close
వేలికొనలపైనే వెంకన్న సేవలు

తితిదేలో నగదురహిత లావాదేవీలు
దర్శనం, సేవలు, బస బుకింగ్‌ ఆన్‌లైన్‌లోనే
ఈ-హుండీతో విరాళాలూ అటువైపే
తిరుమలలో తగ్గుతున్న కాసుల గలగలలు

తిరుమల, తిరుపతి దేవస్థానం వద్ద నగదు తరిగిపోతోంది. వడ్డీకాసులవాడి క్షేత్రంలో కాసుల గలగలలు తగ్గాయి. కుబేరుడి అప్పుతీర్చేందుకు తిరుమలేశుడికి భక్తులిచ్చే ధనరాశులు తగ్గిపోతున్నాయి. అలాగని శ్రీనివాసుడి సంపద తగ్గుతోందనుకుంటున్నారా.. అబ్బే అదేమీ లేదు. స్వామివారి బ్యాంకుఖాతాలు కళకళలాడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే ధార్మికసంస్థగా పేరుగాంచిన తితిదేకు హుండీ కానుకలు, విరాళాలు, ఇతర సేవల రూపేణా నిత్యం సగటున రూ.7-8 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నా.. ఈమధ్య నగదు కనిపించడం లేదు. కారణం.. దేవస్థానం అందిపుచ్చుకున్న సాంకేతికత! ఇప్పుడు తితిదేలో చాలా లావాదేవీలు నగదురహితమే! ఏ కౌంటర్‌ వద్దా కరెన్సీనోట్లతో పనిలేదు. అంతా స్వైపింగ్‌.. ఫోన్‌పే.. గూగుల్‌ పే.. ఆన్‌లైన్‌లో సొమ్ము బదిలీలే!!

తితిదే ఆర్థిక కార్యకలాపాలన్నీ నగదురహితంగా చేపడుతూ.. కరెన్సీనోటుకు స్వస్తి పలుకుతోంది. భక్తులు, వ్యాపారులతో జరిపే లావాదేవీల్లోనూ ఆన్‌లైన్‌ పద్ధతే అవలంబిస్తోంది. శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్‌ దర్శనం, ప్రత్యేకదర్శనం, వసతి గదులకు భక్తులు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ సేవలను ముందస్తుగా బుక్‌ చేసుకునేలా తితిదే వెబ్‌సైట్‌ను ఆధునికీకరించడంతో పాటు గోవింద యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో 3నెలల ముందే భక్తులు అంతర్జాలంలో సొమ్ము పంపుతున్నారు. ఆర్జితసేవల టిక్కెట్లను ప్రతినెలా మొదటి శుక్రవారం విడుదల చేస్తుంది. నాలుగు రోజుల పాటు బుకింగ్‌కు గడువిచ్చి.. తర్వాతి మంగళవారం లక్కీ డ్రా తీస్తుంది. ఎంపికైన భక్తులు వెంçనే ఆన్‌లైన్‌లో తితిదే ఖాతాకు డబ్బు బదిలీచేసి.. టిక్కెట్‌ ఖరారు చేసుకోవాలి.

అంతటా స్వైపింగ్‌ యంత్రాలే

తితిదేకు చెందిన అన్ని కౌంటర్లలో స్వైపింగ్‌యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో 7వేల అద్దె గదులుండగా వాటిలో సుమారు మూడోవంతు గదులను ముందస్తుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. మిగిలిన గదులను భక్తులకు కరెంట్‌ బుకింగ్‌ కింద అప్పటికప్పుడు ఇస్తారు.
* అద్దెగదుల కోసం పలుచోట్ల కౌంటర్లున్నాయి. 2019 జనవరి నుంచి అక్టోబరు వరకు లెక్కలు చూస్తే.. వీఐపీల సిఫార్సు లేఖలపై గదులు కేటాయించే శ్రీపద్మావతి విచారణ కేంద్రం వద్ద 97%, ఎంబీసీ వద్ద 100% నగదు రహిత లావాదేవీలు సాగినట్లు తేలింది.
* సాధారణ భక్తులకు గదులు కేటాయించే టీబీ కౌంటర్‌లో 91%, సప్తగిరి విశ్రాంతిగృహాల వద్ద 62, సూరాపురంతోట, రాంభగీచా, సీఆర్వో జనరల్‌ కౌంటర్లలో 50% చెల్లింపులు నగదురహితంగా జరిగాయి.
* తితిదే వెబ్‌సైట్‌, గోవింద యాప్‌లో ‘ఈ-హుండీ’ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చాక భక్తులు విరాళాలనూ ఆన్‌లైన్‌లోనే తితిదే ఖాతాల్లో జమచేస్తున్నారు.
* తితిదే తన అధీనంలోని ట్రస్టులు, పథకాల నిర్వహణ కోసం దాతల ద్వారా సేకరించే విరాళాలను డీడీల రూపంలోనే స్వీకరిస్తుంది. సప్తగిరి మాసపత్రిక, డైరీలు, తితిదే ప్రచురణలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.
* భక్తులు ప్రధానాలయంలోని హుండీలో వేసే నగదు, నగలు మినహా.. అంతటా నోటుకు ‘నో’ చెబుతోంది.

వంద శాతానికి తీసుకెళ్తాం

తితిదే సేవలకు ఆన్‌లైన్‌ లావాదేవీలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. అద్దె గదుల కరెంట్‌ బుకింగ్‌, ఆర్జితసేవల లక్కీడిప్‌లలోనూ కార్డు స్వైపింగ్‌నే ప్రోత్సహిస్తున్నాం. తద్వారా నగదు చలామణిలో ఉన్న ఇబ్బందులు, అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. హుండీ కానుకలు తప్ప ఎక్కడా నగదు వాడే అవకాశం దాదాపు లేదు. తిరుమలలోని వాణిజ్య సముదాయాల్లో దుకాణాల అద్దెనూ నగదురహితంగా తీసుకుంటున్నాం. భవిష్యత్తులో విద్యుత్తు, నీటిబిల్లుల చెల్లింపులకూ ఇదే విధానం అనుసరిస్తాం.

-ఏవీ ధర్మారెడ్డి, తితిదే అదనపు ఈవో, తిరుమల

అవినీతికి తావులేదు

గతంలో గదుల కోసం డబ్బు చెల్లింపులో కొంత అవినీతికి ఆస్కారం ఉండేది. ఇప్పుడా బాధ లేదు. డబ్బు మార్పిడిలో కలిగే ఇబ్బందులు తొలగిపోయాయి. ఏటీఎం కార్డు ఉంటే అన్నిచోట్లా పని అవుతోంది. తితిదే లాంటి ధార్మికసంస్థ సాంకేతికతను అందిపుచ్చుకోవడం అభినందనీయం.

 -ప్రతాప్‌రెడ్డి, హైదరాబాద్‌

చోరీల భయం లేదు

తీర్థయాత్రల్లో పెద్దమొత్తంలో డబ్బులు వెంటపెట్టుకొని తిరగడం ఇబ్బందికరమే. అనుకోకుండా చోరీ జరిగితే ఇలాంటి ప్రదేశాలలో ఎదురయ్యే బాధలు తెలియనివి కాదు. ఆన్‌లైన్‌ ద్వారా వ్యవహారాలు సాగిపోతే ఆ బాధే ఉండదు. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద డెబిట్‌, క్రెడిట్‌కార్డులు అనుమతించడం బాగుంది. 


- పార్థు, బెంగళూరు

- తిరుమల, న్యూస్‌టుడే

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.