close
అనంతపురం - అమరావతి రహదారి మారింది!

ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో మార్పు
రాజధాని రింగ్‌రోడ్‌లో కలిసేలా తొలుత ప్రతిపాదన
చిలకలూరిపేట బైపాస్‌కు కలుపుతూ తాజా నిర్ణయం
వ్యయం తగ్గించేందుకేనంటున్న అధికారులు
రాజధానిపై సందిగ్ధం వల్లేనని రాజకీయవర్గాల్లో చర్చ
ఈనాడు - అమరావతి

అనంత-అమరావతి రహదారి నిర్మాణంలో మార్పు... రాజధాని భవితవ్యానికి సూచికగా మారనుందా... ఇప్పుడిదే సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే గుంటూరు సమీపంలోని పేరేచర్ల దగ్గర ప్రతిపాదిత రింగ్‌రోడ్‌లో కలవాల్సి ఉండగా, తాజాగా చిలకలూరిపేట బైపాస్‌లో కలిపేలా నిర్ణయించారు. కొంతకాలంగా రాజధాని అమరావతిపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో... ఈ మార్పు వెనుక మతలబు ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తి చూపుతున్నారు. చివరికి ఇది అనంత-అమరావతికి బదులుగా అనంత-చిలకలూరిపేట ఎక్స్‌ప్రెస్‌వే అయ్యేలా ఉందన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఇంత చర్చ జరుగుతున్నా అధికారులు మాత్రం భూసేకరణ వ్యయం తగ్గించేందుకే ఈ కొత్త ప్రతిపాదన చేశామని చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో మంత్రులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతో ‘అమరావతి’ వ్యవహారంపై సందిగ్ధత నెలకొంది. అసలు రాజధాని ఇక్కడ ఉంటుందా? లేదా? అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఈ క్రమంలోనే అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే మార్పును జాతీయ రహదారుల అధికారులు ప్రతిపాదించగా.. దీనికి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం కూడా తెలిపారు.

జాప్యం తప్పదా...
ఈ రహదారిలో మొత్తం ఆరు వరుసలకు భూసేకరణ చేయనున్నారు. మధ్యలో రెండు వరుసలకు ఖాళీ వదిలేసి ఆ మేరకు డివైడర్‌ నిర్మిస్తారు. దానికి ఇరువైపులా రెండేసి చొప్పున నాలుగు వరుసల మార్గం నిర్మిస్తారు. భవిష్యత్‌లో ఈ మార్గంలో వాహన రద్దీ పెరిగాక మధ్యలో ఖాళీ ఉంచిన స్థలంలో మిగిలిన రెండు వరుసలు విస్తరిస్తారు. ఎక్స్‌ప్రెస్‌వేను చిలకలూరిపేట బైపాస్‌లో కలిపేలా తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం లభించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కర్నూలు పరిస్థితి ఏమిటి?
రాయలసీమ వాసులకు రాజధాని ప్రాంతం దూరమనే భావన ఉండకూదని, త్వరగా వచ్చి వెళ్లేందుకు వీలుగా ఉండాలని అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను ఆరు వరుసల్లో నిర్మించాలని గత ప్రభుత్వం భావించింది. కడప నుంచి  88.8 కి.మీ., కర్నూలు నుంచి 20.3 కి.మీ. చొప్పున నాలుగేసి వరుసల రహదారులు వచ్చి, ‘అనంత-అమరావతి’ రహదారిలో కలిసేలా తొలుత ప్రతిపాదించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం అధికమవుతుందనే కారణం చూపి, వాటిని పక్కన పెట్టారు. మొదటి దశలో ప్రధాన రహదారి నిర్మిస్తామని, తర్వాత రెండోదశలో కడప, కర్నూలు నుంచి వచ్చే రహదారులు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా ఇటీవల సీఎం దగ్గర అనంత- అమరావతి రహదారిపై సమీక్ష జరిగిన సమయంలో.. కడప  నుంచి వచ్చి కలిసే మార్గాన్ని తొలిదశలోనే నిర్మించేలా చూడాలని జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేసి, ఉన్నతాధికారులకు పంపుతామని చెప్పారు. కర్నూలు మార్గంపై స్పష్టత లేదు.

ఇదీ స్వరూపం
* అనంతపురం నుంచి అమరావతి దాకా మలుపులు లేకుండా తక్కువ సమయంలో చేరుకునేలా 384 కి.మీ. మేర ‘యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే’ నిర్మిస్తారు.
* ఈ రహదారికి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ (మోర్త్‌)... ఎన్‌హెచ్‌-544ఎఫ్‌ సంఖ్యను కేటాయించింది.
* నిర్మాణానికి జాతీయ రహదారుల విభాగం చేసిన ప్రతిపాదనలను మోర్త్‌ ఆమోదించింది.
* అటవీ ప్రాంతం కాకుండా 5,133 హెక్టార్ల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. దీనికి రూ.2 వేల కోట్లకుపైగా వ్యయం కానుంది. ఇందులో సగం భరించేందుకు కేంద్రం అంగీకరించింది.
* ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ సాగుతోంది. భూసేకరణ పూర్తయ్యాక ఎన్‌హెచ్‌ఏఐ రహదారి నిర్మాణం చేపట్టనుంది.

తాజా ప్రతిపాదన

రాజధాని చుట్టూ నిర్మించాలనుకున్న ఓఆర్‌ఆర్‌లో పురోగతి లేకపోవడంతో అనంత-అమరావతి రహదారిని ఎక్కడ కలపాలని జాతీయ రహదారుల అధికారులు తర్జనభర్జన పడ్డారు. ప్రభుత్వం నుంచీ స్పష్టత లేకపోవడంతో చివరకు చిలకలూరిపేట దగ్గర నిర్మిస్తున్న బైపాస్‌లో కలిపేలా కొత్తగా ప్రతిపాదించారు.

తొలి ప్రతిపాదన

అనంతపురం నుంచి మొదలయ్యే ఎక్స్‌ప్రెస్‌వే అమరావతి చుట్టూ నిర్మించ తలపెట్టిన బాహ్య వలయ రహదారి (ఔటర్‌ రింగ్‌రోడ్‌ -ఓఆర్‌ఆర్‌)లో కలిసి రాజధానిని అనుసంధానిస్తుంది. అనంతపురం జిల్లా మరూరు గ్రామ పరిధిలో ‘హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి-44’ దగ్గర మొదలై కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా ఎక్స్‌ప్రెస్‌వే సాగుతూ పేరేచర్ల దగ్గర ఓఆర్‌ఆర్‌లో కలుస్తుంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.