close
ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎవర్నీ ఉపేక్షించను

సీఎం జగన్‌ స్పష్టీకరణ
ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
క్లాస్‌ తీసుకోవాలని వై.వి.సుబ్బారెడ్డికి ఆదేశం

ఈనాడు, అమరావతి, దిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆయనపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. బోధన మాధ్యమం విషయంలో ప్రభుత్వ, పార్టీ వైఖరికి భిన్నంగా నాయకులు ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు, పార్టీ నుంచి బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టంచేసినట్టు వెల్లడించాయి. జగన్‌ మంగళవారం సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఎంపీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావన రాగా, సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆ ఎంపీకి క్లాస్‌ తీసుకోవాలని ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జి వై.వి.సుబ్బారెడ్డిని జగన్‌ ఆదేశించారు. ‘‘ప్రభుత్వబడుల్లో చదివేవారంతా పేదపిల్లలే. వారి జీవితాలు మార్చాలన్న మంచి ఆలోచనతోనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నాం. దీన్ని వ్యతిరేకిస్తూ ఎవరు మాట్లాడినా.. వారే స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదు’’ అని జగన్‌ స్పష్టంచేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదు: రఘురామ కృష్ణంరాజు
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను లోక్‌సభలో మాట్లాడలేదని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. తన మాటలన్నీ రికార్డుల్లో నిక్షిప్తమయ్యాయని, కావాలంటే వాటిని ముఖ్యమంత్రికి సమర్పించి వివరణ ఇస్తానని పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలపై జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ‘‘నేను తెలుగు భాషకు మద్దతుగా మాట్లాడాను తప్ప ఆంగ్లమాధ్యమానికి వ్యతిరేకంగా కాదు. తెదేపా హయాంలో ఐదేళ్లలో తెలుగు కోసం చేసిందేమీ లేదని, తెలుగు అకాడమీని కూడా ఏర్పాటు చేయలేదని చెప్పాను. నాకు తెలుగుభాష ఇష్టం కాబట్టి మద్దతు తెలిపాను. తెలుగును పరిరక్షించుకోవాలన్నది మా పార్టీ సిద్ధాంతం కూడా. అందుకే మా ముఖ్యమంత్రి తెలుగు అకాడమీని పునరుద్ధరించారు. తెలుగుపై ప్రేమ లేకపోతే ఆ పని ఎందుకు చేస్తారు? అయితే ఇక్కడ బోధనా మాధ్యమం వేరు, తెలుగు భాష పరిరక్షణ వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి నాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీవీల్లో చూడటం తప్ప.. ఆయన నాతో మాట్లాడింది లేదు. నన్ను సంజాయిషీ అడిగితే లోక్‌సభ రికార్డులు సమర్పించి స్పష్టత ఇస్తాను’’ అని తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.