
ప్రధాన న్యాయమూర్తి కార్యాలయమూ ఆర్టీఐ పరిధిలోకే
సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
అయితే.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో పెట్టుకోవాలి
కొలీజియం నిర్ణయాలకు కారణాలను వెల్లడించం
సంపూర్ణ పారదర్శకత వాంఛనీయం కాదు
ఆర్టీఐని నిఘాకు సాధనంగా వాడుకోరాదు
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
దిల్లీ హైకోర్టు తీర్పునకు సమర్థింపు
గోప్యత, పారదర్శకత, న్యాయవ్యవస్థ స్వతంత్రతల మధ్య సమతౌల్యం ఉండాలి. స్వతంత్రతకు భంగం కలగకుండా న్యాయవ్యవస్థను పరిరక్షించి తీరాలి.
- జస్టిస్ ఎన్.వి.రమణన్యాయ వ్యవస్థ స్వతంత్రత, పారదర్శకత ఒకదానితో ఒకటి కలిసి ప్రయాణించాలి. తెలుసుకునే హక్కు, వ్యక్తిగత గోప్యత.. రెంటినీ సమన్వయ పరుచుకోవాలి. జాతీయ భద్రత, సున్నితమైన దౌత్య సంబంధాలు వంటి విషయాల్లో ప్రభుత్వ సంబంధిత సమాచారాన్ని సంపూర్ణంగా వెల్లడించడంలో కొన్ని పరిమితులు ఉంటాయి.
- జస్టిస్ సంజీవ్ ఖన్నా
దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం ప్రజా అధికార సంస్థ (పబ్లిక్ అథారిటీ) అని, దానికి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సీజేఐకీ ఆర్టీఐ వర్తిస్తుందంటూ 2010లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, న్యాయస్థానంలోని కేంద్ర ప్రజా సమాచార అధికారి (సీపీఐవో) దాఖలు చేసిన మూడు అపీళ్లను కొట్టివేసింది. ఆర్టీఐని నిఘాకు ఒక సాధనంగా వాడుకోరాదని హెచ్చరించింది. పారదర్శకత విషయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది.
న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను వెల్లడిస్తామని, కారణాలను మాత్రం కాదని తేల్చి చెప్పింది. గోప్యత హక్కు అనేది ముఖ్యమైన కోణమని, సీజేఐ కార్యాలయం నుంచి సమాచారాన్ని ఇచ్చే నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు గోప్యత హక్కు- పారదర్శకత మధ్య సమతుల్యం పాటించాలని ధర్మాసనం నొక్కి చెప్పింది. సీజేఐతో పాటు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా కలిసి ఒక తీర్పు రాశారు. దీనితో ఏకీభవిస్తూనే జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లు విడివిడి తీర్పులు వెలువరించారు. సీజేఐ కార్యాలయం ఆర్టీఐ చట్ట పరిధిలోకి వస్తుందని దిల్లీ హైకోర్టు 2010 జనవరి 10న సమర్థించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే న్యాయమూర్తుల విశేషాధికారం కాదని, అది వారి కర్తవ్యమని ఆ తీర్పు పేర్కొంది. సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ చట్ట పరిధిలోకి తీసుకువస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలుగుతుందన్న వాదనను ఆనాడు తోసిపుచ్చింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ప్రభుత్వంలో అన్నింటా సంపూర్ణ పారదర్శకత సాధ్యం కాదు, వాంఛనీయమూ కాదని వ్యాఖ్యానించింది. తెలుసుకునే హక్కు సంపూర్ణమైతే అది మరొకరి గోప్యతలో చొరబడడమే అవుతుందంది.
సమతుల్యత అవసరం
- జస్టిస్ ఎన్.వి.రమణ
‘‘ఈ కేసు రెండు ముఖ్యమైన ప్రాథమిక హక్కుల మధ్య సమతౌల్యానికి సంబంధించినది. ఒకటి సమాచార హక్కు చట్టం, రెండోది గోప్యత హక్కు. ఇవి రెండూ ఒకదానితో ఒకటి సంఘర్షిస్తున్నట్లు తరచూ కనిపిస్తుంటుంది. ఈ సంఘర్షణను మరింత పెంచేలా ఈ హక్కుల్ని చూడాల్సిన అవసరం లేదు. ఈ రెండూ ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు వంటివి. ఇక్కడ కావాల్సిందల్లా ఏమిటంటే సమతుల్య సూత్రం. అది వ్యక్తిగత కేసులకు సులభంగా వర్తించేలా ఉండాలి. గోప్యతకు, ప్రజా ప్రయోజనానికి మధ్య సమతుల్యం సాధించడమే స.హ.చట్టంలోని 8(1)(జె) ఉద్దేశం. గోప్యత ఆశించడానికి తగిన హేతుబద్ధత ఉందా, అంతిమంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆ గోప్యత మార్గం సుగమం చేస్తుందా అనే రెండంచెల పరీక్ష అవసరం. ఇవి చాలా క్లిష్టమైనవని గుర్తించాలి. దీనిని బట్టి వ్యక్తుల గోప్యత విషయంలో కొన్ని విషయాలను గమనంలో తీసుకోవాలి. సమాచార స్వభావం, ప్రైవేటు జీవితంపై అది చూపే ప్రభావం, నేరం తీరు, క్లెయిందారుల ప్రతిష్ఠ వంటి అనేక విషయాలు దీనిలో చూడాలి. వీటి ఆధారంగా సమాచారం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందా లేదా అనేదానిపై నిర్ణయానికి రావాలి. పారదర్శకత, న్యాయవ్యవస్థ స్వతంత్రత, స.