close

ప్రధానాంశాలు

అమరావతిని ఆపొద్దు

ప్రజల భవిష్యత్తు కోసం అమరావతి నిర్మాణాన్ని తలపెట్టాం
తప్పు చేస్తే చర్యలు తీసుకోండి
నిరూపిస్తే క్షమాపణలు చెబుతాం
ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్‌
రౌండ్‌టేబుల్‌ సదస్సులో భావోద్వేగ ప్రసంగం

‘‘అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ఒక మెగాసిటీ, దానికి అనుబంధంగా మిగతా నగరాల్ని అభివృద్ధి చేయాలన్నది మన సంకల్పం. దాన్ని ఈ ప్రభుత్వం నీరుగారుస్తోందన్న బాధ, ఆవేదన నాలో ఉంది. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మీరు తప్పులు చేసినట్టే అందరూ చేస్తారని ఎందుకనుకుంటున్నారు? రాజధానిలో బినామీ లావాదేవీలు జరిగితే ప్రాసిక్యూట్‌ చేయండి. ఆ నెపంతో అమరావతి నిర్మాణం ఆపేసి రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు’’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజా చైతన్యమే ఈ సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో తెదేపా గురువారం విజయవాడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సదస్సులో ఆయన మాట్లాడారు.


మనకూ ఒక గొప్ప రాజధాని నగరం ఉందని సగర్వంగా చెప్పుకునేందుకూ, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకూ అమరావతికి శ్రీకారం చుట్టాం. నేను చేసింది తప్పు అని నిరూపించినా, ఈ ప్రాజెక్టు తప్పు అని ప్రజలు అన్నా...   క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.

- చంద్రబాబు

 

ఈనాడు అమరావతి: వైకాపా ప్రభుత్వం తప్పుడు వార్తలు ప్రచారం చేసి రాజధాని అమరావతిని చంపేయాలనుకుంటోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. తాము తప్పులు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని ఆయన సవాల్‌ చేశారు. ‘‘మీరు తప్పులు చేసినట్టే అందరూ చేస్తారని ఎందుకనుకుంటున్నారు? రాజధానిలో బినామీ లావాదేవీలు జరిగితే ప్రాసిక్యూట్‌ చేయండి. ఆ నెపంతో అమరావతి నిర్మాణం ఆపేసి రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు’’ అని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం తలపెట్టింది తన స్వార్థం కోసమో, బంధువులు, కుటుంబ సభ్యుల కోసమో కాదన్నారు. ‘ప్రజా రాజధాని అమరావతి- ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన’ అన్న అంశంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో తెదేపా గురువారం విజయవాడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సదస్సులో చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు.

‘‘రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అభాండాలు వేస్తున్నారు. ఫలానా చోట రాజధాని వస్తుందని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం. అక్కడ అంతా కలిపి 116 ఎకరాల క్రయ విక్రయాలు జరిగాయి. చిన్నచిన్న వాళ్లు కొనుక్కున్నారు. దానికి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని పేరు పెడతారా? రాజధాని ప్రకటన వెలువడ్డాక భూములు అమ్మడం, కొనుక్కోవడం రైతుల ఇష్టం. వాటికీ దీనికీ ఎలా ముడిపెడతారు?’’ అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే అమరావతిలో తూతూమంత్రంగా ఏవో చిన్న చిన్న రోడ్లు వేసి చేతులు దులిపేసుకునేలా కనిపిస్తోందని, మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తెదేపా సదస్సుకి పోటీగా తుళ్లూరులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ఆరోపణల్ని చంద్రబాబు తిప్పికొట్టారు.

