close
అన్నిచోట్లా అమ్మభాషే

ప్రపంచవ్యాప్తంగా అందరి బాట ఇదే
కొన్ని దేశాల్లోనే ఆంగ్లమాధ్యమం
తల్లిభాషలోనే బాలలకు మేధోవికాసం
అనువాదంతో విజ్ఞాన సముపార్జన
ఈనాడు - అమరావతి

దేశదేశానా అమ్మభాషకు అందలం...  మాతృభాషలోనే అక్షరాలు దిద్ది...  విజ్ఞానాన్ని సముపార్జించి... అభివృద్ధి  పరంగా అందలాలెక్కుతున్నారు... ఇదీ ప్రపంచవ్యాప్తంగా అనాదిగా అందరూ అనుసరిస్తున్న విధానం. విశ్వవ్యాప్త విజ్ఞానాన్ని తమతమ భాషల్లోకి అనువదించుకుంటున్నారు. చక్కగా  చదివి మేధో సంపన్నులవుతున్నారు.ఎవరిభాషలో వారు పరిపూర్ణ విజ్ఞానులై విజయపతాకలు ఎగురవేస్తున్నారు. బుజ్జాయిల సర్వతోముఖాభివృద్ధి  అమ్మభాషలోనే... అమ్మభాషతోనే సాధ్యమని పలు అధ్యయనాలూ స్పష్టం చేస్తున్నాయి.

ఒక అధ్యయనం ప్రకారం...  ప్రపంచంలో 13 శాతం దేశాల్లోనే ఆంగ్లం ప్రధాన బోధనా మాధ్యమం. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌ వంటి దేశాలతో పాటు, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లోనే ఇంగ్లిషు ప్రధాన మాధ్యమంగా అమల్లో ఉంది.

అంతరిక్షం, అణువిజ్ఞానం మొదలు అన్ని రంగాల్లోనూ అగ్రరాజ్యం అమెరికాకు తీసిపోని చైనాలో చదువు ఆంగ్లంలో చెప్పరు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల పరిశ్రమలకు కేంద్రమైన దక్షిణ కొరియాలో బోధన మాధ్యమం ఆంగ్లం కాదు. ప్రపంచంలో ఆర్థికంగా, సాంకేతికంగా, సాంస్కృతికంగా ఎంతో పురోభివృద్ధి సాధించిన చాలా దేశాల్లో పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచి వారి మాతృభాషలోనే బోధన సాగుతోంది. రష్యా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, ఇరాన్‌, ఇరాక్‌, బ్రెజిల్‌, తైవాన్‌, డెన్మార్క్‌, టర్కీ.. తదితర దేశాల్లో పిల్లలు మాతృభాషలోనే చదువుకుంటున్నారు. వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అవుతున్నారు. వారి భాషలోనే పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. పుస్తకాలు రాస్తున్నారు. ఆంగ్లం నేర్చుకోలేదన్న ఆత్మన్యూనత వారికి లేదు. ఇంగ్లిషు చదవకపోయినా వారికి ఉపాధి, ఉద్యోగాలకు కొరతలేదు.
కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాతృభాషతో పాటు  ప్రత్యామ్నాయంగా ఆంగ్లంలోనూ బోధన సాగుతోంది. చైనా, జపాన్‌, జర్మనీ, రష్యా వంటి దేశాలు విజ్ఞానశాస్త్రాల్నీ వారి మాతృభాషలోనే బోధిస్తాయి. కొన్ని చోట్ల ఇంగ్లిషుని ఒక సబ్జెక్టుగానే నేర్పుతున్నారు. మరీ అవసరం అనుకుంటే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో కొన్ని సబ్జెక్టులు
ఇంగ్లిషులో బోధిస్తున్నారే తప్ప, మాతృభాషను కాదని ఆంగ్లం వెంట పరుగులు పెట్టడం లేదు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలే మాతృభాషలో బోధన సాగిస్తున్నాయి.