హ.చట్టం... ఈ మూడు సమాన ప్రాధాన్య అంశాల మధ్య సమతుల్యం అవసరమని మనం గుర్తించాలి. ఇతర వ్యవస్థలు తగిన రీతిలో వ్యవహరించకపోయినప్పుడు రాజ్యాంగ పరిరక్షణకు కోటలా నిలిచేది న్యాయ వ్యవస్థ. పౌరుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా న్యాయవ్యవస్థ ఉంటోందంటే దానికి ఆధారం వ్యవస్థ స్వతంత్రతే. దీనికి భంగం కలిగించాలనే ప్రయత్నాల నుంచి న్యాయవ్యవస్థను పరిరక్షించుకోవాలి. పారదర్శకతను సంపూర్ణంగా అనుమతించలేమనేది మదిలో పెట్టుకోవాలి. ఆర్టీఐని నిఘాకు పనిముట్టుగానో, న్యాయవ్యవస్థ ప్రభావవంత పనితీరుకు విఘాతం కలిగించేందుకో వాడుకోరాదు. సమాచార తీరు, అది వెల్లడించకపోవడం వల్ల కలిగే పరిణామాలు/ ప్రమాదాలు/ ప్రజలకు కలిగే ప్రయోజనం, గోప్యత అవసరమేమిటి, సమాచారాన్ని ఎవరికి ఇస్తున్నాం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ...వంటివీ సెక్షన్-8 విషయంలో గమనంలో తీసుకోవాలి.’’
తీర్పుపై స.హ. ఉద్యమకర్తల హర్షం
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, పలువురు స.హ.చట్ట ఉద్యమకర్తలు హర్షించారు. చట్టానికి ఏ ఒక్కరూ అతీతులు కారనే నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. ఆర్టీఐని నిఘాకు సాధనంగా వాడుకోరాదని ధర్మాసనం చేసిన వ్యాఖ్య దిగ్భ్రాంతికరం, అత్యంత దురదృష్టకరమని ఉద్యమకర్తలు అన్నారు. శాసనకర్తలు సహా అందరూ ఈ చట్టం కిందికి రావాల్సి ఉందనే వాదనకు ఈ తీర్పుతో తలుపులు తెరచుకున్నట్లయిందని ఆర్టీఐ ఉద్యమకారుడు లోకేశ్ బాత్రా పేర్కొన్నారు. న్యాయమూర్తులూ మానవమాత్రులేనని, వారూ తప్పులు చేసే అవకాశం ఉంటుందని రాజ్యసభ సభ్యుడు మజీద్ మెమన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో పారదర్శకతను పెంచి, న్యాయవ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని పెంచడానికి తీర్పు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పుడు న్యాయమూర్తులూ జవాబుదారులేనని, ఈ తీర్పు ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
ఇదొక చరిత్రాత్మక తీర్పు. హృదయపూర్వకంగా దీనిని ఆహ్వానిస్తున్నా.
- కేసు కక్షిదారుడైన ఆర్టీఐ ఉద్యమకర్త ఎస్సీ అగర్వాల్
‘ప్రభుత్వం నుంచి జీతం పుచ్చుకుంటున్నవారంతా ఏ హోదాలో ఉన్నప్పటికీ ప్రజా సేవకులే. చేసే పనికి వారంతా జవాబుదారీగా ఉండాలి.’
- శైలేశ్ గాంధీ, సమాచార మాజీ కమిషనర్
పారదర్శకత నుంచి న్యాయమూర్తుల్ని వేరు చేయలేం. న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే న్యాయమూర్తులకు చట్ట నిబంధనల నుంచి పూర్తిగా రక్షణ కల్పించాలని చెప్పడం కాదు. సీజేఐకి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాజ్యాంగం కింద భిన్నమైన ఎలాంటి అధికార క్రమం లేదు. వారికీ న్యాయ నిబంధనలు వర్తిస్తాయి. ఆర్టీఐ, గోప్యత హక్కుల్లో మంచీచెడూ కోణాలు రెండూ ఉన్నాయి. వీటిలోని భిన్న కోణాలను సరిచేస్తూ సమతౌల్యం సాధించాల్సిన అవసరం ఉంది.
- జస్టిస్ డి.వై.చంద్రచూడ్
ఈ తీర్పుతో సహ చట్టం మరింత బలోపేతం
సీఐసీ రాజా సదారాం
ఈనాడు, హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు(సహ) చట్టం పరిధిలోకి వస్తుందని బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగిందని రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ రాజా సదారాం చెప్పారు. సుప్రీం తీర్పుపై ఆయన స్పందిస్తూ ఈ తీర్పు ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందన్నారు. హైకోర్టులో సైతం పరిపాలనా నిర్ణయాలు సహ చట్టం కిందకు వస్తాయి. రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాల పరిపాలనా వ్యవహారాలపైనా సమాచారం అడిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాల ఉత్తర్వులు, మార్గదర్శకాలు, సూచికలన్నీ ఆన్లైన్లో ఆయా శాఖల వెబ్సైట్లో పొందుపరచాలన్నారు.