కడుపు తరుక్కుపోతోంది..
ఇదే సదస్సులో ‘గ్రాఫిక్‌ చిత్రాలు కాదు... నేలపై నిజాలు’ పేరుతో అమరావతిలో ఇంత వరకు జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘‘రాజధానిలో అక్రమాలు జరిగాయని, బయట పెడతామని మంత్రులు అంటున్నారు. వాళ్లు బెదిరిస్తే మేం భయపడిపోవాలా? ఇక్కడ సదస్సు నిర్వహించినందుకు, రేపు మనపై కేసు పెట్టినా పెడతారు. మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా ఆదాయం కావాలి. మంచి రాజధాని ఉండాలి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘రాజధానికి ఎంతో గొప్ప ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. మనం చేసిన పాపమేంటి? గొప్ప రాజధాని నిర్మించుకునే అర్హత మనకు లేదా? రాజధాని పేరుతో స్థిరాస్తి వ్యాపారం చేశానని వైకాపా నాయకులు అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. నేను సంపద సృష్టించడం కోసం ఆలోచించాను. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ కట్టకముందు అక్కడ ఎకరం రూ.లక్ష ఉండేది. ఆ తర్వాత రూ.30 కోట్లకు వెళ్లింది. నా కులం కోసమో, బంధువుల కోసమో దాన్ని కట్టానా? తెలుగుజాతి కోసం దాన్ని నిర్మించాం. నేను మొదటి నుంచీ సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని. అలాంటి నాకు కులం, మతం అంటగడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డారు. ‘‘రాజధానికి 1500 ఎకరాలు సరిపోతుందని, ఫ్లాట్‌లు వేయడానికి సింగపూర్‌ సహకారం తీసుకున్నారని ఆర్థిక మంత్రి అంటున్నారు. 50 ఏళ్లుగా సింగపూర్‌ని అద్భుతంగా అభివృద్ధి చేశారు కాబట్టే, వారి సహకారం తీసుకున్నాం. వైకాపా నాయకుల అవినీతికి, ఇళ్ల నిర్మాణానికి వేల ఎకరాలు కావాలి గానీ, రాజధానికి వందల ఎకరాలు సరిపోతాయా?’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి యమునా నది నుంచి నీరు, పార్లమెంటు ఆవరణ నుంచి మట్టి తీసుకొచ్చిన ప్రధాని మోదీ.. అమరావతి నిర్మాణానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ వెళ్లి ప్రధానిని కలసి... రాజధానికి నిధులు అడగనని, అక్కడ ఏవో జరిగిపోయాయని, విచారణ పూర్తయ్యేంత వరకు డబ్బులు అవసరం లేదని చెప్పి వచ్చారు’’ అని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకం కింద నాణ్యమైన వైద్య సేవలందించేందుకు రాష్ట్రంలో సదుపాయాలు లేవని, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లోని ఆసుపత్రులకు విస్తరిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారని, అంటే మనం ఇక్కడ కష్టపడి కట్టిన పన్నుల్ని ఆ నగరాల్లో ఖర్చు పెట్టాలా? ఇక్కడ అలాంటి వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రభుత్వ తీరు గర్హనీయం
ఈ సదస్సుకి సీపీఐ, జనసేన, లోక్‌సత్తా, ఆప్‌, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, సమాజ్‌వాది, సమతా, ముస్లింలీగ్‌ తదితర 14 పార్టీల నాయకులు, 21 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వైకాపాని ఈ సదస్సుకి ఆహ్వానించలేదు. భాజపా, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలను పిలిచినా హాజరవలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న అమరావతి పనులు ఆరు నెలలుగా స్తంభించిపోవడం తీవ్ర ఆందోళనకరమని, అమరావతిపై నెలకొన్న సందిగ్ధతలకు తెరదించాలని పేర్కొంటూ సమావేశం ఒక తీర్మానం ఆమోదించింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను యథాతథంగా అమలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం పనుల్ని శరవేగంగా పూర్తి చేయాలని, అఖిలపక్షం వేయాలని ఏకగ్రీవంగా కోరింది. సదస్సు నిర్వహించిన హాలు బయట ‘సేవ్‌ అమరావతి’ పేరిట సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. హాలులోకి రాకముందు చంద్రబాబు అక్కడ సంతకం చేశారు.


అభివృద్ధిని తాకట్టు పెట్టొద్దు

‘‘చంద్రబాబుతో విభేదాలుంటే ఆయనతో తేల్చుకోండి. రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టకండి. జగన్‌ అభివృద్ధిని కొనసాగిస్తే ఆయనకూ మేం సహకరించేవాళ్లం. రాజధానిలో బలవంతపు భూసేకరణ వద్దని విజ్ఞప్తి చేయగానే చంద్రబాబు ఆపేశారని పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికీ చెబుతారు. చంద్రబాబును ముందు పెట్టి, అందరూ కలసి వెళ్లి కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడుగుదాం.’’

- బొలిశెట్టి సత్యనారాయణ,
జనసేన ప్రధాన కార్యదర్శి

 

 

అమరావతిని అక్కడే ఉంచండి

‘‘ఏపీ దుస్థితి ఏ రాష్ట్రానికీ లేదు. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిదని ముద్ర వేయాలన్నట్టుగా అధికార పార్టీ వైఖరి ఉంది. రాజధాని విషయంలో అదే చేస్తున్నారు. అమరావతిని అక్కడే ఉంచండి.’’

- ప్రసాద్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ

 

పనులు కొనసాగించాల్సిందే
ఏకగ్రీవంగా తీర్మానించిన రౌండ్‌టేబుల్‌ సదస్సు

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను యథాతథంగా అమలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం పనుల్ని శరవేగంగా పూర్తి చేయాలని సమావేశం విజ్ఞప్తి చేస్తోంది. ఆలస్యమయ్యే ప్రతిక్షణం నిర్మాణ వ్యయాన్ని పెంచుతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలి. రాజధాని అమరావతిపై చర్చించేందుకు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.