడమే కాకుండా దేశ పెట్టుబడుల గమ్యస్థానానికి ఉన్న బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నారు. పీపీఏలపై ప్రభుత్వ నిర్ణయాన్ని జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది. అమరావతి అంకురప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి సింగపూర్ ప్రభుత్వం వైదొలగడంపై విఖ్యాత ఆర్థికవేత్తలు, జర్నల్స్ ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు పంపిస్తున్నాయి...’’ అని బుధవారం ట్వీట్ చేశారు.