close
శబరిగిరిపై శరణుఘోష

మండల-మకరవిళక్కు పూజలు ప్రారంభం
గట్టి భద్రత ఏర్పాట్లు చేసిన కేరళ ప్రభుత్వం
ఏపీ నుంచి వచ్చిన మహిళల్ని వెనక్కి పంపిన పోలీసులు

శబరిమల: కట్టుదిట్టమైన భద్రత నడుమ శబరిమలలో అయ్యప్ప దేవాలయాన్ని వార్షిక మండల-మకరవిళక్కు పూజ కోసం శనివారం తెరిచారు. ఈ నేపథ్యంలో కేరళ, తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చిన 10 మంది మహిళలను.. ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలోని పంబ నుంచి పోలీసులు వెనక్కి పంపేశారు. వారు 10-50 ఏళ్ల మధ్య వయసు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. శబరిమలలో ప్రస్తుత పరిస్థితి గురించి  వివరించడంతో వారు వెనుదిరిగారని పోలీసులు తెలిపారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించే అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టు ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. వయసుతో సంబంధం లేకుండా మహిళలందర్నీ ఆలయంలోకి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది సెప్టెంబర్‌ 28న తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. దీన్ని అమలు చేయాలని కేరళలో వామపక్ష ప్రభుత్వం నిర్ణయించడంతో భాజపా కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. మహిళల ప్రవేశానికి  అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు తాజాగా ఎలాంటి స్టే ఇవ్వనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈసారి ఆలయం వద్ద ఏ విధమైన ఆందోళనలకు తావివ్వరాదని నిర్ణయించింది. ప్రచారం కోసం ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలను ప్రోత్సహించరాదని తీర్మానించింది. ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్న మహిళలు కోర్టు నుంచి అనుమతి ఉత్తర్వులను తీసుకొని రావాలని రాష్ట్ర దేవాదాయ మంత్రి సురేంద్రన్‌ స్పష్టంచేశారు.

శనివారం సాయంత్రం 5 గంటలకు గర్భగుడిని తంత్రి కందరారు మహేశ్‌ మోహనరారు తెరిచి పూజలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే భక్తులు కొండ ఎక్కేందుకు అనుమతించారు. వారు ఇరుముడికట్టుతో పవిత్రమైన 18 మెట్లు ఎక్కి ఆలయం వద్దకు చేరుకున్నారు. అంతకుముందు పూజారులు ‘పడిపూజ’ నిర్వహించారు.
ఆలయం, చుట్టుపక్కల భద్రత కోసం దశలవారీగా 10 వేల మందికిపైగా పోలీసులను మోహరించనున్నారు. భక్తులకు గరిష్ఠ స్థాయిలో సౌకర్యాలు కల్పించామని దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తుల కోసం వైద్య, తాగునీరు, టాయ్‌లెట్‌ సౌకర్యాలు కల్పించామని పేర్కొంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.