
ఆర్థిక పురోగమనంలో వృద్ధుల క్రియాశీల పాత్ర
ఇతరులపై ఆధారపడకుండా జీవించేందుకు నిరంతర శ్రమ
నేటి తరానికి భారం కాదని చాటే ప్రయత్నం
ముడతలు పడిన శరీరాలు కొత్త శక్తిని పుంజుకొంటున్నాయి. ఉడిగిన నరాలు స్వావలంబన స్వరాలు వినిపిస్తున్నాయి. మలిసంధ్య కొత్త వెలుగులు విరజిమ్ముతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ అంటూ దీవిస్తూ... ముదిమి తరం ముందడుగు వేస్తోంది. ‘వయోభారం’ పదాన్ని వెనకటి మాటగా మార్చేస్తోంది. సంపద సృష్టిలో తమ వంతు పాత్ర పోషిస్తోంది. శారీరక దృఢత్వం ఉన్నా లేకున్నా... తమకున్న ప్రతిభతోనే ఆర్జన దిశగా పయనిస్తున్నారు సీనియర్ సిటిజన్లు. ప్రపంచ విపణి అంతటా ఇదే ధోరణి. శరీరం సహకరించినంతకాలం కష్టపడడం అనాదిగా మనిషికి అలవాటైన వ్యాపకమే అయినా.. ప్రస్తుతం కుంచించుకుపోతున్న మానవ సంబంధాలు, పెరుగుతున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా స్వయంకృషి, స్వావలంబనను నేటి వృద్ధతరం ప్రాణావసరంగా భావిస్తోంది. కార్మిక, వినియోగ మార్కెట్లలో కేంద్ర బిందువులవుతున్న సహస్రాబ్ది బిడ్డల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో.. కోట్లకొద్దీ వృద్ధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో నిర్వర్తిస్తున్న పాత్ర, స్వతంత్రంగా జీవించేందుకు వారు పడుతున్న తపన అందరి కళ్లనూ తెరిపిస్తోంది.
ప్రపంచ జనాభా ఆయుర్దాయం శీఘ్రగతిన పెరుగుతోంది. అందివచ్చిన వైద్య విప్లవం దీనికో ప్రధాన కారణం. తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ‘ఆధారపడే’వారు ఎక్కువైపోతున్నారన్న గుసగుసలు పుడమి అంతటా వినిపిస్తున్నాయి. వృద్ధులపై పెట్టే వైద్య ఖర్చులు కుటుంబాల్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే! రెండోవైపు కోణాన్ని చూస్తే.. సొంత సంపాదన కోసం, స్వావలంబన కోసం, ఆర్థిక వ్యవస్థల పురోగమనం కోసం వృద్ధుల పడుతున్న శ్రమ కనిపిస్తుంది. ఇతరులు ఉత్పత్తిచేసి.. పంపిణీ చేస్తే తాము వినియోగించే ఆర్థిక వ్యవస్థ(సిల్వర్ ఎకానమీ) నుంచి బయటపడి స్వయం సమృద్ధి సాధనకు వారు చేస్తున్న కృషి కళ్లకు కడుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులు, నవకల్పకులు ఎక్కువవుతున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా.. పని ప్రదేశాల్లో, కమ్యూనిటీలు, కార్యాలయాలు, ఇళ్లు, కుటుంబాల్లో ఉత్పాదకతలో వీరు పాలుపంచుకుంటున్నారు. మరీ బయటికి వెళ్లి పనిచేయలేని వారు ఇంట్లోనే తమ చేతనైన పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. అందివచ్చిన సాంకేతిక విప్లవం ముదిమి వయసులో పనిచేసే వారికి మరింత ఉపకరిస్తోంది. దీనివల్ల శారీరక శ్రమ తగ్గింది. చాలామంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. కార్మిక మార్కెట్లో వృద్ధుల భాగస్వామ్యం పెరగడానికి ఇదో ప్రధాన కారణమని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) తాజాగా అభిప్రాయపడింది. భారత్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో వృద్ధులు వ్యవసాయ పనుల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఈ శ్రమ ఫలితం ఆర్థిక వ్యవస్థల వృద్ధికి తోడ్పడుతోంది.
