close

ప్రధానాంశాలు

దుమ్ముగూడెం వద్ద బ్యారేజి

37 టీఎంసీల గోదావరి నీటి నిల్వ
సాగర్‌ ఆయకట్టు కోసం ప్రత్యేక ప్రణాళిక
తెలంగాణ సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల గోదావరి నీటి నిల్వ చేసేందుకు కొత్త బ్యారేజి, 320 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్లాంటు నిర్మించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు మూడు టీఎంసీల నీటి ఎత్తిపోతల(లిఫ్టు)కు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ రెండు పనులకు మొత్తం రూ.13,500 నుంచి రూ.14,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. దీనికి సంబంధించి వెంటనే అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ గురువారం సమీక్ష నిర్వహించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మధ్యమానేరుకు ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని పంప్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రోజుకు మూడు టీఎంసీలను లిప్టు చేయాలి. అందులోంచి రెండు టీఎంసీలను మల్లన్న సాగర్‌కు పంపాలి.

కృష్ణా నదిలో నీటిప్రవాహం లేని సమయంలో నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీరందించే ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలి. మధ్యమానేరుకు మూడు టీఎంసీల నీళ్లు వస్తాయి. కాబట్టి పుష్కలమైన జలం అందుబాటులో ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నింపి, అక్కడి నుంచి షామీర్‌పేట వాగు, మూసీ నది, ఆసిఫ్‌ నహర్‌కు నీటిని తరలించాలి. ఉదయ సముద్రాన్ని బైపాస్‌ చేసి పానగల్‌ వాగులో కలపాలి. అక్కడి నుంచి నేరుగా నాగార్జునసాగర్‌ ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌ అయిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని చేర్చాలి. దీనిద్వారా గోదావరి నీటిని సాగర్‌ ఆయకట్టుకు అందించవచ్చు. ఈ పనులపై సంపూర్ణ అవగాహన వచ్చేందుకు నీటిపారుదలశాఖ అధికారులు, విశ్రాంత ఇంజినీర్లు త్వరలోనే ఈ ప్రాంతాల్లో పరిశీలించాలి.’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

పురుషోత్తపట్నం ఎత్తిపోతల అంచనాల సవరణ
ఈనాడు, అమరావతి: గోదావరి ఎడమ   గట్టుపై పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం రెండు దశలకూ కలిపి రూ.1,931.455 కోట్ల విలువతో అంచనాలు సవరిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. తొలుత ఈ పథకాన్ని రూ.1,637.48 కోట్ల అంచనాతో చేపట్టేందుకు 2016 అక్టోబరు 14న పాలనామోదం ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువపై రెండోదశ పంపుహౌస్‌ నిర్మాణం మొదట ప్రతిపాదించిన 57.88వ కిలోమీటరు వద్ద కాకుండా, 50వ కిలోమీటరుకు మార్చడంతో తదనుగుణంగా అంచనాలు సవరించి, రూ.1,627.04 కోట్లకు అంచనాలు తగ్గిస్తూ 2018 ఏప్రిల్‌లో ఉత్తర్వులిచ్చారు. జీఎస్టీని అమలుచేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ 2018 మే నెలలో మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో 2017 జులై 1న చేసిన పనులను, ఆ తర్వాత చేసిన పనులను విడగొడుతూ జీఎస్టీ మార్గదర్శకాలను అమలుచేస్తూ, ఒప్పందం ప్రకారం అదనపు ధరలు ఇచ్చే నిబంధనలు అమలు చేస్తూ తాజాగా అంచనాలు సవరించినట్లు పేర్కొన్నారు.
చింతలపూడి ఎత్తిపోతలలో సంయుక్త పంపుహౌస్‌లు: చింతలపూడి ఎత్తిపోతల పథకంలో మొదటి, మూడు ప్యాకేజీలలో పంపుహౌస్‌లు సంయుక్తంగా నిర్మించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి స్థాయీసంఘం, ఐబీఎం కమిటీల ప్రతిపాదనలను ఆమోదిస్తూ జలవనరులశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ రెండింటికి రూ.277.429 కోట్లతో నిర్మాణానికి ఆమోదించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.