close

ప్రధానాంశాలు

దిశ ఆధారాలపై ‘సూపర్‌ లైట్‌’

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్లూస్‌ పరిశోధన
లారీ క్యాబిన్‌ తలుపుపై రక్తపు మరకల గుర్తింపు
రాయచూర్‌ నుంచి రాజేంద్రనగర్‌ వరకు సీసీ ఫుటేజీల సేకరణ
ఆధారాల సేకరణ తర్వాతే నిందితుల కస్టడీ?

ఈనాడు, హైదరాబాద్‌, షాద్‌నగర్‌ పట్టణం: దిశ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు. ఇందుకోసం నిపుణులతో కూడిన క్లూస్‌ బృందాన్ని రంగంలోకి దించారు. నిందితులను అరెస్ట్‌ చేసిన సమయంలోనే పలు ఆధారాల్ని సేకరించినా.. కేసును న్యాయస్థానంలో నిరూపించేందుకు అవసరమైన కీలక ఆధారాల్ని మలివిడతలో క్లూస్‌ నిపుణులు సేకరించారు. ఈక్రమంలో శంషాబాద్‌ తొండుపల్లి, షాద్‌నగర్‌ చటాన్‌పల్లిల్లోని సంఘటన స్థలాల్లో గురువారం క్షుణ్నంగా తనిఖీలు చేశారు. షాద్‌నగర్‌ డిపోలో ఉన్న లారీని మరోసారి పరిశీలించారు. అతిసూక్ష్మ వస్తువుల్ని సైతం గుర్తించగలిగే ‘సూపర్‌లైట్‌’ పరికరాన్ని వినియోగించి ఆధారాల్ని సేకరించారు.

శంషాబాద్‌ టోల్‌ప్లాజా నుంచి దిశను కొత్తూరు జేపీ దర్గా వద్దకు తీసుకెళ్లిన దుండగులు అక్కడ మరోసారి అకృత్యానికి పాల్పడ్డారు. అనంతరం చటాన్‌పల్లికి తీసుకెళ్లి కాల్చి చంపేశారు. ఆ సమయంలో లారీలో ఆధారాలు దొరక్కుండా నిందితులు కొంతమేర శుభ్రం చేసినా.. పోలీసులు ఇప్పటికే వెంట్రుకలు సేకరించారు. తాజాగా సూపర్‌ లైట్‌ను వినియోగించి లారీ క్యాబిన్‌లో రక్తపు మరకల్ని గుర్తించగలిగారు. డ్రైవర్‌ వైపు కాకుండా రెండో వైపు తలుపుపై ఈ మరకల్ని సేకరించారు. ఇవి దిశ రక్తపు మరకలేనా? అనేది తేల్చగలిగితే కేసుకు బలమైన ఆధారం అవుతుంది. ఆ మరకల్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి విశ్లేషించనున్నారు. లారీ వెనుక ట్రాలీలో ఇటుకలోడు ఉండటంతో దిశను నిందితులు క్యాబిన్‌లోనే తరలించినట్లు సమాచారం. నిందితుల వద్ద దిశ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఏసీపీల నేతృత్వంలో బృందాలు
కేసును ఫాస్ట్‌ట్రాక్‌లో విచారించనున్న నేపథ్యంలో త్వరితగతిన కీలక ఆధారాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఏసీపీల నేతృత్వంలో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. కేసులో సాక్ష్యాల సేకరణ, వాంగ్మూలాల సేకరణ, సీసీ కెమెరాల ఫుటేజీల విశ్లేషణ, నిందితుల ఫోన్‌కాల్‌ డేటా విశ్లేషణ.. తదితర అంశాల్ని విభజించి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఆధారాల్ని సేకరించి అభియోగపత్రం పకడ్బందీగా రూపొందించే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలో కేసులో నిందితులు ప్రయాణించిన మార్గాల్లో సీసీ ఫుటేజీలను బలమైన ఆధారాలుగా మలచడంపై పోలీసులు దృష్టి సారించారు. దిశపై అకృత్యానికి పాల్పడిన నిందితులు ఒకట్రెండు రోజుల వ్యవధిలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ నుంచి రాజేంద్రనగర్‌ సిక్‌చావునీ వరకు ప్రయాణించారు. గత నెల 21న కీలక నిందితుడు మహ్మద్‌ అలీ క్లీనర్‌తో కలిసి ఇనుపరాడ్ల లోడుతో కర్ణాటకలోని రాయచూర్‌ వెళ్లాడు. అక్కడ లోడ్‌ దించిన అనంతరం అదే నెల 24న గంగావతి వెళ్లి ఇటుకల లోడ్‌తో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. మార్గమధ్యంలో మహబూబ్‌నగర్‌ వద్ద ఆర్టీఏ లారీని తనిఖీ చేశారు. అక్కడి నుంచి తప్పించుకొచ్చిన నిందితులు రాయికల్‌ టోల్‌ ప్లాజా వద్ద స్టీల్‌రాడ్లను తుక్కు దుకాణంలో విక్రయించారు. 26న రాత్రి 9 గంటల సమయంలో శంషాబాద్‌ టోల్‌ప్లాజా వద్దకు వచ్చి అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడికి సమీపంలోని తొండుపల్లి ప్లాజా వద్దే గడిపారు. అదే రాత్రి దిశపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెను లారీ క్యాబిన్‌లో తరలించేటప్పుడు రెండు పెట్రోల్‌ బంకులకు వెళ్లారు. మృతదేహాన్ని కాల్చేసిన అనంతరం తెల్లవారుజామున 4 గంటల వరకు రాజేంద్రనగర్‌ చేరుకున్నారు. ఈనేపథ్యంలో నిందితులు ఆగిన ప్రతీచోట సీసీ ఫుటేజీలను సేకరించడంపై దర్యాప్తు బృందాల సభ్యులు దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల్ని సేకరిస్తున్నారు. మహబూబ్న్‌గర్‌ ఆర్టీఏకు నోటీస్‌ ఇచ్చి ఆయన్నీ విచారించనున్నారు. ఈ ఆధారాలన్నీ పకడ్బందీగా సేకరించిన తర్వాతే వాటిని విశ్లేషించుకొని నిందితుల్ని కస్టడీకి తీసుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు నిందితుల్ని కస్టడీకి తీసుకొని రహస్యంగా సంఘటన స్థలాలకు తరలించారని.. ఆయా సంఘటనల్ని పునఃసృష్టించారని పెద్దఎత్తున ప్రచారం జరిగినా సైబరాబాద్‌ ఉన్నతాధికారులు ఖండించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.