వివిధ దేశాల్లో బోధన ఇలా...
* జపాన్‌లో ప్రధాన బోధనా మాధ్యమం జపనీస్‌. విశ్వవిద్యాలయాల స్థాయిలో కొన్ని కోర్సుల్నే ఆంగ్లంలో బోధిస్తారు. లోయర్‌ సెకండరీ స్థాయిలో విదేశీ భాషల్ని నేర్చుకోవచ్చు. దానిలో భాగంగానే ఇంగ్లిషునీ నేర్పిస్తారు.
* చైనాలో ప్రధాన మాధ్యమం మాండరిన్‌. మంగోలియన్‌, టిబెటన్‌, కొరియన్‌ తెగల ప్రజలు ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల్లో వారి మాతృభాషల్లోనూ బోధన సాగుతుంది.
* స్పెయిన్‌లో ప్రధానంగా స్పానిష్‌ మాధ్యమంతో పాటు మరికొన్ని స్థానిక భాషల్లోనూ బోధన ఉంటుంది.
* తుర్క్‌మెనిస్థాన్‌లోని 77 శాతం పాఠశాలల్లో తుర్క్‌మెన్‌లోను, 16 శాతం పాఠశాలల్లో రష్యన్‌ భాషలోనూ బోధన సాగుతోంది.
* రష్యాలో ప్రధాన మాధ్యమం రష్యన్‌ భాషే. కొన్ని అంతర్జాతీయ పాఠశాలల్లో మాత్రం ఇంగ్లిషు మాధ్యమంగా ఉంది. సుమారు 6 శాతం పాఠశాలల్లో స్థానిక మైనారిటీ భాషల్లో బోధన జరుగుతోంది.
* జర్మనీలో పీజీ స్థాయి వరకు బోధన జర్మన్‌లోనే. విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం కొన్ని కోర్సుల్ని ఇంగ్లిషులో బోధిస్తారు. కొన్ని కోర్సులు ఇంగ్లిషు, జర్మన్‌ రెండింటిలోనూ ఉంటాయి. అలాంటి కోర్సుల్లో చేరాలనుకున్నవారు జర్మన్‌లో సి1 స్థాయి కోర్సును పూర్తి చేయాల్సిందే.
* ఇటలీలో ప్రధాన బోధనా మాధ్యమం ఇటాలియన్‌  భాషే. కొన్ని విద్యాసంస్థల్లో ఇప్పుడు సమాంతరంగా ఇంగ్లిషునీ బోధన మాధ్యమంగా అమలు చేస్తున్నారు.
* నార్వేలో ప్రాథమిక, ఉన్నత విద్యాసంస్థల్లో బోధన... మాతృభాష నార్వేజియన్‌లోనే.
* డెన్మార్క్‌లో ప్రధానంగా డానిష్‌లోనే బోధన జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా ఆంగ్లం మాధ్యమమూ ఉంటుంది.
* ఉత్తర, దక్షిణ కొరియాల్లో కొరియన్‌లోనే బోధన.
* అర్జెంటీనాలో స్పానిష్‌ ప్రధాన బోధనా మాధ్యమం.

అక్కడేం చేస్తున్నారు?
* ప్రపంచంలో ఏ కొత్త వైజ్ఞానిక సమాచారం వచ్చినా రాత్రికి రాత్రే కంప్యూటర్ల సహకారంతో వారి భాషల్లోకి అనువదించుకుంటారు. ఆయా శాస్త్రాల్లో నిపుణులైన ఆచార్యులు వాటిని సరళమైన భాషలో తిరగరాస్తారు. వాటిని ప్రచురించి తక్కువ ధరల్లోనే పిల్లలకు అందుబాటులోకి తెస్తారు.
* ప్రాథమికస్థాయి నుంచి అమ్మభాషలోనే బోధన సాగుతుండటం, శాస్త్ర, సాంకేతిక అంశాల్నీ మాతృభాషలోనే చదువుకునే అవకాశం ఉండటంతో... విషయాన్ని విద్యార్థులు త్వరగా గ్రహిస్తారు.
* చదవడం, ఆలోచించడం, భావవ్యక్తీకరణ మాతృభాషలోనే చేసే అవకాశం ఉండటం, అక్కడి పిల్లల్లో మేధో వికాసానికి, సృజనాత్మకత పెరగడానికి దోహదం చేస్తోంది.

