close
5 నెలల్లో 50 మంది ఆత్మహత్య

ఇంత ఘోరం చరిత్రలో లేదు
అందుకే దీక్ష చేస్తున్నా: చంద్రబాబు
నేటి ఉదయం 8 నుంచి  రాత్రి 8 వరకూ దీక్ష
ఏర్పాట్లు పూర్తి చేసిన తెదేపా శ్రేణులు
దీక్షకు హాజరుకానున్న  జనసేన, లోక్‌సత్తా
సంఘీభావం ప్రకటించిన సీపీఐ, కాంగ్రెస్‌

ఈనాడు డిజిటల్‌- అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ.. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకు చంద్రబాబు గురువారం ‘‘12 గంటల నిరసన దీక్ష’’ చేపట్టనున్నారు. విజయవాడలోని ధర్నాచౌక్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనసాగే ఈ దీక్షను జయప్రదం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  వైకాపా నేతలు చేస్తున్న దోపిడీకి అమాయకులు బలవుతున్నారని, 5 నెలల్లో 50మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం చరిత్రలో ఎన్నడూ లేదని ఆయన మండిపడ్డారు. గుంటూరు, కృష్ణా జిల్లాల తెదేపా నాయకులతో బుధవారం చంద్రబాబు వీడియోకాన్ఫరెన్సులో మాట్లాడారు. ‘తక్షణమే ఇసుకను ఉచితంగా  ఇవ్వాలి. పొరుగు రాష్ట్రాలకు అక్రమరవాణాను అడ్డుకోవాలి. పనులు కోల్పోయిన వారికి నెలకు రూ.10వేలు భత్యమివ్వాలి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం కావాలనే కృత్రిమ కొరత సృష్టించింది. వైకాపా నేతలే మాఫియాగా ఏర్పడి దోచుకుంటున్నారు. వీళ్ల నిర్వాకం వల్ల పనుల్లేక ఎన్నో కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. చాలామంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇసుక, సిమెంటు, మద్యం, కాంట్రాక్టు పనులు.. ఇలా అన్నింటిలోనూ దోపిడీ చేస్తున్నారు. కార్మికుల కుటుంబాలకు సంఘీభావంగా అన్ని వర్గాల ప్రజలు ర్యాలీగా తరలివచ్చి దీక్షలో పాల్గొనాలి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాలి...’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ను నిలిపేయడం ఏపీ అభివృద్ధికి ఊహించని శరాఘాతమని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులొచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టులన్నీ ఆపేశారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు...’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

దీక్షకు ఏర్పాట్లు పూర్తి
దీక్ష కోసం తెదేపా శ్రేణుల ఆధ్వర్యంలో ప్రధాన వేదిక ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి వచ్చే పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బంది కలగకుండా ప్రాంగణ సమీపంలో రెండు ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధర్నాచౌక్‌ రోడ్డులోకి సాధారణ ప్రజలు రాకుండా పోలీసులు బారికేడ్లు, ఇతర భద్రతా చర్యలు చేపట్టారు. తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, తదితరులు ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నిరసన దీక్షకు తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ హాజరుకానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ‘‘ఇసుక కొరత, తెలుగుభాషకు అన్యాయం, అమరావతిలో అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి సింగపూర్‌ వైదొలగడం వంటి ఎన్నో సమస్యలున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించకుండా ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తున్న ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరికి వచ్చింది. ప్రజల సూచనలు, సలహాలను స్వీకరించలేని దుస్థితిలో ఉంది. పవన్‌పై రాష్ట్ర మంత్రి సభ్యత, సంస్కారం లేకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగడం దారుణం...’’ అని విమర్శించారు.

హాజరుకానున్న జనసేన నేతలు
చంద్రబాబు దీక్షకు జనసేన మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, ఇతర నేతలు పాల్గొననున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ పాల్గొంటారని లోక్‌సత్తా ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణతో చంద్రబాబు మాట్లాడారని, పూర్తి మద్దతు ఉంటుందని వివరించింది. సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. నేతలెవరూ పాల్గొనబోరని స్పష్టం చేశాయి. అదే విధంగా దీక్షలో పాల్గొనబోమని భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యకు తమ సంఘీభావం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.

పార్థసారథి దీక్షకు అనుమతి నిరాకరణ
గురువారం ధర్నాచౌక్‌లో దీక్ష చేసేందుకు అనుమతించాలని వైకాపా ఎమ్మెల్యే కె.పార్థసారథి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారక తిరుమలరావును కోరారు. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ఆయనకు అనుమతి నిరాకరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.