close
ఇసుక అక్రమార్కులకు 2 లక్షల జరిమానా.. రెండేళ్ల జైలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమమే
అనధికారిక లే అవుట్‌లలో  స్థలాల క్రమబద్ధీకరణ
మార్కెటింగ్‌ శాఖ ద్వారా  మొక్కజొన్న కొనుగోలు
పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక విభాగం
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు

ఈనాడు అమరావతి: ఇసుక అక్రమ నిల్వ, బ్లాక్‌ మార్కెటింగ్‌, పునర్విక్రయం వంటి చర్యలకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ గనుల చట్టంలో సవరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అనధికారిక లేఅవుట్లలోని 1.5 లక్షల స్థలాల్ని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. మొక్కజొన్న రైతుల్ని ఆదుకునేందుకు మార్కెటింగ్‌ శాఖ ద్వారా మద్దతు ధరకు కొనుగోళ్లు చేయాలని నిర్ణయించింది. పారిశ్రామిక, ఇతర వ్యర్థాల సేకరణ, రవాణా, నిల్వ, శుద్ధి వంటి కార్యక్రమాల నిర్వహణకు కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ వివరాలు మంత్రి మాటల్లో...

అక్రమంగా డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో కొందరు, రాజకీయ కోణంలో మరి కొందరు ఇసుకను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి తిరిగి అమ్ముతున్నారు. ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం. ఇసుక నిల్వ, విక్రయించే అధికారం గనుల శాఖకే ఉంది. ఇసుక కొరతను వారం పది రోజుల్లోపే అధిగమిస్తాం. రెవెన్యూ, పోలీసు, గనుల శాఖల్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దించుతాం. ప్రతి రోజూ 1.5 లక్షల నుంచి 2 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉండేలా చూస్తాం.

వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక విభాగం
రాష్ట్రాన్ని, ప్రజల్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు నియంత్రణ, పర్యవేక్షణకే ప్రభుత్వం పరిమితమైంది. ఇకపై వ్యర్థాల నిర్వహణ బాధ్యతనూ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఏపీఈఎంసీ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో పర్యావరణ వ్యర్థాలపై ఆడిట్‌ లేదు. వ్యర్థాల్ని సముద్రాలు, నదుల్లో కలిపేస్తున్నారు. కొన్నిచోట్ల భూమి లోపలికి పంపేస్తున్నారు. రాష్ట్రంలోని 9 వేల పరిశ్రమల్లో 2 వేలు ‘రెడ్‌’ కేటగిరీవి. 2,638 పరిశ్రమల నుంచి ఏటా 5.56 లక్షల టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. పరిశ్రమల యజమానులే వ్యర్థాల నిర్వహణకు బాధ్యత వహించేలా చేయడం, పారిశ్రామక వ్యర్థాల్ని అక్రమంగా పడేస్తున్న వారిపై గట్టి నిఘా ఉంచడం, వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాల్ని ట్రాక్‌ చేయడం, ఒక పరిశ్రమ పేరుతో వ్యర్థాలు సేకరించి, మరో పరిశ్రమ పేరుతో డిస్పోజ్‌ చేసే విధానాల్ని అడ్డుకోవడం, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల పరిమాణాల్ని నిర్ధారించేందుకు ప్రయోగశాలలు ఉండేలా చూడటం... ఏపీఈఎంసీ లక్ష్యాలు.

ఆంగ్ల మాధ్యమానికి ఆమోదం
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ముక్తకంఠంతో ఆమోదముద్ర వేసింది. మొదట ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రవేశపెడతాం. తెలుగు లేదా ఉర్దూ (మాతృభాష ఏదైతే అది) తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర మేధావుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ వచ్చింది. సాంకేతిక రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో విద్యాభ్యాసం పూర్తయ్యేలోగా... ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడమో, ఆంగ్లం నేర్చుకోవడమో జరుగుతూనే ఉంది. అందుకే సంగ్రహణ శక్తి ఎక్కువగా ఉండే బాల్యం నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు యాజమాన్యాలు, ట్రస్ట్‌ల ద్వారా నడిచే 98.5 శాతం స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన సాగుతోంది. 1.5 శాతం ప్రైవేటు స్కూళ్లలోనే తెలుగు మాధ్యమ బోధన ఉంది. ఇప్పటికే 34 శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన సాగుతోంది. అగ్రకులాల్లోని పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలే ఎక్కువగా ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. వారందరి కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. చాలామంది పెద్దలు కంగారు పడుతున్నట్లు తెలుగు భాష పూర్తిగా అంతర్ధానమయ్యే పరిస్థితి లేదు. పన్నెండో తరగతి దాకా తెలుగు లేదా ఉర్దూ కచ్చితంగా చదివి తీరాల్సిందే.

అనధికారిక లేఅవుట్లలోని స్థలాల క్రమబద్ధీకరణ
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో అనేక ఏళ్లుగా అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్‌లు వేశారు. అందుబాటు ధరల్లో ఉన్నాయన్న ఉద్దేశంతో ఎక్కువగా మధ్యతరగతి, పేద వర్గాలవారే స్థలాలు కొనుక్కున్నారు. వారు ఇప్పుడక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్‌ రాదు. బ్యాంకులు రుణాలివ్వవు. అందుకే 2019 ఆగస్టు 31 కంటే ముందే స్థలాలు కొనుక్కుని, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి స్థలాల్ని క్రమబద్ధీకరిస్తాం. 30 అడుగుల రోడ్డు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. విధివిధానాలు త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్రం మొత్తంలో 2,600 లేఅవుట్‌లలో 1.5 లక్షల స్థలాలు క్రమబద్ధీకరించాల్సి ఉన్నట్లు గుర్తించాం.

మొక్కజొన్న రైతుల్ని ఆదుకుంటాం
మొక్కజొన్న ధరలు వారం రోజుల్లోనే క్వింటాలుకు రూ.2,200 నుంచి రూ.1,500కి పడిపోయాయని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.1,750 కూడా రైతులకు దక్కడం లేదని తెలిపారు. రైతుల్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రైతుకు నష్టం జరగకుండా మార్కెటింగ్‌ శాఖ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పారు.

మంత్రివర్గం తీసుకున్న ఇతర నిర్ణయాలు

* ముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే.... కుటుంబానికి చెల్లించే పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండి, వైఎస్సార్‌ బీమా పథకం కింద నమోదు చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద ఈ పథకం అమలు.
* ఏపీ సౌర విద్యుత్‌ విధానం-2018, పవన విద్యుత్‌ విధానం-2018, విండ్‌, సోలార్‌ హైబ్రిడ్‌ పవర్‌ విధానం-2018ల్లో సవరణలకు ఆమోదముద్ర. డిస్కంలు, ట్రాన్స్‌కోలకు నష్టం జరగకుండా,ఆర్థికంగా కుదేలవకుండా ఈ సవరణలు.
* రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అనుగుణంగా... గ్రామ న్యాయాలయాల చట్టం-2008లో సవరణ.
* ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టానికి సవరణ.
* అగ్నిమాపకశాఖలో ఒక డైరెక్టర్‌, డీఎఫ్‌ఓ ర్యాంకులో 3 అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల ఏర్పాటుకు ఆమోదం.
* రూ.2.5 కోట్లకుపైగా వార్షిక ఆదాయం ఉన్న ఎనిమిది దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల్లో సభ్యుల నియామకానికి మంత్రివర్గ ఆమోదం.
* ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ లా చట్టంలో సవరణలకు ఆమోదముద్ర.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.