ఇదీ వృద్ధ కార్మిక శక్తి * 60ల వయసులో ఉన్న జర్మన్లలో దాదాపు సగం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. * అమెరికా, బ్రిటన్లలో వచ్చే ఏడాది బేబీ బూమర్స్(1946-1964 మధ్య జన్మించిన వారు) కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఉద్యోగ మార్కెట్లను విశ్లేషించే ‘గ్లాస్డోర్స్’ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. * బ్రిటన్‌లో 65 ఏళ్ల పైబడిన కార్మికుల సంఖ్య 2024 నాటికి 20 శాతం పెరగొచ్చని ఆ దేశ గణాంకాల విభాగం తాజాగా అంచనాకట్టింది. * భారత్, థాయలాండ్లలోని పట్టణ ప్రాంత కార్మిక మార్కెట్లలో ఉండే వారిలో మూడోవంతు మంది వృద్ధులే. * 50 ఏళ్ల పైబడిన శ్రామికులు పనిలో భావోద్వేగంగా, మేధోపరంగా ఎక్కువ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారని, ఇతర ఉద్యోగులకు అది ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) నివేదిక పేర్కొంది. |
వ్యవసాయ రంగంలో.. * భారతీయ రైతు సగటు వయసు 51 ఏళ్లు. వ్యవసాయాధార భారతదేశంలో వీరి పాత్ర అత్యంత కీలకం. నేటి యువతరం వ్యవసాయం పట్ల అంతగా ఆసక్తి చూపట్లేదు కాబట్టి.. ప్రస్తుత వృద్ధతరం శకం ముగిస్తే.. దేశంలో వ్యవసాయ రంగం పరిస్థితి ఏమిటన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. * మొజాంబిక్‌లో 50% మంది, ఇండొనేషియాలో 55% మంది రైతుల వయసు 55 ఏళ్ల పైనే. * ఫిలిప్పీన్స్, దక్షిణకొరియా, మెక్సికోల్లో వృద్ధులు పనిచేస్తూ కుటుంబంలో కనీసం ఒక్కరికైనా ఆర్థిక సహకారం అందజేస్తున్నారు. |
ఆర్థిక వ్యవస్థల పురోగమనంలో... * అమెరికాలో 50 ఏళ్ల పైబడిన వారు 2015లో దాదాపు 8 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాల్ని జరిపారు.* 2030 నాటికి అమెరికాలోని వినియోగంలో సగానికి పైగా 55 ఏళ్ల పైబడిన వారిదే ఉంటుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అంచనావేసింది. జపాన్‌లో ఇది 67%, జర్మనీలో 86%. * ప్రపంచంలో వృద్ధుల సంఖ్య శీఘ్రగతిన పెరుగుతున్న దేశాల్లో జపాన్ మొదటిస్థానంలో ఉంది. 2050 నాటికి ఈ దేశంలో ప్రతి 100 మందికి 72 మంది ఆధారపడే వారిగానే ఉంటారన్నది అంచనా. అయితే వీరు వినోదాలు, ప్రయాణాలకు ఎక్కువగా ఖర్చుచేస్తుండటంతో.. ఆర్థిక వ్యవస్థ ఆయుర్దాయం పెరుగుతోంది. * 1946-1964 మధ్య జన్మించిన వారు(బేబీ బూమర్స్) ఆన్లైన్లో కొనుగోళ్లకు ఒక్కో వస్తువుపై సగటున రూ.14 వేల దాకా ఖర్చుపెడితే.. సాంకేతికతను పుణికిపుచ్చుకున్న సహస్రాబ్ది బిడ్డలు రూ.12 వేల దాకా ఖర్చుపెడుతున్నట్లు కేపీఎంజీ 2017 నివేదిక వెల్లడించింది. |
సైన్స్ పుణ్యమా అని మనుషుల ఆయుర్దాయం పెరిగింది. వయసు పెరిగే కొద్దీ.. సొంతానికి, కుటుంబాలకు, సమాజానికి ఎంతోకొంత చేయాలని, దానివల్ల తమ జీవితం సార్థకమవుతుందని నమ్మేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఆ నమ్మకంతోనే శ్రమిస్తున్నారు - ప్రపంచ ఆర్థిక వేదిక తాజా నివేదిక
|
