close
వేలెత్తి చూపడానికి ఏమీ లేదు

విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నా
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం
జనవరి నుంచి నూతన ఆరోగ్యశ్రీ కార్డులు
కొత్తగా ఏడు బోధనాస్పత్రుల ఏర్పాటు
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీ
గుంటూరులో ‘ఆరోగ్యశ్రీ ఆసరా’ ప్రారంభం

ఆరు నెలల్లోనే మంచి పాలన అందించా. వేలెత్తి చూపడానికి ఏమీ లేదు. అయినా కొందరు విమర్శలు చేస్తున్నారు. చివరకు నా కులం, మతం గురించి మాట్లాడటం చూస్తే బాధనిపిస్తోంది. అయినా అవేం పట్టించుకోకుండా ప్రజల కోసం ముందుకెళ్తా. నా మతం మానవత్వం. నా కులం మాట నిలబెట్టుకోవడం. మీ దీవెనలు, దేవుని దయతో సమస్యలను అధిగమిస్తున్నా.

- ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, గుంటూరు: ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జాతీయస్థాయి వైద్య ప్రమాణాలకు చేరువయ్యేలా, ప్రైవేటులో అపోలో ఆస్పత్రులకు దీటుగా... రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవల్ని అందించేందుకు కృషిచేస్తామన్నారు. అందులో భాగంగానే ‘నాడు- నేడు’ కింద రానున్న మూడేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడానికి రూ.13వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. ఆరోగ్య ఉపకేంద్రం మొదలు బోధనాస్పత్రి వరకు అన్నింటినీ ఆధునికీకరిస్తామని, ఈ పనులను డిసెంబరులోనే మొదలుపెడతామని వెల్లడించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నూతనంగా అమల్లోకి తెచ్చిన ‘ఆరోగ్యశ్రీ ఆసరా’ పథకాన్ని సోమవారం గుంటూరులో ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘ఆరు నెలల్లోనే మంచి పాలన అందించా. వేలెత్తి చూపడానికి ఏమీ లేదు. అయినా కొందరు విమర్శలు చేస్తున్నారు. చివరకు నా కులం, మతం గురించి మాట్లాడటం చూస్తే బాధనిపిస్తోంది. అయినా అవేం పట్టించుకోకుండా ప్రజల కోసం ముందుకెళ్తా. పేదవారు ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకుని ఇంటికి వెళ్లగానే కడుపు నింపుకొనే ఆర్థికస్థోమత లేక పనులకు వెళ్లడం, పస్తులు ఉండడటం వంటివి చేస్తున్నారని పాదయాత్రలో తెలుసుకున్నా. వారికి ఆరోజే ఆసరాగా ఉంటానని మాటిచ్చి దాన్ని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నందుకు గర్వపడుతున్నా. ఏ శస్త్రచికిత్సకు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరమో వైద్యులు నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే రోగులకు ‘ఆరోగ్య ఆసరా’ కింద విశ్రాంతి భత్యాన్ని ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా చెల్లిస్తాం’’ అని పేర్కొన్నారు. వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారందరికీ జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వీటికి క్యూఆర్‌ కోడ్‌ కేటాయిస్తామని చెప్పారు. ప్రతి పేషెంట్‌ మెడికల్‌ ట్రాక్‌ రికార్డు అందులో నమోదు చేస్తామని తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని 1200 జబ్బులకు విస్తరించామని, మున్ముందు దీన్ని 2వేల రోగాలకు వర్తింపజేస్తామని హామీనిచ్చారు. రూ.1000కు మించి ఖర్చయ్యే వైద్యానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, దీన్ని తొలుత ప్రయోగాత్మకంగా పశ్చిమగోదావరిలో జనవరిలో మూడు నెలల పాటు అమలు చేసి, ఏప్రిల్‌ నుంచి ఒక్కో జిల్లాలో అమలు చేస్తూ ముందుకెళ్తామని వివరించారు. 2వేల వ్యాధులకు విస్తరించే పథకాన్ని కూడా మొదట పశ్చిమగోదావరిలోనే అమలు చేస్తామని తెలిపారు.

20 నిమిషాల్లోపే చేరాలి...
104, 108 అంబులెన్సులు ఫోన్‌ చేస్తే వస్తాయో రావో తెలియదని, ఈ వ్యవస్థను మార్చటానికి కొత్తగా 1060 అంబులెన్స్‌లు కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవి 20 నిమిషాల లోపే బాధితుల వద్దకు చేరుకుని, మంచి వసతులున్న ఆస్పత్రులకు తీసుకెళ్తాయని తెలిపారు. గత పాలకులు కనీసం ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ‘‘ఈ రోజు గుంటూరు జీజీహెచ్‌ స్టాఫ్‌ నర్సులు ఖాళీ పోస్టుల సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా మెరుగైన వైద్యసేవల కోసం వైద్యులు, స్టాప్‌ నర్సుల ఖాళీలను వచ్చే మే కల్లా భర్తీ చేస్తాం. మంచి సమాజం ద్వారానే ప్రతి వ్యక్తి వైద్య వ్యయాలను తగ్గించుకోగలరని భావించి రాష్ట్రంలో మద్య నిషేధం దిశగా అడుగులు ప్రారంభించాం. ప్రజలు, సమాజంలో కూడా మార్పు రావాలి’’ అని సీఎం ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను అనుసరించి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన ఔషధాలు సమకూర్చుకుని ప్రజలకు పంపిణీ చేస్తామని సీఎం చెప్పారు. ఈ నెల 15 నాటికి 510 రకాల మందులు ఆసుపత్రులకు చేరతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా అన్ని ఆసుపత్రుల్లో నాణ్యత కలిగిన మందులు ఉంటాయని చెప్పారు. వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం కింద విద్యార్థులకే కాకుండా రాష్ట్రం మొత్తం ప్రజలకు కంటి పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేన్సర్‌ రోగులకు కీమోథెరపీకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, చెవిటి, మూగ పిల్లలకు డైకో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ పరికరాలు జవనరి నుంచి అమర్చుతామని ముఖ్యమంత్రి చెప్పారు.


నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 6 నెలల గడువు..

ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం నమోదైన (ఎంప్యానల్‌ కలిగినవి) ప్రైవేటు నెట్‌ వర్క్‌ ఆసుపత్రుల సేవలపైనా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున రుసుములు పొందుతూ రోగులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆరు నెలలు సమయమిస్తున్నా. ప్రతి ఆస్పత్రి ఏప్లస్‌ గ్రేడ్‌కు చేరుకోవాలి. లేకపోతే ఆసుపత్రిని ఎంప్యానల్‌ జాబితా నుంచి తొలగిస్తాం’’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్తగా విజయనగరం, పాడేరు, ఏలూరు, గురజాల, మచిలీపట్నం, మార్కాపురం, పులివెందులకు బోధనాసుపత్రులను మంజూరు చేస్తున్నట్లు సభాముఖంగా చెప్పారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి సుచరిత, మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణరావులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నిధులు పక్కదారి పట్టించిందని విమర్శించారు. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. అంతకుముందు జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు చేయించుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. అక్కడ కొందరికి ఆసరా సాయం అందజేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.