close
రాష్ట్రంలో రద్దుల ప్రభుత్వం

అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారు?
పెట్టుబడులు ఎక్కడా రావడం లేదు
ఆర్థిక శాఖ గురించి బుగ్గనకు ఏం తెలుసు?
మేం మత సామరస్యాన్ని కాపాడాం
ప్రస్తుత ఘర్షణలకు సర్కారుదే బాధ్యత
కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు డిజిటల్‌ - కర్నూలు

తెదేపా హయాంలో మత సామరస్యాన్ని కాపాడాం. ఇప్పటి తితిదే ఛైర్మన్‌ చేతకానితనంతో తిరుమల బస్సు టిక్కెట్లపై జెరూసలెం యాత్ర ముద్రలు వేయించారు. ప్రకాశం జిల్లా కొమరోలులో మేరీమాత విగ్రహాన్ని గుర్తుతెలియనివారు ధ్వంసం చేశారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మతమనేది సున్నితమైంది. దేవాలయంలో, సమాజంలో ఘర్షణలు పడే పరిస్థితికి బాధ్యత ప్రభుత్వానిదే.

- చంద్రబాబు

రాష్ట్రంలో రద్దుల ప్రభుత్వం పాలిస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారని ఆయన నిలదీశారు. పెళ్లి కానుకను తెదేపా ప్రభుత్వం రూ.లక్ష ఇస్తే ప్రస్తుతం దాన్నీ రద్దు చేసే పరిస్థితికి తెచ్చారన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు కర్నూలులో సోమవారం జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘చంద్రన్న బీమాను లోగడ రూ.5 లక్షలిచ్చాం. ఎన్నికల సమయంలో రూ.10 లక్షలకు పెంచుతామన్నాం. ఈ ప్రభుత్వం బీమా ఇస్తుందా తమ్ముళ్లూ?’ అని కార్యకర్తలను ప్రశ్నించారు. రాష్ట్రంలో 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి తాము శ్రీకారం చుడితే.. పేదలు మంచి ఇళ్లలో ఉండటం ఇష్టం లేక నిలిపేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామంటూ ముద్దులు పెడుతూ చెప్పిన జగన్‌ ఇప్పుడు పిడిగుద్దులు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అమ్మఒడి సాయంపై మెలికలు పెడుతున్నారు. ఒప్పంద ఉద్యోగులను తీసేసి 4 లక్షల వైకాపా కార్యకర్తలకు వాలంటీర్ల పోస్టులను ఇచ్చారు. గ్రామసచివాలయాల ఉద్యోగాలను 90 శాతం వైకాపా కార్యకర్తలకే ఇచ్చామని ఏ2 (విజయసాయిరెడ్డి) చెప్పారు. రంగుల పిచ్చి పరాకాష్టకు చేరింది. దేవుడికి కూడా రంగేస్తే ఆ భగవంతుడే చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.

పెట్టుబడిదారులు పారిపోతున్నారు
‘రైతులిచ్చిన భూమితో రాజధాని అమరావతి అభివృద్ధికి శ్రీకారం చుడుతూ రూ.2 లక్షల కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చేలా చూశాం. ఒక వ్యక్తి తీరుతో మరోవైపు నీటిపారుదల ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. తిరుపతిలో రిలయన్స్‌ రూ.15 వేల కోట్లతో ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీకి ముందుకొస్తే ఇప్పుడు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఒంగోలులో రూ.25 వేల కోట్లతో మెగా పేపర్‌మిల్లు పెడతామని ముందుకొచ్చిన వారూ వెనక్కి వెళ్లారు. విశాఖలో రూ.70 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధికీ అడ్డం పడ్డారు.
రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు బనకచర్లకు రావాలి. ఈ దిశలో ప్రభుత్వం పనిచేస్తే తెదేపా సహకరిస్తుంది. తెదేపా హయాంలో అప్పులు చేస్తే కట్టలేక ఇప్పుడు బాధపడుతున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన అంటున్నారు. ఆయనకు తన శాఖ గురించి తెలుసా? ఆయన ఎంత గొప్ప వారంటే.. కోడిగుడ్ల టెండర్లలోనూ ఆయన మనుషులు కొట్లాడుకున్నారు. తప్పు ఎక్కడ జరిగినా తెదేపా కార్యకర్తలు వారి గుండెల్లో నిద్రపోతారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

తెదేపాను దెబ్బతీయలేరు..
తెలుగుజాతి ఉన్నంతవరకు తెదేపాను దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ ఇది అని, అంత తేలిగ్గా ఊహించుకోవద్దని సూచించారు. నీరు-చెట్టు, నరేగాలో సీసీ రోడ్ల పనులకు డబ్బులివ్వకుండా అడ్డుకుంటున్నారని, ఇలాంటి ఒత్తిళ్లతోనే శ్రీశైలం నియోజకవర్గంలో కార్యకర్త కొండారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని వివరించారు. కొండారెడ్డి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తామని హామీనిచ్చారు.

విద్యార్థి యువజన సంఘాల నిరసన
రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు కర్నూలులో చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కర్నూలు- బెంగళూరు జాతీయ రహదారిపై వెంగన్న బావి సమీపంలో రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేశారు.

నాగరిక ప్రపంచం కలత చెందేలా దిశపై హత్యాచారం జరిగింది. నిందితులు మృగాలకంటే హీనంగా ప్రవర్తించారు. ప్రతి ఒక్కరూ ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి దుర్మార్గులను ఉరి తీస్తే తప్ప మిగిలిన వారు భయపడరు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.