వృద్ధ జనాభా ఇలా.. * 2050 నాటికి 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు ఉండొచ్చని అంచనా.* ప్రపంచంలో ప్రస్తుతం 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్య దాదాపు 60 కోట్లు. * జపాన్ జనాభాలో 30 శాతం మంది వృద్ధులే. 70 ఏళ్ల పైబడిన వారు దాదాపు 20%. * భారతదేశ జనాభా ప్రస్తుతం 136 కోట్లు ఉంటే.. ఇందులో 8.16 కోట్ల మంది(6 శాతం) మంది 65 ఏళ్ల పైబడిన వారేనని ఐరాస జనాభా నిధి వెల్లడించింది. 2050 నాటికి భారత్‌లో 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 40 కోట్ల దాకా ఉంటుందని అంచనా. |
సవాళ్లూ ఉన్నాయి..! * వృద్ధుల సంఖ్య పెరగడం దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఆరోగ్యకరం కాదనే వాదనలూ ప్రపంచవ్యాప్తంగా బలంగానే వినిపిస్తున్నాయి. దీనివల్ల పనిచేసే వారి సంఖ్య తగ్గుతుందని, వైద్య ఖర్చులు పెరిగి.. ఆరోగ్య వ్యవస్థలపై భారం పడుతుందనేది వారి ఆందోళన. పెరుగుతున్న వృద్ధ జనాభాకు పింఛన్లు, ఇతరత్రా సామాజిక భద్రత, ఆరోగ్య సేవలు అందించడం * తలకుమించిన భారమని ఐక్యరాజ్యసమితి ఇటీవల వెల్లడించిన నివేదిక హెచ్చరించింది. వృద్ధ శ్రామికులతో ఉత్పాదకత తక్కువని నమ్మే కొన్ని కంపెనీలు వారిని వదిలించుకోవడానికీ ప్రయత్నిస్తున్నాయి. |
* తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడెకన్నెకు చెందిన చంద్రమ్మ(72) స్థానిక దక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. పాత పంటల విత్తనాలను గ్రామీణులకు అందిస్తూ, కమ్యూనిటీ రేడియో(సంగం)లో పంటల సస్యరక్షణపై సూచనలిస్తూ జానపదాలు పాడుతున్నారు. |
* ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల మరణించిన మస్తానమ్మ వయసు 106 ఏళ్లు. అంతటి వృద్ధాప్యంలోనూ వంటల కార్యక్రమం ‘కంట్రీ ఫుడ్స్’ ద్వారా ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ ఛానల్ చందాదారులు దాదాపు 3 లక్షల మంది! |
* చండీగఢ్‌కు చెందిన మన్‌కౌర్ వయసు 103 ఏళ్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలెండ్‌లోని టొరెన్లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ఆమె నాలుగు స్వర్ణ పతకాలను సాధించి ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని రుజువుచేశారు. |
* ఈ ఏడాది సెప్టెంబరు 19వ తేదీన కన్నుమూసిన ఆంథోనీ మాన్సినెల్లీ(107 ఏళ్లు) ప్రపంచంలోనే వృద్ధ క్షురకుడిగా గిన్నిస్ రికార్డులకెక్కారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దాదాపు 9 దశాబ్దాల పాటు ఆయన ఇదే వృత్తిలో కొనసాగారు. మరణించేదాకా రిటైర్ కావొద్దనేది ప్రపంచ మానవాళికి ఆయన ఇచ్చిన సందేశం. |
* హోటల్‌కు వచ్చే, ఆహార పదార్థాల కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసే వృద్ధుల సంఖ్య బాగా పెరిగిందని, హైదరాబాద్ తార్నాకలోని ఓ హోటల్ యజమాని, విజయవాడలోని మరో హోటల్ నిర్వాహకుడు చెప్పారు. |
ముఖ్యాంశాలు
దేవతార్చన

- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?