పరాయి భాషతో ఇబ్బందులు
* ప్రాథమిక స్థాయి నుంచి అమ్మభాషలో విద్యాబోధన బుజ్జాయిల మేధో వికాసానికి తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* ఆఫ్రికాఖండంలోని చాలా దేశాల్లో ప్రధానంగా ఇంగ్లిషుతో పాటు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, పోర్చుగీస్‌ భాషల్లో బోధన సాగుతోంది. చాలా ఆఫ్రికా భాషలకు లిపి లేకపోవడం, అవి చిన్న చిన్న సమూహాలు మాట్లాడే భాషలు కావడం, ఆ దేశాలు చాలా ఏళ్లపాటు వలస పాలనలో ఉండటం వంటివి దీనికి కారణాలు. దీని వల్ల అక్కడి విద్యార్థులు చదువుల్లో వెనుకబడుతున్నారని యునెస్కో అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు... జాంబియాలో ప్రాథమిక స్థాయి నుంచి విద్యా బోధన ఆంగ్లంలోనే. అక్కడి పిల్లలు ప్రాథమిక విద్య పూర్తి చేసుకునే సమయానికి కూడా ఇంగ్లిషుని బాగా చదవలేక పోతున్నారు. స్పష్టంగా రాయలేక పోతున్నారు. పరీక్ష పత్రాల్లో ఇచ్చే సూచనలు చదివి అర్థం చేసుకోలేక చాలామంది ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. ఇంగ్లిషుని సరిగ్గా చదవలేక పోవడం వల్ల అక్కడి విద్యార్థులు విషయాన్ని గ్రహించడంలో విఫలమవుతున్నారని అధ్యయనంలో తేలింది.
* అంతెందుకు మన దేశానికే వస్తే ఝార్ఖండ్‌లో ప్రధాన బోధనా మాధ్యమం హిందీ. అక్కడ ప్రాథమిక స్థాయిలో 96 శాతం విద్యార్థులు తరగతి గదిలో చెప్పింది అర్థం చేసుకోలేక పోతున్నారని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. దానికి కారణం అక్కడి గ్రామీణ జనాభాలో నాలుగు శాతమే హిందీలో మాట్లాడతారు. మిగతా వారంతా గిరిజన భాషల్నిగానీ, స్థానిక భాషల్ని గానీ
మాట్లాడతారు.

పడికట్టు పదాలతోనే బోధన..

విశ్వవిద్యాలయాల్లో 30-40 ఏళ్లు బోధించిన ఆచార్యులూ ఆంగ్లంలో పాఠ్య పుస్తకాలు రాయలేక పోతున్నారు. మన విద్యార్థులు చదువుతున్న పాఠ్య పుస్తకాల్లో మన ఆచార్యులు రాసినవి ఐదుశాతమైనా ఉండవు. మనం ఎంత చేసినా... ఆంగ్లమాధ్యమంలో పడికట్టు పదాలతోనే బోధించగలం. ఆంగ్లం మాతృభాషగా లేనివారిలో చాలా కొద్దిమందే... అందులో సృజనాత్మకంగా రాయగలరు. నేను కొరియా, తైవాన్‌లలోని పలు విశ్వవిద్యాలయాల్ని సందర్శించాను. అక్కడ బయోటెక్నాలజీ వంటి కోర్సుల్నీ వాళ్ల భాషలోనే బోధిస్తారు. ఇంగ్లిషులోనే సాంకేతిక విద్యను బోధించగలమని వాదిస్తున్న వారికి... భాష, శాస్త్ర పరిజ్ఞానాలు రెండింటిపైనా అవగాహన లేదనుకోవాలి. ఒక భాషంటూ ఉన్న తర్వాత... దానిలో ఇది చెప్పగలం, అది చెప్పలేం అని ఉండదు. ఏ అంశాన్నైనా ఏదో ఒక రూపంలో వ్యక్తం చేయవచ్చు. వేల సంవత్సరాలుగా ఉన్న భాష తెలుగు. ఆ మాటకొస్తే ఆంగ్లభాషలోని పారిభాషిక పదాలన్నీ లాటిన్‌, గ్రీక్‌ నుంచి వచ్చినవే.

- ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, భాషాశాస్త్ర శాఖ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.